ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇరాన్‌తో కుదిరిన తాజా శాంతి ఒప్పందం అనేది ఇజ్రాయెల్‌కు దక్కిన బెస్ట్ డీల్ అని.. ఇంతకు మించి ఆ దేశానికి ఇంకేది అక్కర్లేదని.. ఇదే విషయాన్ని తాను నెతన్యాహుకి చెప్పానని అన్నారాయన.
ఇరాన్–అమెరికా మధ్య తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి ముందు తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్‌కు ఉన్న అత్యంత పెద్ద భద్రతా ముప్పు తొలగిపోయిందని ఆయన అన్నారు.
ఆ సంభాషణలో “ఆలోచించు బీబీ(నెతన్యాహుని ఉద్దేశించి.. ఆయన ముద్దు పేరు, పైగా రాజకీయ వర్గాల్లో అలానే పిలుస్తారు).. నీకు ఇది బెస్ట్ డీల్. ఇకపై ఇజ్రాయెల్‌పై అణు దాడి ప్రమాదం ఉండదు” అని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండే ప్రమాదమే ఇజ్రాయెల్‌కు అతిపెద్ద భయం అని, ఈ ఒప్పందంతో ఆ ముప్పు తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. “ఇజ్రాయెల్ కోరుకున్న అత్యంత కీలకమైన భద్రతా హామీ ఇదే” అని నెతన్యాహుకు చెప్పినట్లు వెల్లడించారు.
ఫ్రాన్స్ ఈవియన్-లెస్-బెయిన్స్‌లో G7 సమావేశం జరిగింది. దీనికి హాజరైన ట్రంప్ పారిస్‌లోని ఓ హోటల్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందుకు ట్రంప్ హాజరయ్యారు. అక్కడే ఆయన ఇరాన్‌తో ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ మీద సంతకం చేశారు. ఆ సమయంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు అమెరికా-ఇరాన్ ఒప్పందంపై పూర్తి స్పష్టత ఇంకా లేదు. ఎంవోయూ ప్రకారం.. ఇరాన్ తన అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించాల్సి ఉంటుందని, అలాగే కొన్ని ఆంక్షల సడలింపు అంశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, హెజ్‌బొల్లా గ్రూపుల అంశం వంటి సున్నిత విషయాలు కూడా ఈ ఒప్పంద చర్చల్లో భాగమయ్యాయి.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై దాడికి దిగడంతోనే పశ్చిమాసియా యుద్ధం మొదలైందన్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించినప్పటికీ.. హెజ్‌బొల్లాను తుడిచిపెట్టే ఉద్దేశంతో లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని వద్దని వారించినా.. నెతన్యాహు మాత్రం పరిమిత దాడులు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లెబనాన్‌లో భారీగా ప్రాణ నష్టం(దాదాపు 5 వేలమంది) సంభవించింది. అయితే ఇరాన్-అమెరికా ఒప్పందంలో లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో సైనికచర్యలు నిలిపి వేయాలనే ప్రతిపాదన ఉంది.
ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తమ భద్రత కోసం చేపట్టే చర్యల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు సొంత వర్గంలోని కొందరు మాజీ నేతలు నెతన్యాహుపై ఒత్తిడిని పెంచే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద, ఇరాన్–అమెరికా ఒప్పందం కేవలం ప్రాంతీయ రాజకీయాలకే కాకుండా, ఇజ్రాయెల్ భద్రతా సమీకరణాలపై కూడా పెద్ద ప్రభావం చూపేలా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.


