పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతుండడం.. లెబనాన్‌పై కొనసాగుతున్న భీకర దాడులు శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న ఆందోళనలు పెంచుతున్నాయి.
అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన శాంతి చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలోనే మిడిల్‌ఈస్ట్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డీల్‌కు ససేమీరా చెబుతూ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ చర్యలకు దిగింది. లెబనాన్ రాజధాని బీరూట్‌తో పాటు దక్షిణ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. కఫర్ టెబ్నిట్ ప్రాంతంలో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఆదివారం హెజ్‌బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి జనావాసాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని లెబనాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ జోక్యం కోరుతున్నారు.
డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించిన వేళ.. ఇజ్రాయెల్ వైపు నుంచి మరింత కఠిన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ‘‘ట్రంప్ నిర్ణయాలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తాం. భద్రతా విషయంలో రాజీ పడేది లేదు’’ అని నెతన్యాహు చెప్పినట్లు అంతర్జాతీయా మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.
ఇక ట్రంప్ కుదిర్చిన ఒప్పందం తమను కట్టిపడేయదని ఇజ్రాయెల్ మంత్రి ఇత్మార్ బెన్ గ్విర్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. “భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అనే సందేశాన్ని ఇజ్రాయెల్ స్పష్టంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, ప్రధాని నెతన్యాహుతో కలిసి తాము స్పష్టమైన భద్రతా విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో భద్రతా జోన్లలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిడులున్నప్పటికీ తమ వైఖరిలో మార్పు ఉండదని, దేశ భద్రతే ప్రధాన ప్రాధాన్యమని ఆయన తేల్చిచెప్పారు. లెబనాన్ పరిణామాల కారణంగా ఇరాన్ దాడి చేస్తే తక్షణ ప్రతిచర్య తప్పదని ఆయన హెచ్చరించారు.
🔴 Israel’s Defense Minister Israel Katz says that along with Prime Minister Benjamin Netanyahu, he is leading a clear policy that states that the Israeli army will remain in the security zones in Lebanon, Syria and Gaza
🔴 Katz says that Israel opposes the Israeli army’s… pic.twitter.com/dYPahEDsTE— Al Arabiya English (@AlArabiya_Eng) June 15, 2026
అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, నెతన్యాహు చాలా కఠినమైన నాయకుడని, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతి చర్చలను క్లిష్టం చేశాయని వ్యాఖ్యానించారు. బీరూట్ ఘటనలు అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తం పరిణామాలను చూస్తే, ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు లెబనాన్ కేంద్రంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యలు ఆ ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ గనుక ఈ దాడులకు ప్రతిస్పందిస్తే.. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు మళ్లీ ప్రమాదంలో పడిన పరిస్థితి నెలకొంది.


