సాక్షి,విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమాని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు.
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగింది. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. నియోజక వర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను గవర్నర్ కు అందచేస్తాం. డిసెంబర్ 18న వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది.
ప్రతినియోజక వర్గంలో వేలాది మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. చంద్రబాబు ఎప్పడు కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే పేదలకు వైద్యం అందుతుంది.కోవిడ్ లాంటి విపత్తులు వస్తే పేదల ఆరోగ్యం కాపాడగలం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమైతే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసింది. మరో రెండు కాలేజీలకు అనుమతులు కూడా తెచ్చింది.తరువాత వచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదను సదుద్దేశ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేస్తోందని’ స్పష్టం చేశారు.


