ఆగ్రా: సెలవులకని సొంతూరుకు వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఐదుగురిని బలి తీసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన అన్షు గుప్తా(40) నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సెలవుల్లో గడిపేందుకని సొంతూరుకు బయలు దేరిన అతడు మత్తులో కారు ఉన్నాడు.
న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా బుద్ధి సమీపంలో వేగంగా నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నిల్చుకున్న ఏడుగురిపైకి దూసుకెళ్లింది. వారంతా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే క్షతగాత్రుల్లో ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. బాధితులంతా 20–33 ఏళ్ల వారే కావడం గమనార్హం. పోలీసులు గుప్తాను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.


