అమెరికా–ఇరాన్ ఒప్పందంపై స్పందించిన మోదీ | India PM Modi Reacts On Iran USA Peace Deal, Says Deal Can Restore Regional Stability | Sakshi
Sakshi News home page

అమెరికా–ఇరాన్ ఒప్పందంపై స్పందించిన మోదీ

Jun 15 2026 1:56 PM | Updated on Jun 15 2026 3:35 PM

India PM Modi Reacts On Iran USA Peace Deal

పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన కుదిరింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటిస్తూ.. శాంతి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ పరిణామాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో ఆయన ఓ పోస్ట్‌ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..  

పశ్చిమాసియాలో జరిగిన ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిందని, అనేక దేశాల్లో ప్రాణనష్టం కూడా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడమే కాకుండా ప్రపంచ వాణిజ్య మార్గాలకు ఊరట లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

“పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణను ముగించేందుకు అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంతరాయాలను కలిగించింది, అనేక దేశాల్లో ప్రాణనష్టానికి కారణమైంది. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడుతుంది. కీలక సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం సజావుగా కొనసాగుతుంది. ఈ అవగాహన అమలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా వాణిజ్య నౌకా మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాను నిర్ధారిస్తుందని మేము ఆశిస్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. మిగిలిన అంశాలపై.. అమెరికా–ఇరాన్ మధ్య జరిగే చర్చలు స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందానికి దారితీయాలని కూడా మోదీ ఆకాంక్షించారు.

ప్రస్తుతం మోదీ స్లోవేకియా పర్యటనలో ఉన్నారు. 1993 తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని ఆయనే కావడం గమనార్హం. ఫ్రాన్స్‌ నుంచి అక్కడికి వెళ్లిన ఆయనకు.. వందేమాతరంతో ఘన స్వాగతం లభించింది.

ఇక.. ఇరాన్‌-అమెరికా డీల్‌కు సంబంధించి కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభం, తాత్కాలిక ఆంక్షల సడలింపు, అలాగే ఇరాన్‌కు నిలిచిపోయిన ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇందులో భాగమని తెలుస్తోంది. 

హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం కావడంతో.. ఈ ఒప్పందం భారత్ వంటి దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు, ఈ మార్గంలో ఉద్రిక్తతలు తగ్గితే ఇంధన ధరల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement