సేంద్రియ సాగులో రాణిస్తూ..
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిళ్లపాటి గోవర్ధన్‌రెడ్డి తన వ్యవసాయ భూమిలో సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తూ రాణిస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో అర్ధశాస్త్రం పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలుగా భూ ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతరించి పోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణాన్ని, భూమి, నీరు పరిరక్షించుకోవడం, తగ్గిపోతున్న భూసారాన్ని కాపాడాలనే లక్ష్యంతో దేశవాళి వరి విత్తనాల వరి సాగు చేపట్టారు. తనకున్న 3 ఎకరాల విస్తీర్ణంతో పాటు మరికొంత కౌలుకు భూమి తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అదేవిధంగా 20 గుంటల విస్తీర్ణంలో 23 రకాల దేశవాళీ వరి విత్తనాల సాగు చేస్తున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్‌లో పుడమి పుత్ర పురస్కారం అందుకున్నారు.


