వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్? | Iran Walks Out Of US Talks In Switzerland Amid JD Vance Spotlight, Political Blame Game Emerges | Sakshi
Sakshi News home page

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

Jun 23 2026 9:02 AM | Updated on Jun 23 2026 12:34 PM

Credit to Trump Blame to Vance Iran Talks Spark Political Debate

స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా-ఇరాన్‌ చర్చల సందర్భంగా ఇరాన్‌ ప్రతినిధి బృందం అకస్మాత్తుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదనే ప్రచారం వైరల్‌ కాగా.. మరోవైపు, ఇరాన్‌తో కుదురుతున్న వివాదాస్పద ఒప్పందం విజయవంతమైతే కీర్తి ట్రంప్‌దే, విఫలమైతే నింద మాత్రం వాన్స్‌పైనే పడేలా రాజకీయ వ్యూహం నడుస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా-ఇరాన్‌ చర్చల్లో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చీ సమావేశ మందిరంలోకి వచ్చి పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌తో మాట్లాడి, అనంతరం అమెరికా ప్రతినిధుల వైపు చూడకుండానే వెనుదిరగడం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిని చాలామంది అమెరికాకు, ముఖ్యంగా జేడీ వాన్స్‌కు జరిగిన దౌత్యపరమైన అవమానంగా అభివర్ణించారు.

అయితే వాన్స్‌ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. "నన్ను అవమానించారనే భావన నాకు లేదు. ఇరానీయన్లు చర్చల్లో కొన్నిసార్లు చాలా గందరగోళంగా వ్యవహరిస్తారు. కానీ ఆ ఘటన తర్వాత కూడా మేము దాదాపు తొమ్మిది గంటలపాటు చర్చలు కొనసాగించాం" అని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో కనిపించిన దృశ్యాల కంటే, చర్చల గదిలో జరిగిన పరిణామాలే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా ప్రతినిధులతో కలిసి ఫొటో దిగాలన్న ప్రతిపాదనపై, అలాగే అదే సమయంలో ట్రంప్‌ చేసిన హెచ్చరికలపై అసంతృప్తితో ఇరాన్‌ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా కార్యకలాపాలపై ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేయడాన్ని కూడా టెహ్రాన్‌ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.

అయితే అసలు రాజకీయ చర్చ ఇప్పుడు మరో కోణంలో సాగుతోంది. ఇరాన్‌తో కుదురుతున్న తాత్కాలిక శాంతి ఒప్పందానికి అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చమురు ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, ఇరాన్‌ పునర్నిర్మాణానికి భారీ ఆర్థిక సహకారం వంటి అంశాలు రిపబ్లికన్‌ పార్టీలోని కొందరికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్‌ తనను పక్కన పెట్టి, ఒప్పందం ముఖచిత్రంగా జేడీ వాన్స్‌ను ముందుకు నెట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చర్చలకు వాన్స్‌నే నాయకత్వం వహించడమే కాకుండా, ఇరాన్‌ ఒప్పందాన్ని సమర్థించే బాధ్యత కూడా ఆయన భుజాలపై పడింది. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ శాఖ నేతలు వెనుకకు తగ్గిన వేళ.. విమర్శలన్నింటినీ ఎదుర్కొంటున్నది వాన్స్‌ కావడం గమనార్హం.

ఇటీవల ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూర్చాయి. "ఒప్పందం విజయవంతమైతే క్రెడిట్‌ నాదే.. విఫలమైతే నింద జేడీదే" అంటూ ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ట్రంప్‌ కావాలనే వాన్స్‌ను ముందుకు నెట్టి, తాను సురక్షిత దూరంలో నిలిచారని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది.

రిపబ్లికన్‌ వర్గాల్లో కూడా ఈ ఒప్పందాన్ని ఇప్పటికే "వాన్స్‌ డీల్‌"గా పిలవడం మొదలైంది. ఒప్పందం కుదిరితే 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో వాన్స్‌కు భారీ రాజకీయ లాభం కలిగే అవకాశం ఉంది. కానీ చర్చలు విఫలమైతే లేదంటే ఇరాన్‌ మరోసారి అమెరికాను ఇబ్బందుల్లోకి నెడితే.. ఆ రాజకీయ దెబ్బ కూడా ముందుగా వాన్స్‌కే తగిలే ప్రమాదం కనిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement