మహిళలకు వైఎస్ జగన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మహిళలతోపాటు యావత్ మహిళలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లని పేర్కొన్నారు. మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని, తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటాయని తెలిపారు.
అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేసిందని గుర్తుచేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించామని చెప్పారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకుమించిన పాత్ర పోషిస్తున్న మహిళల అభ్యున్నతే... ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.


