ట్రంప్‌ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్‌ కొత్త ప్లాన్‌ ఇదేనా? | Israel new plan aimed at provoking Trump amid Middle East tensions | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్‌ కొత్త ప్లాన్‌ ఇదేనా?

Jun 9 2026 1:56 PM | Updated on Jun 9 2026 2:11 PM

Israel new plan aimed at provoking Trump amid Middle East tensions

పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్‌ రాజధాని బీరూట్‌పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్‌నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్‌ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్‌ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్‌ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్‌ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది.  ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్‌ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు  అనేది పరిశీలిస్తే..

ఇరాన్‌పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు.  

లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్‌ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్‌ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్‌కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్‌లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.

ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్‌పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.

సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్‌పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్‌ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్‌తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్‌కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరాన్‌పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement