లేక రీల్స్, నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నాడా?
ధైర్యముంటే ఈరోజు ఆయన నా ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి
టీడీపీ ప్రతినిధుల్ని ఉతికిపారేసిన రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి
సాక్షి, అమరావతి: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం పరిష్కరించడంలో ఘోరాతి ఘోరంగా విఫలమైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై జాతీయ మీడియా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది. ఇంత పెద్ద సంక్షోభం తలెత్తితే మంత్రి ఏం చేస్తున్నారు? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా, లేక రీల్స్ చేస్తున్నారా.. నెట్‌ఫ్లిక్స్‌లో వీడియోలు చూస్తున్నారా అంటూ కడిగిపారేస్తోంది.
రిపబ్లిక్ టీవీలో ప్రెజెంటర్ ఆర్నాబ్ గోస్వామి లేవనెత్తుతున్న ప్రశ్నలకు బదులివ్వలేక తెలుగుదేశం పార్టీ ఆపసోపాలు పడుతోంది. తొలుత.. రిపబ్లిక్ టీవీలో చర్చలో పాల్గొన్న దీపక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ పరిస్థితిని నారా లోకేశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. ఇందుకోసం వార్ రూమ్‌ని కూడా ఏర్పాటుచేశార’ంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో టీడీపీ అభాసుపాలైన విషయం తెలిసిందే.
ఇక ఆదివారంకొమ్మారెడ్డి పట్టాభిరాంని పంపిస్తే దానికి రెండింతలు పరాభవం పార్టీ మూటగట్టుకుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇదే పెద్ద చర్చగా నడుస్తోంది. అర్నాబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇద్దరూ నీళ్లునమిలారు.
ధైర్యం ఉంటే చర్చలో పాల్గొనమనండి..
పట్టాభిని అర్నాబ్ ఏమి అడిగారంటే.. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన కె. రామ్మోహన్‌నాయుడు విమానయాన మంత్రి శాఖ నిర్వహిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అంటూ పట్టాభిని సూటిగా ప్రశ్నించారు. సమస్యను తెలుసుకోవడానికి విమానయాన శాఖ మంత్రికి నేను ఫోన్ చేస్తే.. హలో హలో అంటూ ఫోన్ పెట్టేస్తున్నాడని.. ధైర్యం ఉంటే ఈరోజు చర్చలో మంత్రి పాల్గొనాలంటూ పట్టాభికి సవాల్ విసిరారు.
ఈ రోజు నా చర్చలో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ రెట్టించి అడిగారు. వెంటనే పట్టాభి కలుగజేసుకుని, మంత్రి సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారనగానే.. సమస్య పరిష్కారమంటే కూర్చుని నెట్‌ఫ్లిక్స్ వీడియోలు చూడటమా! అంటూ అర్నాబ్ గాలితీసేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అని పట్టాభి చెప్పగా.. అయితే మీ మంత్రిని నా కాల్ లిఫ్ట్ చేయమనండి అంటూ అర్నాబ్ సవాల్ విసిరారు.
ఈరోజు ఇంతమంది ప్రజలు ఇబ్బందులుపడుతుంటే దాన్ని తెలుసుకోవడానికి ఫోన్‌చేస్తే మీ మంత్రి హలో హలో అంటూ ఫోన్ పెట్టేస్తారా అంటూ మండిపడ్డారు. ఇలా రెండ్రోజులుగా జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలు కావడంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ పరువు పోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.


