డీల్‌ ఓకే.. ఎట్టకేలకు శాంతి వీచికలు | USA, Iran reach preliminary agreement to end war | Sakshi
Sakshi News home page

డీల్‌ ఓకే.. ఎట్టకేలకు శాంతి వీచికలు

Jun 16 2026 5:03 AM | Updated on Jun 16 2026 7:31 AM

USA, Iran reach preliminary agreement to end war

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు 

శాంతి ఒప్పందానికి అమెరికా, ఇరాన్‌ ఓకే

19వ తేదీన ఒప్పందంపై సంతకాలు 

తర్వాత వెనువెంటనే తెరుచుకోనున్న హార్మూజ్‌ 

ఎలాంటి సుంకాల్లేని నౌకల స్వేచ్ఛా వాణిజ్యానికి ఇరాన్, అమెరికా సమ్మతి 

స్వాగతించిన ప్రపంచ దేశాలు

ఇస్లామాబాద్‌/వాషింగ్టన్‌/టెల్‌ అవీవ్‌: దాదాపు 107 రోజులుగా హార్మూజ్‌ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్‌ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్‌ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్‌ ప్రకటించాయి. 

స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సంతకాల కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు పాకిస్తాన్‌ సోమవారం ప్రకటించింది. శాంతి ఒప్పందంలో ఏఏ వివరాలను పొందుపర్చబోతున్నారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ప్రపంచ మార్కెట్లపై యుద్ధ్దకుంపట్లను రాజేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ అమెరికా కాలమానంప్రకారం ఆదివారం రాత్రి ఇరాన్‌తో డీల్‌పై ప్రకటన చేశారు. 

ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఒక పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది. అందరికీ అభినందనలు. ఇకపై ఎలాంటి సుంకాల్లేకుండా హార్మూజ్‌ తెరుచుకోబోతుంది. హార్మూజ్‌ వద్ద అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేస్తున్నాం. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్‌ చేయండి. చమురు సరఫరాను సముద్రమార్గంలో ఉరకలెత్తించండి. 

గొప్పదైన ఈ ఒప్పందంలో పశ్చిమాసియాలో శాంతి, భద్రత నెలకొంటాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నించి విఫలమయ్యారు. తొలిసారిగా నేను శాంతి పవనాలు వీచేలా చేశా. శుక్రవారం సంతకాలు పూర్తయ్యాక హార్మూజ్‌ తెరుచుకుంటుంది. సముద్ర మందుపాతరల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. హార్మూజ్‌ జలసంధికి ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి’’అనిట్రంప్‌ తెలిపారు.  

60 రోజుల సంప్రదింపుల వ్యవధి! 
‘‘ఇరు వైపుల ప్రతినిధి బృందాలు వచ్చాక శుక్రవారం స్విట్జర్లాండ్‌లో సంతకాలు చేస్తారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాక 60 రోజులపాటు సంప్రదింపుల వ్యవధి ఉంటుంది. యురేనియంను అత్యంత నాణ్యత స్థాయికి శుద్ధిచేయడం, ఇప్పటికే శుద్ధచేసిన యురేనియంను నిర్వీర్యంచేయడం, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు, రెండో దశ ఆంక్షలు, అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి’’అని ఇరాన్‌ ఉప విదేశాంగ మంత్రి కాసిం ఘరిబాబాడీ వెల్లడించారు. మరోవైపు ఒప్పందానికి అంగీకరించిన అమెరికాకు పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించిన ఖతర్, తుర్కియే, సౌదీ అరేబియాలను షెహబాజ్‌ అభినందించారు. 

దాడి చేస్తే ప్రతిదాడి: ఇజ్రాయెల్‌ 
ఓవైపు శాంతి ఒప్పందానికి అమెరికా ముందడుగేస్తుంటే మిత్రదేశం ఇజ్రాయెల్‌ మాత్రం అదే యుద్ధధోరణిని మళ్లీ కనబర్చింది. ‘‘ఇరాన్‌ గనక మళ్లీ మాపై దాడులకు దిగితే మేం యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఇప్పటిదాకా గాజా స్ట్రిప్, సిరియా, లెబనాన్‌లో మేం ఆక్రమించుకున్న సరిహద్దు ప్రదేశాలకు ఖాళీచేసేదే లేదు’’అని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ ప్రకటించారు. 

శాంతి ఒప్పందంలో లెబనాన్‌నూ చేర్చాలని ఓవైపు ఇరాన్‌ పట్టుబడుతుంటే అదే లెబనాన్‌పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్‌ సోమవారం సైతం స్పష్టంచేయడంతో శాంతి ఒప్పందం ఏ మేరకు సవ్యంగా అమలవుతుందనే కొత్త అనుమానాలు బయల్దేరాయి. గత రెండున్నరేళ్లలో సిరియా, లెబనాన్, గాజా స్ట్రిప్‌లో మొత్తంగా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. ఇది దాదాపు అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ అంత ఉంటుంది. ‘‘కొత్త ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత అమెరికాదే. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను అమెరికా నిలువరించాల్సిందే’’అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ స్పష్టంచేశారు.  

ఖమేనీ మృతి నుంచి ఒప్పందం దాకా.. 
వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌: ఇరాన్‌తో మూడ్రోజుల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్‌ ప్రకటించడంతో ఇన్నాళ్లూ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌పై అమెరికా కాల్పులు మొదలెట్టి తాజాగా చర్చలు మొదలెట్టిన దాకా జరిగిన క్రమంలో కీలక పరిణామాలు కొన్ని... 
ఫిబ్రవరి 28: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు. దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా సయీద్‌ అలీ ఖమేనీ సహా పలువురు టాప్‌ కమాండర్ల దుర్మరణం 
మార్చి 1: దూరంగా ఉన్న అమెరికా భూభాగాలకు బదులు అమెరికా స్థావరాలున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌పై ఇరాన్‌ దాడులు 
మార్చి 2: పొరపాటున అమెరికా యుద్ధవిమానాలను నేలకూల్చిన కువైట్‌ 
మార్చి 4: ఇరాన్‌ యుద్దనౌక ఐఆర్‌ఎస్‌ డేనాను హిందూమహాసముద్రంలో టోర్పెడోతో దాడిచేసి ముంచేసిన అమెరికా 
మార్చి 8: సౌదీ అరేబియాపై ఇరాన్‌ దాడి. శకలాలు పడి భారతీయుడు మృతి 
మార్చి 9: తండ్రి స్థానంలో ఇరాన్‌ సుప్రీంనేతగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ 
మార్చి 17: అమెరికా దాడిలో ఇరాన్‌ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ అంతం 
మార్చి 18: సౌత్‌ పార్స్‌ సహజవాయు క్షేత్రంపై అమెరికా భీకర దాడులు 
మార్చి 21: చమురు సంక్షోభం పెరగడంతో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్‌ ముడిచమురు విక్రయానికి అమెరికా తాత్కాలిక అనుమతి 
మార్చి 27: ఇరాన్‌ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బాంబర్‌ విమానాల దాడి 
మార్చి 31: ఐదు అంశాలతో శాంతి ప్రతిపాదనలను తెచ్చిన చైనా, పాకిస్తాన్‌ 
ఏప్రిల్‌ 3: తొలిసారిగా అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇరాన్‌ 
ఏప్రిల్‌ 8: రెండు వారాల కాల్పుల విరమణ 
ప్రతిపాదనను ఓకే చెప్పిన అమెరికా, ఇరాన్‌ 
ఏప్రిల్‌ 11: పాక్‌ వేదికగా తొలిసారిగా చర్చలకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ 
ఏప్రిల్‌ 12: చర్చలు విఫలమైనట్లు అమెరికా ప్రకటన
ఏప్రిల్‌ 15: ఇరాన్‌లో పర్యటించిన అగ్రనాయకత్వంతో చర్చించిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ 
ఏప్రిల్‌17: హార్మూజ్‌ను తెరుస్తున్నామన్న ఇరాన్‌. తాము దిగ్బంధించామన్న అమెరికా 
ఏప్రిల్‌ 20: ఇరాన్‌ జెండాతో రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం మొదలెట్టిన అమెరికా 
ఏప్రిల్‌ 22: హార్మూజ్‌లో మూడు నౌకలపై దాడిచేసి రెండింటిని స్వా«దీనంచేసుకున్న ఇరాన్‌ 
ఏప్రిల్‌ 24: తమ ప్రతిపాదనలు తెలియజేసేందుకు పాక్‌లో పర్యటించిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబాŠబ్స్‌ అరాఘ్చీ 
ఏప్రిల్‌ 27: అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేస్తే హార్మూజ్‌ను తెరుస్తామని తొలిసారిగా ప్రకటించిన ఇరాన్‌ 
మే 6: విదేశీ నౌకలు హార్మూజ్‌ను సురక్షితంగా దాటేందుకు ఇకపై అమెరికా యుద్దనౌకలు రక్షణగా రాబోవని ప్రకటించిన ట్రంప్‌ 
మే 13: ఒమన్‌ తీరంలో భారతీయ నౌకపై దాడి 
మే 18: చర్చలు కీలకదశలో ఉండటంతో దాడులు తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటన 
జూన్‌ 1: తమ ఎంక్యూ–1 ప్రిడేటర్‌ డ్రోన్‌ను కూల్చినందుకు ఇరాన్‌పై భీకర దాడులు మొదలెట్టినట్లు ట్రంప్‌ వెల్లడి 
జూన్‌ 3: కువైట్‌ విమానాశ్రయంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడిలో భారతీయుడి దుర్మరణం 
జూన్‌ 6: బహ్రెయిన్, కువైట్‌లపై బాలిస్టిక్‌ క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్‌ 
జూన్‌ 7: చర్చల ప్రక్రియలో కదలిక తెచ్చిన పాక్‌ 
జూన్‌ 8: కాల్పుల విరమణకు తూట్లుపొడుస్తూ పరస్పర దాడులకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్‌ 
జూన్‌ 9: అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌ను కూల్చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటానన్న ట్రంప్‌ 
జూన్‌ 10: పలావూ జెండాతో ఉన్న నౌకపై అమెరికా దాడిలో ముగ్గురు భారతీయుల దుర్మరణం 
జూన్‌ 15: కాల్పులకు ముగింపు పలుకుతూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్‌ ప్రకటన  

ఒప్పందంలో ఏముంది ? 
మరో మూడ్రోజుల్లో ముసాయిదా ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌లు సంతకాలుచేసి తదుపరి సమగ్రమైన సంప్రదింపుల ప్రక్రియకు తెరలేపనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ముసాయిదా ఒప్పందంలో ఏమేం అంశాలను పొందుపరిచారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కువైంది. హార్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు విధిస్తారా? అణ్వాయుధం తయారీ కోసం ఇప్పటికే అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధికి సాహసించిన ఇరాన్‌ను ఆ దిశగా మరో అడుగు ముందుకువేయకుండా అమెరికా షరతు విధించింది? అనే పలు సందేహాల నడుమ ఇరాన్‌ మీడియా ఈ ముసాయిదాలోని 14 అంశాలను సంపాదించిందని కథనాలు వెలువడ్డాయి. సైనిక, ఆర్థిక, అణు అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాల గురించి క్లుప్తంగా...

1. అమెరికా, ఇరాన్‌ దశాబ్దాల శత్రుత్వాలకు ఇకనైనా ముగింపు పలకడం 
2. ముడి చమురు సహా వాణిజ్య వస్తూత్పత్తుల సరఫరా కోసం నౌకల రాకపోకల నిమిత్తం హార్మూజ్‌ తెరవడం 
3. ఇరాన్‌ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలు, అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం 
4. చర్చలు ఓవైపు జరుగుతుండగా ఒప్పందం తమకు అనుకూలంగా కుదిరేలా ఇరాన్‌పై ఒత్తిడి పెంచేలా ఆ దేశంపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించకపోవడం 
5. ఈలోపు ఇరాన్‌ ముడి చమురు ఎగుమతులపై తక్షణం ఆంక్షలు ఎత్తేయడం 
6. విదేశీ బ్యాంకుల ఖాతాల్లో అమెరికా, మిత్రదేశాలు స్తంభింపజేసిన ఇరాన్‌ ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల డాలర్ల నిధులను విడుదలచేయడం 
7. కనీసం 60 రోజులపాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం 
8. ఇరాన్‌ ఇకపై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలను విరమించుకోవడం 
9. ఇరాన్‌ ఇకపై మిలటరీ గ్రేడ్‌లో నాణ్యత స్థాయికి యురేనియంను శుద్ధిచేయకుండా మిన్నకుండిపోవడం 
10. అణు కేంద్రాల విస్తరణ ప్రతిపాదనలను ఇరాన్‌ పక్కనపడేయడం 
11. అణుకేంద్రాలపై అమెరికా బాంబర్‌ దాడులతో భూస్థాపితమైన శుద్ధయురేనియం అప్పగింత లేదా నిర్వీర్యంచేయడంపై చర్చలు జరపడం 
12. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని స్పష్టమయ్యేలా ఇరాన్‌ సైనిక చర్యలను ఉపసంహరించుకోవడం 
13. ఆర్థికపర ఆంక్షలను అమెరికా ఎత్తేయడంతోపాటు ఇరాన్‌ పునర్‌నిర్మాణ కార్యక్రమానికి కృషిచేయడం 
14. సమగ్రమైన తుది ఒప్పందం కోసం కృషిచేయడం


తెరమీదకు మరికొన్ని అంశాలు! 
ఇవిగాక మరిన్ని ప్రతిపాదనలు ముసాయిదా ఒప్పందంలో ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఇరాన్‌కు 300 బిలియన్‌ డాలర్లతో ఆర్థికాభివృద్ధి ప్యాకేజీని ట్రంప్‌ అందించడం, ఇరాన్‌లో అమెరికా సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఇరాన్‌ పునరుజ్జీవనానికి పాటుపడటం, ఆర్థికసహకారం, రుణాలు అందివ్వడం, భవిష్యత్‌లో ఉద్రిక్తతలు తలెత్తకుండా తగు పరస్పర సహకార విభాగాలను ఏర్పాటుచేయడం, గ్లోబల్‌ మార్కెట్లతో ఇరాన్‌ను మరింతగా అనుసంధానం చేయడం వంటివీ ఇందులో ఉన్నాయని వార్తలొచ్చాయి. పరస్పర దాడులు ఆపేస్తే సరిపోదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

 ‘‘ఇరాన్‌ యుద్ధంలో కీలకమైన నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. చమురు సంక్షోభం భవిష్యత్‌లో తలెత్తకుండా సుంకాల్లేకుండా చమురు నౌకల రాకపోకలను శాశ్వతంచేయడం, దెబ్బతిన్న ఇరాన్‌ ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేలా పలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందివ్వడం, అణ్వస్త్ర సామర్థ్యంలేకపోవడంతోనే తమపై అగ్రదేశాలు దాడులుచేస్తున్నాయనే భావన ఇరాన్‌లో లేకుండా చేయడం, తద్వారా ఇరాన్‌.. లెబనాన్‌(హెజ్‌»ొల్లా), యెమెన్‌(హూతీ), గాజా(హమాస్‌)లో పరోక్ష సైన్యాలను పెంచిపోషించకుండా అడ్డుకోవడం వంటివి చేయగలిగితేనే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సుసాధ్యమవుతుంది’’అని నిపుణులు విశ్లేషించారు. 

తర్వాత ఏం జరగొచ్చు? 
ప్రతిపాదిత ముసాయిదా ఒప్పందం అమల్లోకి వచ్చాక తొలి 60 రోజులపాటు హార్మూజ్‌ తెరుచుకోవడంతో చమురు సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగే ఆస్కారముంది. అయితే ఈ 60 రోజుల్లో సమగ్ర శాంతి ఒప్పందం కుదిరితే అందరికీ లాభమే. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఏళ్ల తరబడి ఇరాన్‌పై అమెరికా సహా ఏ దేశమూ ఆంక్షలు విధించకుండా చూసుకోవడం, ఒప్పందాన్ని సమగ్రస్థాయిలో అమలుచేసే వ్యవస్థను కొలువుతీర్చడం, ఇరాన్‌ దొంగచాటుగా యురేనియంను శుద్ధిచేయకుండా అడ్డుకోవడం వంటివి కీలకంగా మారనున్నాయి. 14 అంశాలపై ఇరుదేశాలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొస్తే చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఈ 14 అంశాలే మూలస్తంభాలుగా నిలుస్తాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement