రోడ్డు విస్తరణ పేరిట ఆస్తులను కూల్చేసిన వైనం
నిడదవోలు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లు, ఆస్తులను టార్గెట్ చేస్తూ ధ్వంసం చేస్తున్నారు. తాజాగా శనివారం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులు కూల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డును నెల రోజులుగా విస్తరిస్తున్నారు. అయితే ఎటువంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా.. నిబంధనల ప్రకారం యజమానులకు తగినంత సమయం ఇవ్వకుండా ఆక్రమణల పేరిట ఆస్తుల విధ్వంసానికి అధికారులు పూనుకున్నారు.
నిబంధనలు పక్కన పెట్టి మరీ టీడీపీ నాయకుల ఆదేశాలతో కేవలం వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లు, షాపులను లక్ష్యంగా చేసుకుని ఇళ్ల ముందు భాగాలను కూల్చివేశారు. టీడీపీ, జనసేన నాయకుల ఇళ్లు, షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. టీడీపీ ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, మరో నాయకుడు గన్నమనేని వెంకట సుబ్రహ్మణ్యం తమ అనుచరులతో కలసి దగ్గర ఉండి మరీ వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయించారు.
సింహాద్రి రామకృష్ణ ఆదేశాలతో పోలీసుల అండతో రోడ్డు విస్తరణ పేరిట అధికారులు పలు ప్రైవేటు ఆస్తులను పొక్లెయిన్‌తో ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు అక్కడకు చేరుకుని, ఆస్తుల ధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుకు సంబంధించిన రికార్డులు చూపించాలని తహసీల్దార్ ప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీనివాసాచార్యులును నిలదీశారు.
ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అభివృద్ధికి తాము ఏనాడూ అడ్డు చెప్పలేదని, అయితే రోడ్డు విస్తరణకు సంబంధించిన రికార్డులు చూపించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డు కొలతలు చూపించాలని, నిజంగా ప్రైవేటు భవనాల్లో ఆక్రమణలు ఉంటే ప్రభుత్వం తొలగించవచ్చని తేల్చి చెప్పారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.


