
తిరుమలగిరి (తుంగతుర్తి): ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనానికి పోలీసులు చలాన్(జరిమానా) విధిస్తున్నారు. అయితే వీటిని చెల్లించడంలో వాహన దారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకపై అలా చేసేందుకు వీలు ఉండదు. కేంద్ర రవాణాశాఖ రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం 45 రోజుల్లో చలాన్ చెల్లించకుంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇంకా పెండింగ్ పెడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.
రోజుకు 200 కేసులు
సూర్యాపేట జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు రోజుకు 200కు పైగానే నమోదవుతున్నాయి. హెల్మెట్ ధరించక పోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, వ్యతిరేక దిశలో వెళ్లడం, నో పార్కింగ్ ఏరియాలో వాహనం నిలపడం, అతి వేగంగా వెళ్లడం వంటి వాటిలో ట్రాఫిక్ పోలీసులు వాహనం ఫొటో తీసి చలాన్ విధిస్తున్నారు. వాహనానికి చలాన్ విధించిన విషయం వాహనదారుడి ఫోన్‌కు మొసేజ్ రూపంలో కూడా పంపిస్తున్నారు. ఈ చలాన్‌ను 30 రోజుల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. కొందరు వెంటనే అప్రమత్తమై ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నా, చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇకపై చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తే అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది.
పెండింగ్ ఉంటే కష్టమే
చాలా మంది వాహనాలపై ఐదు నుంచి పది వరకు చలాన్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. దొరికినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యం వహించడం వల్ల పెండింగ్ లిస్ట్ పెరుగుతూ పోతోంది. కానీ ఇక అది కుదరదు. కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్‌ను 45 రోజుల్లోపు చెల్లించాలి. 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉండి సదరు వాహనం పట్టుబడితే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు. ఇంకా ఆలస్యం చేస్తే రవాణాశాఖ ఆ వాహనంపై లావాదేవీలకు అనుమతించక పోయే అవకాశం ఉంది.
10 నెలల్లో 1.89 లక్షల కేసులు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు రూల్స్ బ్రేక్ చేసే వాహనాన్ని ఫొటో తీసి చలాన్ విధిస్తున్నారు. దాంతో పాటు ఎప్పటికప్పుడు వాహనాలు తనిఖీ చేస్తూ లైసెన్స్‌తో పాటు సరైన పత్రాలు లేని వాహనాలకు సైతం జరిమానా విధిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 1,89,889 కేసులు నమోదు చేశారు. కొందరు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు తప్పుడు నంబర్ ప్లేట్లు, ఇతర వాహనాల నంబర్లను బిగించుకుంటున్నారు. దాంతో చలాన్లు వేసే సమయంలో అవి అసలైన వాహనదారులకు వెళ్తుండడంతో వారు ఖంగు తింటున్నారు. డూప్‌ల ఆట కట్టించేందుకు పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు సైతం చేపడుతున్నారు.