నేడు బెంగళూరు, విశాఖ, గన్నవరం నుంచి ఇతర నగరాలకు రాకపోకలు సాగించే విమానాలన్నీ రద్దు
గోపాలపట్నం/విమానాశ్రయం(గన్నవరం): మోంథా తుపాను కారణంగా మంగళవారం బెంగళూరు, విశాఖ నుంచి రాకపోకలు సాగించే అన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు ఇన్‌చార్జ్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. సోమవారం ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో భువనేశ్వర్‌కు మళ్లించారు. వాతావరణం అనుకూలించిన కొద్ది గంటల తర్వాత ఈ విమానం విశాఖ చేరుకుంది. సోమవారం విజయవాడ–విశాఖ–హైదరాబాద్, బెంగళూరు–విశాఖ–బెంగళూరు ఎయిరిండియా విమానాలు రద్దయినట్లు పురుషోత్తం చెప్పారు.
అలాగే, గన్నవరం విమానాశ్రం నుంచి రాకపోకలు సాగించే అన్ని ఎయిరిండియా విమాన సర్విస్‌లను కూడా మంగళవారం రద్దు చేశారు. రెండు న్యూఢిల్లీ సర్వీస్‌లతోపాటు ముంబయి సర్విస్ రద్దయినట్లు ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ఇండిగో విమాన సంస్థ కూడా మంగళవారం ఉదయం సర్వీస్‌లు మినహా అన్ని విమానాలను రద్దు చేసింది. ఉదయం 10.35 గంటలలోపు హైదరాబాద్, చెన్నైతోపాటు న్యూఢిల్లీ సర్విస్‌లు మాత్రమే నడుస్తాయని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత అన్ని విమాన సర్వీస్‌లను రద్దు చేసినట్లు పేర్కొంది.


