కోనసీమ జిల్లా: అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కారు డ్రైవర్ కంచిపల్లి శ్రీనివాస్ (37) ఘటన విషాదాంతమైంది. గత శనివారం అదృశ్యమైన అతడు బుధవారం పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగపల్లి గ్రామంలోని వైనతేయ నదీ పాయలో శవమై కనిపించాడు. అతడి సోదరుడు అంజి పుట్టు మచ్చల ఆధారంగా శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించాడు. ఈ కేసును అమలాపురం పట్టణం, పి.గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ మృతి చెంది దాదాపు ఐదు రోజులు అవుతుందని, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి కారణాలు తెలుస్తాయని పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు.
ఇదిలా ఉండగా.. శ్రీనివాస్ భార్య దేవి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. తన భర్త అదృశ్యం కేసు ఎంత వరకూ వచ్చిందని ఆరా తీశారు. ఇదే విషయాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ ముందు విలేకరులకు తెలిపారు. ఆర్.ఏనుగపల్లిలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారని తెలిసి ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ మృతదేహం తన భర్తదే అని నిర్ధారణ కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. గత శనివారం శ్రీనివాస్ ఇంట్లో తాను రాజమహేంద్రవరం వెళుతున్నానని చెప్పి స్కూటీపై బయలు దేరాడు. అప్పటి నుంచి అతను తిరిగి రాలేదు.
దర్శకుడు సుకుమార్ టాటూ
ఆర్.ఏనుగపల్లిలో శ్రీనివాస్ మృతదేహం లభ్యమైనప్పుడు అక్కడి పోలీసులు అతడి శరీరంపై సినీ దర్శకుడు సుకుమార్ చిత్రంతో పాటు పలు పేర్లను టాటూలుగా వేయించుకున్న విషయాన్ని గుర్తించారు. అతడి కుడి చేతిపై దేవి, రిషి, వినీత్ అనే పేర్లు ఇంగ్లిషులో ఉన్నాయి. నీలి రంగు ప్యాంట్ ఊడిపోయి అతని కాళ్ల వద్ద వేలాడుతోంది.
నా భర్తను కాసుబాబే చంపాడు
తన భర్తను పట్టణానికి చెందిన గంగుమళ్ల కాసుబాబు, అతడి అనుచరులు చంపినట్టు తనకు అనుమానంగా ఉందని మృతుడి శ్రీనివాస్ భార్య దేవి స్థానిక విలేకర్లకు తెలిపింది. తన భర్తపై కాసుబాబు కక్ష పెంచుకుని ఇదంతా చేశాడని ఆరోపించింది. కాసుబాబుతో పాటు శంకర్, సలాది అప్పన్న, కారు డ్రైవర్ కలిపి తన భర్తను చంపారన్న అనుమానం ఉందని తెలిపింది. పట్టణ పోలీసులు ఈ నలుగురి కదలికలపై నిఘా పెట్టారు. తాము కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు.


