మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు | Iran Supreme Leader Breaks Silence On US Deal, Says He Approved It Reluctantly And Warns Against Extra American Demands | Sakshi
Sakshi News home page

మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు

Jun 19 2026 7:06 AM | Updated on Jun 19 2026 10:11 AM

We Did not Need It Trump Did Khamenei Reacts on Peace Deal

అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రయోజనాలు, "రెసిస్టెన్స్ ఫ్రంట్" హక్కులు కాపాడతామనే హామీతోనే తాను ఈ ఒప్పందానికి అంగీకరించానని అన్నారాయన. ఈ క్రమంలోనే ట్రంప్‌ తీరుపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన తర్వాత ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన సందేశంలో మొజ్తబా ఖమేనీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం తామేమీ ప్రయత్నించలేదని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తీవ్రంగా ఆరాటపడ్డారని.. ఈ క్రమంలో "అన్ని రకాల ఒత్తిళ్లు, ఎత్తుగడలు" ఉపయోగించారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

తొలుత తాను ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించానని.. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌, జాతీయ భద్రతా మండలి సభ్యులు తనను ఒప్పించారని అన్నారు. ఇరాన్‌ ప్రయోజనాలు దెబ్బతినవని హామీ ఇవ్వడంతోనే ఆమోదం తెలిపినట్లు చెప్పారు. "ఈ ఒప్పందం కోసం ఇరాన్ అధికారులు నిజాయితీగా కృషి చేశారు. కానీ దీనిని సాధించేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు ఉపయోగించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడే. నిరాశతోనే ఈ డీల్‌ను ముందుకు తీసుకొచ్చాడు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో అమెరికా ఒప్పంద పరిధిని దాటి అదనపు షరతులు విధించాలనుకుంటే వాటికి తాము లొంగబోమని అధ్యక్షుడు తనకు స్పష్టంగా చెప్పారని ఖమేనీ వెల్లడించారు. ఇరాన్ హక్కులు, స్వాతంత్ర్యం, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో అమెరికాతో ముఖాముఖి చర్చలు జరగడం అంటే.. అమెరికా వైఖరిని అంగీకరించినట్లు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ బలగాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన యుద్దం ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఆనాడు ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన మొబ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్యలో నాయకత్వ బాధ్యతలు ఇరాన్‌లో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు.. మత, భద్రతా వర్గాల మద్దతుతో మొజ్తాబానే కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. తాజాగా అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఖమేనీకి మద్దతుగా విదేశాంగ మంత్రి
ఖమేనీ ప్రకటనతో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఏకీభవించారు. సుప్రీం లీడర్ మార్గదర్శకాల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చర్చల తదుపరి దశలో దేశ ప్రయోజనాలు, గౌరవం, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం ముగించే ఒప్పంద తాలుకా ఎంవోయూపై ఇరు దేశాల అధినేతలు డిజిటల్‌ సంతకాలు చేశారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి చర్యలు ప్రారంభమయ్యాయి. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమలు చేస్తున్న సముద్ర నిర్బంధ చర్యలను అమెరికా సెంట్రల్ కమాండ్ నిలిపివేసింది. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చీపోయే వాణిజ్య నౌకలపై ఆంక్షలు ఉండవని ప్రకటించింది.

మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ చర్యలు ప్రారంభించింది. వచ్చే 60 రోజుల పాటు నౌకలకు వేగవంతమైన అనుమతులు, జలసంధి రుసుముల మినహాయింపు కల్పిస్తామని వెల్లడించింది.

ఒప్పందంలో అసలు ఏముంది?
"ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్" పేరుతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక చర్యలను నిలిపివేయాలి. హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అలాగే 60 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి. ఆ చర్చల్లో ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక..ఇటు స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన కీలక సమావేశం యథాతథంగా జరగనుంది. అమెరిరా, ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు.  అవగాహన ఒప్పందం అమలుతో పాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement