వాషింగ్టన్: గత కొన్ని నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. జూన్ 17న ఇరు దేశాలు 14 పాయింట్ల చారిత్రాత్మక శాంతి ఒప్పందం పై సంతకాలు చేయడంతో యుద్ధ మేఘాలు విడిపోయాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర పోరు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది. ఈ యుద్ధం వల్ల అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందో అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రాణ నష్టం ఇలా..
ఈ 108 రోజులకు పైగా సాగిన యుద్ధంలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ అధికారిక మీడియా ప్రకారం 3,300 మందికి పైగా ఇరానియన్లు మరణించారు. అలాగే లెబనాన్‌లో 3,826 మంది, ఇజ్రాయెల్‌లో దాదాపు 60 మంది ఈ హింసకు బలయ్యారు. కాగా తాజా ఒప్పందం ప్రకారం ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధిని తక్షణమే తిరిగి తెరుస్తున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదనే నిబంధనతో పాటు, ఆ దేశ పునర్నిర్మాణం కోసం 300 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 25 లక్షల కోట్లు) భారీ ఆర్థిక ప్యాకేజీని అందించడానికి అమెరికా అంగీకరించింది.
అమెరికాపై భారీ ఆర్థిక భారం
మూడీస్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం, ఈ యుద్ధం కారణంగా అమెరికా వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులు ఇప్పటివరకు సుమారు 132 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11 లక్షల కోట్లు) మేరకు నష్టపోయారు. పెంటగాన్ గణాంకాల ప్రకారం కేవలం సైనిక చర్యలకే 29 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. యుద్ధం ప్రారంభంలో గ్యాలన్ గ్యాస్ ధర 3 డాలర్ల లోపు ఉండగా, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో అది ఏకంగా 4.56 డాలర్లకు చేరింది. దీనివల్ల అమెరికన్లు ప్రతిరోజూ చమురు కోసం వందల మిలియన్ల డాలర్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. డీజిల్ ధరలు కూడా గ్యాలన్‌కు 5.69 డాలర్ల రికార్డు స్థాయికి చేరడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ
ఈ యుద్ధ ప్రభావం కేవలం అమెరికా, ఇరాన్‌లకే పరిమితం కాలేదు. ప్రపంచబ్యాంక్ 2026 అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను కోవిడ్ కాలం తర్వాత అత్యంత కనిష్టంగా 2.5 శాతానికి తగ్గించింది. మధ్యప్రాచ్య దేశాల జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుండి 1.3 శాతానికి పడిపోయింది. వ్యవసాయానికి కీలకమైన ఎరువుల ధరలు ఏకంగా 47 శాతం పెరిగాయి. భారతదేశంలో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కమర్షియల్ ఎల్‌పీజీ ధరలు విపరీతంగా పెరగడంతో పాటు వంటగ్యాస్ కొరత ఏర్పడి సామాన్యులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇది కూడా చదవండి: నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య


