
మోదీతో మాక్రాన్ చర్చలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నట్టు భారత్, ఫ్రాన్స్ పునరుద్ఘాటించాయి. ప్రధాని నరేంద్ర మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శనివారం ఫోన్‌లో సంభాషించారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై ఇరు నేతలు లోతుగా చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మాక్రాన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు మోదీ తెలిపారు. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం తదితరాలను సమీక్షించినట్టు వివరించారు.
ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనిపెట్టాలన్న వైఖరికే భారత్ తొలినుంచీ గట్టి మద్దతుదారుగా ఉందని పునరుద్ఘాటించారు. ప్రపంచ శాంతి, సుస్థిరతలను పెంపొందించడంలో ఇరు దేశాలు ఇకపై కూడా కీలకపాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఫిబ్రవరిలో భారత్‌లో జరిగే ఐఏ శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అంగీకరించినందుకు మాక్రాన్‌కు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తన ఇటీవలి చర్చలు ఫలప్రదంగా సాగాయని మాక్రాన్ పేర్కొన్నారు.