వేర్పాటువాదులతో శాంతి ఒప్పందం | Sakshi
Sakshi News home page

వేర్పాటువాదులతో శాంతి ఒప్పందం

Published Sun, Sep 5 2021 6:30 AM

Centre government signed a tripartite Karbi Peace Accord on Saturday - Sakshi

న్యూఢిల్లీ: అస్సాంలోని కార్బీ అంగ్లాంగ్‌ ప్రాంతంలో హింసకు చరమగీతం పాడి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అదే రాష్ట్రానికి చెందిన ఐదు వేర్పాటువాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై కేంద్రం, అస్సాం ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో కార్బీ అంగ్లాంగ్‌లో ఇక శాశ్వతంగా శాంతి నెలకొంటుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

శాంతి ఒప్పందంపై కార్బీ లోంగ్రీ నార్త్‌ చచార్‌ హిల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కార్బీ లోంగ్రీ, యునైటెడ్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ, కార్బీ పీపుల్స్‌ లిబరేషన్‌ టైగర్స్‌ తదితర వేర్పాటువాద సంస్థలు సంతకాలు చేశాయి. ఆయా సంస్థలకు చెందిన 1,000 మంది వేర్పాటువాదుల తమ ఆయుధాలతో సహా ఇప్పటికే లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. హింసకు తావులేని సౌభాగ్యవంతమైన ఈశాన్య భారతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని, ఆ దిశగా కార్బీ అంగ్లాంగ్‌Š అగ్రీమెంట్‌ ఒక కీలకమైన ముందడుగు అని అమిత్‌ షా వివరించారు.

Advertisement
Advertisement