breaking news
seatbelt
-
సిటీ పోలీసుల ‘సేఫ్ రోడ్ ఛాలెంజ్’
సాక్షి, సిటీబ్యూరో: ‘సహాయం చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పకు. అతడిని ముగ్గురికి సహాయం చేయమని చెప్పి ఆ ముగ్గురూ మరో ముగ్గురికి చొప్పున సహాయం చేసేలా ప్రోత్సహించు...’ సినీ నటుడు చిరంజీవి కథా నాయకుడిగా నటించిన స్టాలిన్ సినిమాలోని కాన్సెప్ట్ ఇది. నగర కొత్త కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ దీన్ని పోలిన వినూత్న కార్యక్రమానికి డిజైన్ చేశారు. ‘హ్యాష్‌ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ పేరుతో సోషల్‌మీడియా కేంద్రంగా సోమవారం ప్రారంభించారు. తొలి దశలో హెల్మెట్, సీట్‌బెల్ట్ ధారణపై దృష్టి పెట్టిన కమిషనర్ వాటి వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.సోషల్‌మీడియా, వైరల్... ఇవే ట్రెండ్స్ రహదారి భద్రతతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పించడానికి కొన్నేళ్లుగా ట్రాఫిక్ విభాగం వివిధ రకాలైన కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల కాలంలో సోషల్‌మీడియా ట్రెండ్ నడుస్తోంది. అందులో తమ ఫొటోలు, వీడియోలు వైరల్ కావాలని ఆశించే వాళ్లు అనేక మంది ఉంటున్నారు. ఈ ధోరణి యువతలో ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే వాహనచోదకులు.. ప్రధానంగా యువతలో అవగాహన పెంచడానికే సజ్జనర్ ‘హ్యాష్‌ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ను డిజైన్ చేశారు. అనునిత్యం ఏదో ఒక ఫొటో, వీడియో, కామెంట్లను పోస్టు చేసే నెట్జనుల దృష్టిని రహదారి భద్రత వైపు మళ్లించడానికి, ఈ అంశాలను ప్రచారం కల్పించడానికి అనువుగా దీన్ని కమిషనర్ రూపొందించారు. ప్రయాణం ప్రారంభానికి ముందు... దీనికి సంబంధించిన విధివిధానాలను కొత్వాల్ సజ్జనర్ సోమవారం తన అధికారిక ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా వాహనచోదకుడు తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు హెల్మెట్ (ద్విచక్ర వాహనం), సీట్‌బెల్ట్ (తేలికపాటి వాహనం) కచ్చితంగా ధరించాలి. అలా తాను రహదారి భద్రత నిబంధనలు పాటిస్తున్నట్లు చిన్న ఫొటో లేదా వీడియో తీసుకోవాలి. దాన్ని తమ సోషల్‌మీడియా ఖాతా ద్వారా ‘సేఫ్ రోడ్ ఛాలెంజ్’ అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా షేర్ చేయాలి. ఆ సమయంలో తమ ఫ్రెండ్స్ లిస్ట్ లేదా ఫాలోవర్స్‌లో ఉన్న ముగ్గురు స్నేహితులు లేదా బంధువుల్ని ఎంచుకోవాలి. వాళ్లు సైతం ఈ ఛాలెంజ్‌ను స్వీకరించేలా ట్యాగ్ చేస్తూ ప్రోత్సహించాలి. గత వారమే చిరంజీవితో భేటీ... తొలిదశలో హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం పెంచేలా, వీటిపై అవగాహన కలిగేలా, కలిగించేలా నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ చేపట్టిన ఈ ‘హ్యాష్‌ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ను కొనసాగించనున్నారు. దశల వారీగా వివిధ రకాలైన రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎన్స్ఫోర్స్మెంట్తో (జరిమానాల విధింపు) పాటు ఎడ్యుకేషన్‌కు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న కొత్వాల్ ఈ దిశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హ్యాష్‌ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలోని కాన్సెప్ట్‌ను పోలి ఉంది. గత శనివారం చిరంజీవితో పాటు ఆయన కుమార్తె సుస్మిత బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో సజ్జనార్‌ను మర్యాదపూర్వగా కలిసి భేటీ కావడం గమనార్హం. భద్రత అనేది నిత్యనూతన ఫ్యాషన్: విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ రహదారి భద్రత అనేది ఎప్పటికీ పాతబడని, నిత్యనూతనంగా ఉండే ఫ్యాషన్. ప్రతి ప్రయాణం మిమ్మల్ని, మీరు ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచాలనే తీర్మానంతోనే మొదలవ్వాలి. నగరవాసులం అంతా కలిసి 2025లో భద్రతనే ఓ వైరల్ ట్రెండ్‌గా మారుద్దాం. ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొనాలి. ఈ విధంగా ఒకరి నుంచి మరొకరికి స్ఫూర్తిపొందుతూ, యువతలో ట్రాఫిక్ నియమాలపై గౌరవాన్ని పెంచాలి. సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను ఓ అలవాటుగా మార్చా లన్నదే ఈ ఛాలెంజ్ ప్రధాన లక్ష్యం. ఇది ప్రతి ప్రయాణానికి ముందు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, హెల్మెట్ కచ్చితంగా ధరించడం, ఈ నియమాలను పాటించేలా ఇతరులకూ స్ఫూర్తినివ్వడం... ఈ మూడు ముఖ్యమైన సూత్రాలను గుర్తు చేస్తుంది. ఈ డిజిటల్ ఛాలెంజ్‌లో ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయడం ద్వారా, నగర రహదారులపై భద్రత, బాధ్యతతో కూడిన సంస్కృతిని నిర్మిద్దాం. -
సీట్బెల్ట్తో కిడ్నీలకూ రక్షణ!
కారు డ్రైవిం చేసే సమయంలో సీట్‌బెల్ట్ పెట్టుకోవడంతో కేవలం యాక్సిడెంట్స్‌లో ప్రాణరక్షణ మాత్రమేగాక... కిడ్నీలకూ మంచి రక్షణ కలుగుతుందంటున్నారు అధ్యయన వేత్తలు. సీట్ బెల్ట్స్ కట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం ఎయిర్‌బ్యాగ్ తెరచుకొని, వాహనంలోని వ్యక్తుల ప్రాణాలు కాపాడుతుందన్న విషయం తెలిసిందే. సీట్ బెల్ట్ పెట్టుకోవడమన్న అంశం కారణంగా వాహనంలోని ఎయిర్‌బ్యాగ్స్ తెరచుకుని, ప్రయాణికుల తలనూ, ఛాతీనీ అన్నివైపుల నుంచి ఆవరించడం వల్ల యాక్సిడెంట్ తాలూకు దెబ్బలను ప్రయాణికులకు తగలకుండా చూస్తాయి. అయితే ఇది మాత్రమే కాకుండా ఈ ఎయిర్‌బ్యాగ్ అనేది డ్రైవింగ్ చేసే వ్యక్తి మూత్రపిండాలనూ కాపాడుతుందని అమెరికన్ యూరాలజీ అసోసియేషన్‌కు చెందిన కొందరు అధ్యయన వేత్తలు చెబుతున్నారు. దాదాపు మూడు లక్షల మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా యాక్సిడెంట్ తర్వాత ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవడం వల్ల 2,580 మంది కిడ్నీలకు రక్షణ లభించిందంటూ వారు వివరించారు. (చదవండి: ముక్కుదిబ్బడ బాధిస్తోందా?! ) -
బ‘కిల్స్’! సేఫ్టీ ఫీచర్స్ లేని వాహనాల దందా!
సాక్షి, హైదరాబాద్: రహదారులపై జరిగే కారు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ఆయా కంపెనీలు అనునిత్యం అధ్యయనాలు చేస్తున్నాయి. వీళ్లు ప్రవేశపెట్టిన సేఫ్టీ ఫీచర్స్‌కు ‘విరుగుడు’ తయారు చేసే వాళ్లూ ఎక్కువైపోతున్నాయి. కారు ప్రమాదాల తీవ్రత, మృతులను తగ్గించడానికి ఉపకరించే సీట్ బెల్డ్ అలారం ఆపే బకెల్స్ సైతం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కార్ డెకార్స్ దుకాణాలతో పాటు ఆన్లైన్లో వీటిని విక్రయించేస్తున్నారు. ఫలితంగా సీట్ బెల్ట్ స్ఫూర్తి దెబ్బతింటోందని, భద్రతా చర్యలన్నీ వాహనచోదకుల కోసమే అన్నది గుర్తుపెట్టుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న కార్లు వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్ట్ వాడని కారణంగానే మృత్యువాతపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాణదాత సీట్‌బెల్ట్.. కారులో ఉన్న ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం దేన్నైనా గుద్దుకున్నా.. హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు) తదితరాలను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఫలితంగా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. తేలికపాటి వాహనాల్లో ప్రయాణిస్తున్న వాళ్లు కచ్చితంగా సీట్‌బెల్ట్ వాడితే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడచ్చు. ప్రస్తుతం కేవలం కారు నడిపే వ్యక్తి మాత్రమే కచ్చితంగా సీటుబెల్ట్ ధరించేలా నిబంధనలు ఉన్నాయి. దీన్ని మిగిలిన వారికీ విస్తరించాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకోవడంతోనే మృత్యుంజయుడు అయ్యాడు. ఇలాగే అనేక ప్రమాదాల్లో ప్రయాణికులకు సీటుబెల్ట్ ప్రాణదాతగా నిలిచింది. అలారం వచ్చేలా టెక్నాలజీ.. ఇంతటి కీలకమైన సీట్‌బెల్ట్ కచ్చితంగా వాడేలా చేయడానికి కార్ల తయారీ కంపెనీలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తొలినాళ్లలో కేవలం డ్రైవర్, ఇప్పుడు అతడితో పాటు ముందు సీట్లో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దీన్ని ధరించకపోతే అలారం వచ్చేలా టెక్నాలజీ అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి అనేక మంది వాహనచోదకులు సీట్‌బెల్ట్ బకెల్ను దాని సాకెట్లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. ఇటీవల దీని కోసం సీట్ బెల్ట్ అలారం స్టాపర్ బకెల్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. దీన్ని సీట్‌బెల్ట్ బకెల్ స్లాట్‌లో ఉంచేస్తే చాలు... కనీసం వెనుక నుంచీ బెల్ట్ పెట్టుకోనక్కర్లేదు. ఈ బకెల్స్ను కార్ డెకార్స్ దుకాణాలు వివిధ రకాలైన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాయి. ఆన్లైన్లో ఏ కంపెనీ కారు వినియోగిస్తుంటే ఆ కంపెనీ లోగోతో అమ్మే వర్తకులు పట్టుకు వచ్చాయి. ఇటీవల కాలంలో వీటి వినియోగం పెరిగిందని అధికారులే చెబుతున్నారు. వీటి ద్వారా అలారం మోగకుండా ఆపవచ్చు కానీ ప్రమాదం జరగకుండా కాదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సీట్‌బెల్ట్ అనేది వాహన చోదకుడి ప్రాణాలు రక్షిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ బకెల్స్ వినియోగంపై చర్యలకు యోచిస్తున్నామని చెబుతున్నారు. (చదవండి: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!) -
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి!
శ్రీకాకుళం సిటీ : జిల్లాలో గురువారం నుంచి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ జిల్లాస్థాయి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు రవాణాశాఖతోపాటు పలు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వెయ్యి రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది. హెల్మెట్ వాడకం అమలుపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అంతగా అమలుకు నోచుకోలేదు. అయినప్పటికీ ప్రమాదాల స్థాయి అధికంగా ఉండడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు హెల్మెట్ వాడక ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వచ్చారు. తొలుత జాతీయ రహదారులపై ప్రయాణించేవారు హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని మండలాల్లో పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ అన్ని తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లాలో ఏటా అనేక మంది హెల్మెట్ లేకపోవడంతో ప్రయాణ సమయాల్లో ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా.. మరికొందరు క్షతగాత్రులు అవుతున్నారు. జిల్లాలో 2.32 లక్షల ద్విచక్ర వాహనదారులు, 2.84 లక్షల మంది నాలుగు టైర్ల వాహనదారులు ఉన్నారు. ఈ పరిస్థితిలో ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నాలుగు టైర్ల వాహనదారులు సైతం సీట్‌బెల్ట్ పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేశారు. జాతీయ రహదారి అయినా, గ్రామాలైనా ప్రమాదాల తీరుతెన్నులు ఒకేలా ఉన్నాయని చెబుతున్న ఆయా శాఖల అధికారులు సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి అంటూ హితబోధ చేస్తున్నారు. హెల్మెట్ ధరించని పక్షంలో రూ.వెయ్యి జరిమానాను విధిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు మైనర్లు వాహనాన్ని నడిపితే వారితోపాటు వారి తల్లిదండ్రులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.


