దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)హీరోగా వస్తోన్న తాజా చిత్రం'కాంతా'(Kaantha). ఈ మూవీకి టాలీవుడ్ హీరో దగ్గుబాటి నిర్మించడంతో పాటు కీలక పాత్రలో నటింటారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 14న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అయితే రిలీజ్‌కు ముందే కాంతా మూవీ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రముఖ నటుడు, సంగీతకారుడు త్యాగరాజ భాగవతార్ మనవడు త్యాగరాజన్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తాత, దిగ్గజ నటుడు, కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ భాగవతార్‌ను జీవితాంతం పేదరికంలో జీవించిన వ్యక్తిగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. ఆయన చరిత్రను వక్రీకరించేలా తప్పుగా చూపించారని.. త్యాగరాజ భాగవతార్ కీర్తిని అపఖ్యాతి పాలు చేసేలా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎంకేటీగా ప్రసిద్ధి చెందిన దివంగత భాగవతార్ తమిళ సినిమా, కర్ణాటక సంగీతంలో గౌరవనీయమైన వ్యక్తి అని వెల్లడించారు. ఆయన భక్తి, దాతృత్వానికి ప్రసిద్ధి చెందారని త్యాగరాజన్ పేర్కొన్నారు. ఆయన మరణించే వరకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సినీ నిర్మాతలు ఎవరైనా ప్రజా ప్రముఖులను తెరపై చిత్రీకరించే ముందు వారి వారసుల నుంచి చట్టపరంగా అనుమతి పొందాలని పిటిషనర్ త్యాగరాజన్ తెలిపారు. ఈ విషయంలో 'కాంతా' మూవీ నిర్మాతలు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఈ చిత్రం తన తాత వారసత్వానికి పరువు నష్టం కలిగించేలా ఉందని.. తక్షణమే ఈ సినిమా దాని విడుదలపై నిషేధం విధించాలని కోర్టును కోరారు. అయితే ఈ వివాదంపై నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ కల్పిత కథ అని స్పష్టం చేశారు. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ పీరియాడికల్ డ్రామాలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించగా.. సముద్రఖని కీలక పాత్ర పోషించారు.


