రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ముస్లిమేతర నివాసితులకు మద్యం విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు పలు కఠిన నిబంధనలు విధించింది. దేశీయంగా తీసుకున్న ఆర్థిక పరివర్తన లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు సౌదీ ప్రయత్నిస్తోంది.
దేశంలోని రియాద్‌లో ఏర్పాటు చేసిన ఏకైక మద్యం దుకాణంలోకి ప్రవేశించేందుకు ముస్లిమేతర నివాసితులు తమ ధృవీకరణ పత్రాన్ని చూపించాల్ని ఉంటుంది. అంతకుముందు విదేశీ దౌత్యవేత్తల కోసం ప్రారంభించిన ఈ దుకాణం ఇటీవల ప్రీమియం రెసిడెన్సీ హోదా కలిగిన ముస్లిమేతరులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ దుకాణంలో కొనుగోళ్లు కేవలం నెలవారీ పాయింట్-బేస్డ్ అలవెన్స్ సిస్టమ్ కింద మాత్రమే చేయవచ్చని సమాచారం. కాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు మద్యం యాక్సెస్‌ను సులభతరం చేసే దిశగా తీసుకుంటున్న చర్యలలో భాగమని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రభుత్వం నుండి ఈ మార్పులపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.
రియాద్‌ను వ్యాపార, పెట్టుబడులకు పోటీ కేంద్రంగా మార్చడానికి సౌదీ అరేబియా విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం అనేది విజన్ 2030 లో భాగంగా ఉంది. ఆర్థిక పరివర్తన లక్ష్యాలకు దీనిని కీలకంగా సౌదీ అరేబియా భావిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని రద్దు చేసింది. అలాగే ప్రజా వినోదం, సంగీతం తదితర రంగాలలో మహిళల ప్రవేశానికి అనుమతులు మంజూరు చేసింది. దేశంలోని పర్యాటక రంగాన్ని కూడా మరింతగా ప్రోత్సహిస్తోంది.
ఇది కూడా చదవండి: లడఖ్‌లో చైనా గూఢచారి?.. ఫోరెన్సిక్ పరీక్షకు ఫోన్


