విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఇండిగో సంస్థకు చెందిన రెండు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సిలిగురి, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రెండు ఇండిగో విమానాలను విజయవాడ విమానాశ్రయానికి మళ్లించారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సూచన మేరకు అధికారులు అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేయడంతో రెండు విమానాలు మధ్యాహ్నం 2.15 నుంచి 2.20 గంటల మధ్య సురక్షితంగా దిగాయి. గంటన్నర తర్వాత తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లాయి. హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా విమానాలను ఇక్కడికి దారి మళ్లించినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.


