
సోషల్‌మీడియా కేంద్రంగా భారీ అవగాహన
యువతే లక్ష్యంగా డిజైన్ చేసిన కొత్త కొత్వాల్
తొలి దశలో హెల్మెట్, సీట్‌బెల్ట్ ధారణపై దృష్టి
సోమవారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ
సాక్షి, సిటీబ్యూరో: ‘సహాయం చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పకు. అతడిని ముగ్గురికి సహాయం చేయమని చెప్పి ఆ ముగ్గురూ మరో ముగ్గురికి చొప్పున సహాయం చేసేలా ప్రోత్సహించు...’ సినీ నటుడు చిరంజీవి కథా నాయకుడిగా నటించిన స్టాలిన్ సినిమాలోని కాన్సెప్ట్ ఇది.
నగర కొత్త కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ దీన్ని పోలిన వినూత్న కార్యక్రమానికి డిజైన్ చేశారు. ‘హ్యాష్‌ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ పేరుతో సోషల్‌మీడియా కేంద్రంగా సోమవారం ప్రారంభించారు. తొలి దశలో హెల్మెట్, సీట్‌బెల్ట్ ధారణపై దృష్టి పెట్టిన కమిషనర్ వాటి వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
సోషల్‌మీడియా, వైరల్... ఇవే ట్రెండ్స్
రహదారి భద్రతతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పించడానికి కొన్నేళ్లుగా ట్రాఫిక్ విభాగం వివిధ రకాలైన కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల కాలంలో సోషల్‌మీడియా ట్రెండ్ నడుస్తోంది. అందులో తమ ఫొటోలు, వీడియోలు వైరల్ కావాలని ఆశించే వాళ్లు అనేక మంది ఉంటున్నారు. ఈ ధోరణి యువతలో ఎక్కువగా ఉంటోంది.
ఈ నేపథ్యంలోనే వాహనచోదకులు.. ప్రధానంగా యువతలో అవగాహన పెంచడానికే సజ్జనర్ ‘హ్యాష్‌ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ను డిజైన్ చేశారు. అనునిత్యం ఏదో ఒక ఫొటో, వీడియో, కామెంట్లను పోస్టు చేసే నెట్‌జనుల దృష్టిని రహదారి భద్రత వైపు మళ్లించడానికి, ఈ అంశాలను ప్రచారం కల్పించడానికి అనువుగా దీన్ని కమిషనర్ రూపొందించారు.
ప్రయాణం ప్రారంభానికి ముందు...
దీనికి సంబంధించిన విధివిధానాలను కొత్వాల్ సజ్జనర్ సోమవారం తన అధికారిక ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా వాహనచోదకుడు తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు హెల్మెట్ (ద్విచక్ర వాహనం), సీట్‌బెల్ట్ (తేలికపాటి వాహనం) కచ్చితంగా ధరించాలి.
అలా తాను రహదారి భద్రత నిబంధనలు పాటిస్తున్నట్లు చిన్న ఫొటో లేదా వీడియో తీసుకోవాలి. దాన్ని తమ సోషల్‌మీడియా ఖాతా ద్వారా ‘సేఫ్ రోడ్ ఛాలెంజ్’ అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా షేర్ చేయాలి. ఆ సమయంలో తమ ఫ్రెండ్స్ లిస్ట్ లేదా ఫాలోవర్స్‌లో ఉన్న ముగ్గురు స్నేహితులు లేదా బంధువుల్ని ఎంచుకోవాలి. వాళ్లు సైతం ఈ ఛాలెంజ్‌ను స్వీకరించేలా ట్యాగ్ చేస్తూ ప్రోత్సహించాలి.
గత వారమే చిరంజీవితో భేటీ...
తొలిదశలో హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం పెంచేలా, వీటిపై అవగాహన కలిగేలా, కలిగించేలా నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ చేపట్టిన ఈ ‘హ్యాష్‌ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ను కొనసాగించనున్నారు. దశల వారీగా వివిధ రకాలైన రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌తో (జరిమానాల విధింపు) పాటు ఎడ్యుకేషన్‌కు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న కొత్వాల్ ఈ దిశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హ్యాష్‌ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలోని కాన్సెప్ట్‌ను పోలి ఉంది. గత శనివారం చిరంజీవితో పాటు ఆయన కుమార్తె సుస్మిత బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో సజ్జనార్‌ను మర్యాదపూర్వగా కలిసి భేటీ కావడం గమనార్హం.
భద్రత అనేది నిత్యనూతన ఫ్యాషన్: విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్
రహదారి భద్రత అనేది ఎప్పటికీ పాతబడని, నిత్యనూతనంగా ఉండే ఫ్యాషన్. ప్రతి ప్రయాణం మిమ్మల్ని, మీరు ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచాలనే తీర్మానంతోనే మొదలవ్వాలి. నగరవాసులం అంతా కలిసి 2025లో భద్రతనే ఓ వైరల్ ట్రెండ్‌గా మారుద్దాం. ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొనాలి. ఈ విధంగా ఒకరి నుంచి మరొకరికి స్ఫూర్తిపొందుతూ, యువతలో ట్రాఫిక్ నియమాలపై గౌరవాన్ని పెంచాలి. సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను ఓ అలవాటుగా మార్చా లన్నదే ఈ ఛాలెంజ్ ప్రధాన లక్ష్యం.
ఇది ప్రతి ప్రయాణానికి ముందు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, హెల్మెట్ కచ్చితంగా ధరించడం, ఈ నియమాలను పాటించేలా ఇతరులకూ స్ఫూర్తినివ్వడం... ఈ మూడు ముఖ్యమైన సూత్రాలను గుర్తు చేస్తుంది. ఈ డిజిటల్ ఛాలెంజ్‌లో ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయడం ద్వారా, నగర రహదారులపై భద్రత, బాధ్యతతో కూడిన సంస్కృతిని నిర్మిద్దాం.