అప్పుడే పుట్టిన కంపెనీలకు విలువైన భూములు
నాయుడుపేటలో ఎన్‌ఏఎన్ గ్రీన్‌మెట్‌కు 21.36 ఎకరాలు
గత నవంబర్‌లో రూ.లక్ష మూలధనంతో ఏర్పాటైన కంపెనీకి రూ.కోట్లు పలికే భూములు కారుచౌకగా..
2 నెలల క్రితం నెలకొల్పిన స్కై స్టోరేజ్‌కు అనకాపల్లిలో 15 ఎకరాలు.. పలు కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ముక్కుతూ మూలుగుతూ రూ.లక్ష మూలధనంతో ఏర్పాటైన నెలలు నిండని కంపెనీలు రూ.వందల కోట్ల పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయట! సత్తాలేని సంస్థలకు ఆగమేఘాలపై ఖరీదైన భూముల సంతర్పణ! పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు సర్కారు భూముల పందేరం ఇదీ! తాజాగా ఎన్‌ఏఎన్ గ్రీన్‌మెట్, స్కై స్టోరేజ్ సంస్థలకు కూటమి ప్రభుత్వం ఇదే విధంగా భూములను కేటాయించింది.
మూడు నెలల క్రితం కేవలం రూ.లక్ష మూలధన పెట్టుబడితో ముంబై కేంద్రంగా ఏర్పాటైన ఎన్‌ఏఎన్ గ్రీన్‌మెట్ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద 21.36 ఎకరాలను కేటాయిస్తూ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వేదాంత గ్రూపు సమీప బంధువులైన అనన్య అగర్వాల్, నైవేద్య అగర్వాల్ 2025 నవంబర్10న ఎన్‌ఏఎన్ గ్రీన్‌మెట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నెలకొల్పారు. కంపెనీని ఏర్పాటు చేయడం.. రాష్ట్ర ప్రభ్వుత్వంతో చర్చలు జరపడం.. ఎస్‌పీసీ, ఎస్‌పీబీ, మంత్రివర్గం ఆమోదం పొందడం..
ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యే విధంగా ఫైళ్లు శరవేగంగా పరిగెత్తాయంటే దీని వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాయుడుపేటలో రూ.కోట్లు పలుకుతున్న భూమిని ఎకరం కేవలం రూ.30 లక్షలు చొప్పున కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కారు చౌకగా భూమితో పాటు పెట్టుబడిలో 60.38 శాతం రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు.
స్కై స్టోరేజ్ సొల్యూషన్స్..
వేర్ హౌసింగ్, లాజిస్టిక్ సేవలను అందించేలా స్కై స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2025 డిసెంబర్ 5న విశాఖ కేంద్రంగా ఏర్పాటైంది. కేవలం రూ.లక్ష మూలధనంతో పవన్ ప్యాలెస్, దొడపర్తి, అక్కయ్యపాలెం, విశాఖ చిరునామాతో సిదార్థ అగర్వాల్, యోగేష్ శాంతిలాల్ పటేల్‌లు దీన్ని నెలకొల్పారు. ఈ కంపెనీ ఏర్పాటైన రెండు నెలల్లోనే అనకాపల్లిలో 15 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం రూ.80 లక్షలు చొప్పున తక్కువ ధరకు ఏపీఐఐసీ భూమిని కేటాయించింది. 
నాయుడుపేటలో ఎన్‌ఏఎన్ గ్రీన్‌మెట్ లిమిటెడ్‌కు అత్యంత విలువైన భూమిని ఎకరం రూ.30 లక్షలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు
⇒ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు ఎకరా రూపాయి చొప్పున విశాఖ జిల్లా తర్లువాడ వద్ద 30 ఎకరాలు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సెమి కండక్టర్స్ పాలసీ కింద తొలి కంపెనీగా ప్రత్యేకంగా గుర్తిస్తూ ఎకరా రూపాయికే భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు పెట్టుబడిలో 40 శాతం వరకు ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. సిగాచీ ఇండస్ట్రీస్‌కు గుట్టపాడు క్లస్టర్‌లో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 94.70 ఎకరాలు కేటాయించారు. వీటితోపాటు 45.02 శాతం రాయితీలు ఇవ్వనున్నారు.
⇒ వారీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌కు కూటమి సర్కారు అనకాపల్లిలో సుమారు 300 ఎకరాలు ఎకరా రూ.50 లక్షలు చొప్పున కేటాయించింది. 59.73 శాతం ఫిక్స్‌డ్ క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వనున్నారు.
⇒ పల్నాడు జిల్లా కొండవీడు వద్ద 12.31 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు అర్షథాతు గ్రీన్ నానోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎకరానికి రూ.5 లక్షల క్యాపిటల్ సబ్సిడీతోపాటు ఆ భూమిని 22 ఏ నుంచి తొలగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
⇒ సిఫి ఇన్ఫినిటీ స్పేసెస్ ఐటీసెజ్‌కు కేటాయించిన భూములకు సకాలంలో నగదు చెల్లింపులో విఫలం కాగా ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించేందుకు 90 రోజుల గడువు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
⇒ ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా దత్తులూరు వద్ద 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
⇒ రేమాండ్ అనుబంధ కంపెనీ జేకే మైనీకి కేటాయించిన భూములకు ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
⇒ విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనిట్‌కు పెట్టుబడిలో 40 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
⇒ బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో 28.05 ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 14.28 ఎకరాలను కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.


