ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ హడావుడి
చిట్యాల: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు హడావుడి చేస్తున్నారు తప్పితే గత రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. చిట్యాల మున్సిపాలిటీలోని ఏడవ వార్డులో ఆదివారం ఆయన బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నేరవేర్చలేదని, మళ్లీ మాయ మాటలతో మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. ప్రజలకు రావాల్సిన రైతుబంధు, రైతు భరోసా, ఆసరా పింఛన్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు చిట్యాల మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, నాయకులు కొలను వెంకటేష్, కందాటి రమేష్‌రెడ్డి, జిట్ట శేఖర్, బొల్గూరి సైదులు, మేడి ఉపేందర్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


