సాగు సమస్యలకు ప్రకృతి సేద్య పిత భాస్కర్‌ సావే సూచనలివే!

Gandhi Of Natural Farming Bhaskar Save's Organic Farming Suggestions For Farmers - Sakshi

భారతీయ ప్రకృతి సేద్య సంస్కృతికి ఊపిర్లూదిన అతికొద్ది మహారైతుల్లో భాస్కర్‌ సావే ఒకరు. ఆరేళ్ల క్రితం 2015 సెప్టెంబర్‌ 24న తన 93వ ఏట ఆ మహోపాధ్యాయుడు ప్రకృతిలో కలసిపోయినా.. ఆయన వదలివెళ్లిన ప్రకృతి సేద్య అనుభవాలు రైతు లోకానికి ఎప్పటికీ దారి దీపం వంటివే! రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడే వ్యవసాయం హింసాయుతమైనదని అంటూ.. అహింసాయుతమైన ప్రకృతి సేద్యాన్ని అక్కున చేర్చుకున్నారు సావే. ప్రకృతి సేద్య గాంధీగా పేరుగాంచిన సావేను మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్మరించుకోవటం మరో విశేషం. 

ప్రకృతి వ్యవసాయ మహాపాధ్యాయుడిగానే కాక, స్వతహాగా తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన సాధించి చూపిన సుసంపన్న ప్రకృతి సేద్య ఫలాల గురించి మననం చేసుకోవటం స్ఫూర్తిదాయకం. ‘వన్‌ వరల్డ్‌ అవార్డ్‌ ఫర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ పురస్కారంతో అంతర్జాతీయ సేంద్రియ సేద్య ఉద్యమాల సమాఖ్య (ఐఫోమ్‌)  2010లో ఆయనను సత్కరించింది. ‘హరిత విప్లవం’ దుష్ఫలితాలపై ఆయన 15 ఏళ్ల క్రితం రాసిన బహిరంగ లేఖలు చాలా ప్రాచుర్యం పొందాయి. 

న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి (స్వచ్ఛంద సంస్థల నిరసనలు, బహిష్కరణల నడుమ) ‘ఆహార వ్యవస్థల పరివర్తనా శిఖరాగ్రసభ–2021’ను ఇటీవల నిర్వహించిన  నేపథ్యంలో.. ఇప్పటికీ, ఎప్పటికీ రైతులకు అనుసరణీయమైన (రైతులు, ప్రజలు, జంతుజాలం, భూగోళం మేలు కోరే) భాస్కర్‌ సావే ఎలుగెత్తి చాటిన ప్రకృతి సాగు పద్ధతి గురించి వివరంగా తెలుసుకుందాం.. భాస్కర్‌ సావే సన్నిహిత సహచరుడు భరత్‌ మన్సట రచన ‘ద విజన్‌ ఆఫ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌’ నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం..

భాస్కర్‌ సావే భావాలకు, ఆచరణకు నిలువెత్తు నిదర్శనం ఆయన బిడ్డలా సాకిన 14 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ‘కల్పవృక్ష’. పశ్చిమ తీరాన కోస్టల్‌ హైవేకి దగ్గరలో గుజరాత్‌లోని వల్సద్‌ జిల్లా దెహ్ర గ్రామంలో ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఉంది. 10 ఎకరాల్లో (45 ఏళ్ల నాటి) పండ్ల తోట.. భాస్కర్‌ సావే పచ్చని సంతకంలా విరాజిల్లుతూ ఉంది. ఎన్నో జాతుల సమాహారంగా ఉండే ఈ తోటలో కొబ్బరి, సపోట చెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. 2 ఎకరాల్లో సీజనల్‌ పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. మిగతా రెండెకరాల్లో కొబ్బరి నర్సరీని నిర్వహిస్తున్నారు.

ఒక్క దిగుబడే కాదు (పంటల దిగుబడి, పోషకాల నాణ్యత, రుచి, జీవవైవిధ్యం, పర్యావరణ సుస్థిరత, నీటి సంరక్షణ, విద్యుత్తు వినియోగ సామర్థ్యం, ఆర్థిక లాభదాయకత వంటి) ఏ కోణంలో చూసినా.. రసాయనిక వ్యవసాయ క్షేత్రం కన్నా ‘కల్పవృక్ష’ మిన్నగానే ఉంటుంది. బయటి నుంచి తెచ్చి వాడేవి దాదాపు ఏమీ ఉండవు. ఖర్చు (ఇందులో కూడా చాలా వరకు కోత కూలి ఉంటుంది) చాలా తక్కువ. 

‘కల్పవృక్ష’ సుసంపన్నత   
కల్పవృక్ష క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ‘సహకారమే ప్రకృతి మౌలిక సూత్రం’ వంటి ఎన్నో సూక్తులు భాస్కర్‌ సావే భావాలకు ప్రతిరూపంగా సందర్శకులకు కనిపిస్తాయి. ప్రకృతి, వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, ఆథ్యాత్మికతలకు సంబంధించిన సావే ప్రజ్ఞను ఇవి చాటుతుంటాయి. 

కల్పవృక్ష క్షేత్రం..
ఆహారోత్పత్తి సామర్థ్యానికి దానికదే సాటి. ఏడాదికి ఒక్కో కొబ్బరి చెట్టు 350 నుంచి 400 కాయల దిగుబడినిస్తుంది. 45 ఏళ్ల క్రితం నాటిన సపోటా చెట్టు ఒక్కోటి ఏటా 300 కిలోల పండ్లనిస్తుంది. పండ్ల తోటలో కొబ్బరి, సపోటాతోపాటు అరటి, బొప్పాయి, వక్క, ఖర్జూరం, మునగ, మామిడి, పనస, తాటి, సీతాఫలం, జామ, చింత, వేపతోపాటు అక్కడక్కడా వెదురు, కరివేపాకు, తులసి, మిరియాలు, తమలపాకు, ప్యాషన్‌ ఫ్రూట్‌ తీగ జాతులు కూడా వత్తుగా ఉంటాయి. 

పదెకరాల్లో 150 క్వింటాళ్ల దిగుబడి
తోట అంతటా వత్తుగా పెరిగే రకరకాల చెట్ల కింద రాలిన ఆకులు కొన్ని అంగుళాల మందాన పరచుకొని నేలతల్లికి ఆచ్ఛాదన కల్పిస్తూ ఉంటాయి. ఎండ నేలను తాకే పరిస్థితి ఉండదు. సూక్ష్మ వాతావరణం నెలకొనటం వల్ల వానపాములు, సూక్ష్మజీవరాశి నేలను నిరంతరం సారవంతం చేస్తూ ఉంటాయి. ఎండ, వాన, చలి నుంచి నేలను ఆకుల ఆచ్ఛాదన కాపాడుతూ ఉంటుంది.

‘ఏ రైతైతే తన పొలం మట్టిలో వానపాములు, సూక్ష్మజీవరాశి చక్కగా వృద్ధి చెందేలా జాగ్రత్త తీసుకుంటారో.. ఆ రైతు తిరిగి పురోభివృద్ధిని పుంజుకున్నట్లే’ అంటారు భాస్కర్‌ సావే. నేలకు ఇలా రక్షణ కల్పిస్తూ రసాయనాలు వాడకుండా శ్రద్ధగా సాకుతూ సుసంపన్నం చేయటాన్నే ప్రకృతి వ్యవసాయ మార్గం అని ఆయన వివరించేవారు. పదెకరాల తోటలో ఎకరానికి ఏడాదికి 150 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి తీస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఆహారంలో వుండే పోషకాల సాంద్రత రసాయనిక వ్యవసాయంలో పండించిన పంటలో కన్నా ఎక్కువగా ఉంటాయి. 

రెండెకరాల్లో సీజనల్‌ పంటలు
రెండెకరాల్లో దేశవాళీ ‘నవాబీ కోలం’ అనే రుచికరమైన, ఎత్తయిన వరి పంటతోపాటు, అన్ని రకాల పప్పుధాన్యాలు, చలికాలంలో గోధుమ, కూరగాయలు, దుంప పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ పంట దిగుబడులతోనే భాస్కర్‌ సావే కుటుంబం, అతిథుల ఆహారపు అవసరాలు పూర్తిగా తీరుతాయి. బియ్యం మిగిలితే బంధు మిత్రులకు కానుకగా ఇస్తూ ఉంటారు.  

రసాయనిక సేద్యాన్ని వదలి రైతులు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఏటేటా నేల సారం పెరుగుతూ ఉండే కొద్దీ పంట దిగుబడులు మెరుగుపడుతూ ఉంటాయి. ప్రకృతి సేద్య మెళకువలు పాటిస్తే కొన్ని ఏళ్లలో భూమి సంపూర్ణ స్వయం పోషకత్వాన్ని సంతరించుకుంటుంది. కలుపు తీవ్రత తగ్గుతుంది. 2–3 ఏళ్ల తర్వాత కలుపు తీయాల్సిన అవసరం ఉండదు. అప్పటివరకు కలుపు మొక్కల్ని కోసి ఆచ్ఛాదనగా వేస్తూ పోవాలి. ‘అన్నపూర్ణమ్మ తల్లి ఆశీస్సులతో ప్రకృతి వ్యవసాయం ప్రతి జీవికీ సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తుంది’ అంటారు భాస్కర్‌ సావే!       
                    
సాగు సమస్యలు సావే అనుభవాలు
వ్యవసాయంలో రైతులంతా సాధారణంగా ముఖ్యమైన సమస్యలుగా భావించే అంశాలు ఐదు.. దుక్కి, భూసారాన్ని పెంపొందించే ఎరువులు, కలుపు, నీరు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకునే పద్ధతులు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతే ఏ విధంగా చూసినా రైతుకు, ప్రజలకు, భూగోళానికి, జంతుజాలానికి మేలు చేకూర్చుతుందని మనసా వాచా కర్మణా నమ్మే దిగ్గజ రైతు భాస్కర్‌ సావే భావాలు విభిన్నంగా ఉంటాయి..   

దుక్కి
పండ్ల తోటల్లో మొక్కలు నాటేటప్పుడు మాత్రమే ఒక్కసారి దుక్కి చేయటం తప్ప తర్వాత ఇక తవ్వే అవసరమే లేదు. ఆకులు అలములు నేలను కప్పి ఉంచేలా ఆచ్ఛాదన నిరతరం ఉండేలా చూడాలి. పండ్ల తోట ఎన్నేళ్లున్నా ఇంకేమీ చెయ్యనవసరం లేదు, దిగుబడులు పొందటం తప్ప. 
అయితే, విత్తనాలు వేసిన కొద్ది నెలల్లో దిగుబడినిచ్చే సీజనల్‌ పంటల పరిస్థితి వేరు. వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటల విషయంలో ప్రతి పంట కాలంలోనూ తేలికపాటి దుక్కి చేయాల్సి వుంటుంది. అందుకే.. తోటల సాగుకు ‘ప్రకృతి వ్యవసాయ పద్ధతి’ పూర్తిగా తగినదని భావించే భాస్కర్‌ సావే.. సీజనల్‌ పంటల సాగును ‘సేంద్రియ వ్యవసాయం’గా చెప్పేవారు.  

కలుపు 
కలుపు తీయకూడదు అనేది భాస్కర్‌ సావే అభిప్రాయమే కాదు అనుభవం కూడా. కలుపు మొక్కలను పూర్తిగా పీకేసి లేదా కలుపు మందు కొట్టేసి పొలంలో పంట మొక్కలు తప్ప కలుపు మొక్కలు అసలు కనపడకుండా తుడిచిపెట్టడం సరికాదు. పంట మొక్కల కన్నా ఎక్కువ ఎత్తులో కలుపు మొక్కలు పెరిగి, పంటలకు ఎండ తగలకుండా అడ్డుపడే సంకట స్థితి రానివ్వకూడదు. ఆ పరిస్థితి వస్తుందనుకున్నప్పుడు కలుపు మొక్కలను కత్తిరించి, అక్కడే నేలపై ఆచ్ఛాదనగా వేయటం ఉత్తమ మార్గం అని భాస్కర్‌ సావే భావన.

నీటి పారుదల
భూమిలో తేమ ఆరిపోకుండా చూసుకునేంత వరకు మాత్రమే పంటలకు నీరు అవసరమవుతుంది. తోటల్లో అనేక ఎత్తులలో పెరిగే వేర్వేరు జాతుల మొక్కలు, చెట్లను వత్తుగా పెంచాలి. పొలాల్లో మట్టి ఎండ బారిన పడకుండా ఆచ్ఛాదన చేసుకుంటే నీటి అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. 

సస్యరక్షణ
మిత్రపురుగులే ప్రకృతిసిద్ధంగా శతృపురుగులను అదుపులో ఉంచుతాయి. రసాయనాలు వాడకుండా బహుళ పంటలను సాగు చేస్తూ ఉంటే.. భూమి సారవంతమవుతూ చీడపీడలను నియంత్రించుకునే శక్తిని సంతరించుకుంటుంది. అయినా, చీడపీడలు అసలు లేకుండా పోవు. నష్టం కనిష్ట స్థాయిలో ఉంటుంది. మరీ అవసరమైతే, వేప ఉత్పత్తులు, నీటిలో కలిపిన దేశీ ఆవు మూత్రం వంటి ద్రావణాలు పిచికారీ చేస్తే చాలు. అసలు ఇది కూడా అవసరం రాదు అని భాస్కర్‌ సావే తన అనుభవాలు చెబుతారు. 

రసాయనిక సేద్యంలో పనులన్నీ తనే భుజాన వేసుకొని రైతు కుదేలైపోతూ ఉంటే.. ప్రకృతి సేద్యంలో ప్రకృతే చాలా పనులు తనంతట తాను చూసుకుంటుంది కాబట్టి రైతుకు సులభమవుతుంది. భూమి పునరుజ్జీవం పొందుతుంది అంటారు సావే సాధికార స్వరంతో!

చదవండి: 7 యేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఏం పండించాడో తెలుసా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top