ప్రమాదాలకు నిలయంగా మన్యం
హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు
జీవితాలను కుదిపేస్తున్న మలుపులు
కొండ కోనలు.. చూడచక్కని పచ్చని అందాలు.. వాగులు.. ఆపై ఘాట్ రోడ్లు.. ముచ్చట గొలిపే ప్రకృతి సోయగాలు.. వన్యప్రాణులు.. పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఆహ్లాదంగా సాగిపోతున్న ఏజెన్సీ ప్రయాణంలో ఓ ‘మలుపు’ జీవితాన్నే మార్చేస్తోంది.. కొందరిని తిరిగి రాని లోకాలకు తీసుకుపోతుంటే, మరికొందరు గాయాలతో బయట పడుతున్నారు.. పర్యాటక అందాలు తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది తరలి వస్తుంటారు.. అలాంటి వారికి ఇక్కడి రోడ్లపై అవగాహన లేక, ఆపై మద్యం మత్తు, మరోపక్క వేగానికి కళ్లెం లేకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
రంపచోడవరం: ప్రకృతి అందాలకు నిలయమైన మన్యంలో రోడ్డు ప్రమాదాలు అనేక మంది ప్రాణాలను హరిస్తున్నాయి. మితిమీరిన వేగం.. ఆపై మలుపులపై అవగాహన లేకపోవడం.. మద్యం మత్తులో ప్రయాణంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. జిల్లాలో రంపచోడవరం, మారేడుమిల్లి అందాలు చూసేందుకు అనేక మంది వచ్చి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలను నివారణకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తున్నా, ఎక్కడ తగ్గడం లేదు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం వైపున పోక్సుపేట వద్ద ఏజెన్సీ ముఖ ద్వారం ప్రారంభమవుతోంది. గోకవరం – రంపచోడవరం రోడ్డులో అనేక చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతానికి బైక్‌లపై వచ్చేవారు వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. గోకవరం నుంచి రంపచోడవరం గ్రామానికి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పోక్సుపేట దాటిన వెంటనే చిన్నబాపనమ్మ తల్లి గుడి వద్ద ప్రమాదకర మలుపు ఉంది. తరువాత ఏ–1 రిసార్ట్స్ వద్ద మరో మలుపు ఆందోళనకు గురిచేస్తోంది.
ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నరసాపురం దాటిన తరువాత రోడ్డు ఎక్కువ దూరం దిగుడుగా ఉండి ఒక పెద్ద మలుపు ఉంటుంది. సీతపల్లి గుడి తర్వాత ప్రమాదకర మలుపు ఉంది. గతంలో ఇక్కడ అనేక మంది మృత్యువాత పడ్డారు. వేగంగా వచ్చే వాహనదారులు దగ్గర మలుపు కావడంతో కంట్రోల్ చేయలేక ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఐ.పోలవరం గ్రామానికి సమీపంలోని పాలకాలవ దగ్గరలో, జాగరంపల్లి జంక్షన్ వద్ద మలుపులు ఉన్నాయి.
రంపచోడవరం– గోకవరం రోడ్డులో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఏడుగురాళ్లపల్లికి చెందిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు పాలకాలువ సమీపంలో వాహనాన్ని ఢీకొని మృతి చెందారు. ఇదే మలుపులో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రంపచోడవరం –మారేడుమిల్లి మార్గంలోనూ మలుపులు హడలెత్తిస్తున్నాయి. రంపచోడవరం అటవీశాఖ చెక్‌పోస్టు, ఏపీఆర్ కళాశాల వద్ద ప్రమాదకర మలుపు ఉంది.
మారేడుమిల్లి రోడ్డులో అనేక చోట్ల టరి్నంగ్ పాయింట్‌లు ఉన్నాయి. గెద్దాడ గ్రామం దాటిన తరువాత సీమగండి వద్ద ఒంపుగా మలుపు ఉంది. ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయి. సున్నంపాడు – దేవరపల్లి వద్ద కూడా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. మారేడుమిల్లి నుంచి వస్తూ అనేక మంది పర్యాటకులు ప్రమాదాల బారిన పడ్డారు. తాజాగా మారేడుమిల్లి రోడ్డులో దేవరపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో వైటీసీ మేనేజర్ మృతి చెందారు.
ఘాట్ రోడ్లలోనూ..
మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో అనేక చోట్ల భద్రతా చర్యలు లేవు. దీంతో వాహనాలు లోయలో పడి ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. పాములేరు నుంచి ప్రారంభమయ్యే ఘాట్ రోడ్డు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డులో అనేక చోట్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నా పట్టించుకునే నా«థుడే లేడు. ఇటీవల ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడి అనేక మంది మృత్యువాత పడ్డారు.
గతంలో కర్ణాటకాకు చెందిన యాత్రికుల మినీ బస్సు ఘాట్ రోడ్డులో పైమలుపు నుంచి అదుపుతప్పి కిందపడి ఏడుగురు వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కనీస చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అనేక చోట్ల రక్షణ గోడలు, ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మత్తు వీడక..
ఏజెన్సీలో వివిధ ప్రాంతాలకు అనేక మంది సరదాగా గడిపేందుకు వస్తుంటారు. మధుర స్మృతులను మూటగట్టుకోవాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు మద్యం తాగుతుంటారు. తర్వాత వేగంగా వెళ్తూ తెలియని మలుపుల్లో ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ మత్తు ఎందరినో తిరిగిరాని లోకాలకు తీసుకెళ్తుంది. దీనిపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎక్కడా మార్పు రావడం లేదు. చివరికి అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి.
తరచూ ప్రమాదాలు
ఏజెన్సీ ప్రాంతానికి వస్తున్న అనేక మంది పర్యాటకులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కో ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ అందాలు చూడటానికి వచ్చి ప్రమాదాల బారిన పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. –గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ సభ్యుడు, మారేడుమిల్లి
అవగాహన కల్పిస్తున్నాం..
మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడంతోనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీనిపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇక్కడ ప్రమాదకర మలుపుల వద్ద త్వరలోనే బోర్డులు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. –గోపి నరేంద్రప్రసాద్, సీఐ, మారేడుమిల్లి


