తిరుచానూరులో నకిలీ మద్యం తయారీ | Fake liquor manufacturing in Tiruchanur | Sakshi
Sakshi News home page

తిరుచానూరులో నకిలీ మద్యం తయారీ

Mar 8 2026 5:28 AM | Updated on Mar 8 2026 5:28 AM

Fake liquor manufacturing in Tiruchanur

పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలోనే తయారీ కేంద్రం 

యూట్యూబ్‌ చూసి నకిలీ మద్యం తయారీ 

40 నకిలీ మద్యం ఫుల్‌ బాటిళ్లు, ముడి సరుకు స్వాదీనం 

గంజాయి సేవిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు    

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చంద్రబాబు ప్రభుత్వంలో ఇటీవల అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్లు బట్టబయలవ్వడం కళ్లెదుట కదలాడుతుండగా, తాజాగా తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. తిరుచానూరు పోలీసులు శనివారం చేపట్టిన కార్టెన్‌ సెర్చ్‌లో ఈ బాగోతం బట్టబయలైంది. 

చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుపతి రూరల్‌ మండలం పాడిపేట శేషాద్రి నగర్‌లో ఐదుగురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు, సిబ్బందితో కలసి కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి సేవిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

శేషాద్రి నగర్‌లో తనిఖీలు చేస్తుండగా నాగేష్‌ రెడ్డి ఇంట్లో పదుల సంఖ్యలో నకిలీ మద్యం బాటిళ్లను చూసి పోలీసులు నివ్వెరపోయారు. అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 40కి పైగా నకిలీ మద్యం ఫుల్‌ బాటిళ్లను, నకిలీ మద్యం తయారీకి అవసరమైన ముడి సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీడీలు, సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతిలోని ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్న నాగేష్‌ రెడ్డి యూ ట్యూబ్‌లో మద్యం తయారీ విధానాన్ని పరిశీలించారు. ద్రాక్ష, చక్కెర, మరికొన్ని ద్రవాల మిశ్రమంతో కొంతకాలంగా ఇంట్లోనే మద్యం తయారు చేస్తున్నాడు. నిందితుడిని పోలీసులు తిరుచానూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ దందాలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఏడాది క్రితం ఇదే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో..
గత ఏడాది జనవరిలో ఇదే తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దామినేడు వద్ద ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. దామినేడు ఇందిరమ్మ కాలనీలోని ఓ నివాసంలో సెలబ్రిటీ, ఓల్డ్‌ అడ్మిరల్, ట్రాపికానాకు కంపెనీ లేబుళ్లతో ఉన్న 591 నకిలీ మద్యం బాటిళ్లు, 6,600 ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు, 805 లీటర్ల స్పిరిట్‌ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రాయల్‌ క్యాన్‌ విస్కీ, ట్రాపికానా బ్రాందీ, హనీబీ బ్రాందీ, కేరళ మాల్ట్‌ విస్కీ, మంజీరా, నైసీ హార్స్, సెలబ్రిటీ చాయిస్‌ కంపెనీలకు చెందిన నకిలీ లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఇక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసి తిరుపతి, రైల్వే కోడూరు ప్రాంతాల్లో బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. నకిలీ మద్యం తయారు చేసే ముఠాకు చెందిన అయ్యప్ప, నారాయణ రాజులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ మద్యం తయారీలో అసలు సూత్రధారి అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం పింఛా గ్రామానికి చెందిన వెంకట రమణగా గుర్తించినట్లు నాటి ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. అతను గల్ఫ్‌లో కొంత కాలం ఉండి దామినేడులోని ఇందిరమ్మ గృహాలను అడ్డాగా చేసుకున్నట్లు తెలిపారు. ఇదే తరహాలో ఇప్పుడు మరో నకిలీ మద్యం తయారీ కేంద్రం వెలుగు చూడటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement