అణు కేంద్రాలు తెరవకపోతే.. చర్చలే రద్దు! | No IAEA Access No Deal: Trump Warns Iran | Sakshi
Sakshi News home page

అణు కేంద్రాలు తెరవకపోతే.. చర్చలే రద్దు!

Jun 24 2026 6:51 AM | Updated on Jun 24 2026 11:36 AM

No IAEA Access No Deal: Trump Warns Iran

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ముందుకు సాగుతున్న వేళ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అణు కేంద్రాల్లో అంతర్జాతీయ తనిఖీలకు ఇరాన్‌ అంగీకరించిందని అమెరికా ప్రకటించగా.. కాసేపటికే టెహ్రాన్‌ వర్గాలు దానిని తోసిపుచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “అది పూర్తిగా తప్పు” అంటూ ఇరాన్‌పై మండిపడ్డారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలు తప్పనిసరి. ఇరాన్ అధికారులు తనిఖీల అంశాన్ని ఖండిస్తున్నప్పటికీ, తెర వెనుక వారు అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు. "వాళ్లు తప్పు చెబుతున్నారు. నిజంగా అంగీకరించకపోతే ఈ క్షణమే చర్చలను రద్దు చేస్తాను" అని వ్యాఖ్యానించారు.

జేడీ వాన్స్ ప్రకటనతో..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (JD Vance) ఇటీవల స్విట్జర్లాండ్ చర్చల అనంతరం మాట్లాడుతూ.. ఇరాన్ చివరకు ఐఏఈఏ తనిఖీలకు అంగీకరించిందని ప్రకటించారు. ఇరు దేశాల ఒప్పందంలోనే దీనిని పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. అయితే కొద్ది గంటల్లోనే ఇరాన్ ఆ ప్రకటనను ఖండించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 

ఇరాన్ వాదన ఏమిటి?
ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం అమెరికా ప్రకటనలను ఖండిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చల్లో తనిఖీలపై ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు గురైన అణు కేంద్రాలను తనిఖీ చేయడానికి ప్రస్తుతం అనుమతించే యోచన లేదని తెలిపింది. 

అసలు వివాదం ఎందుకు కీలకం?
ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించాలంటే తనిఖీలు అత్యంత కీలకమైన అంశం. గతంలో జరిగిన అణు ఒప్పందాలన్నింటిలోనూ IAEA పర్యవేక్షణ ప్రధాన షరతుగా ఉండేది. ఇప్పుడు కూడా అదే అంశాన్ని అమెరికా "నాన్-నెగోషియబుల్" షరతుగా చూస్తోంది. ట్రంప్ పరిపాలన అభిప్రాయం ప్రకారం, తనిఖీలు లేకుంటే ఇరాన్ నిజంగా అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేసిందో లేదో నిర్ధారించడం అసాధ్యం. అందుకే తనిఖీలు తప్పనిసరి అంటోంది. 

ట్రంప్ ప్రకారం, సరైన సమయంలో IAEA తనిఖీ బృందాలు ఇరాన్‌లోకి ప్రవేశిస్తాయని, అణు కార్యకలాపాలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అణు తనిఖీలు లేకుండా ఎలాంటి ఒప్పందమూ ఉండదని.. అవసరమైతే చర్చలనే రద్దు చేస్తానని హెచ్చరించారు. దీంతో చర్చల భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement