Cuba: పట్టణ సేంద్రియ వ్యవసాయంతో వినూత్న పరిష్కారం..

Organoponicos: Cuban Organic Farming Revolution, Progress in Urban Agriculture  - Sakshi

క్యూబా.. నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు సంస్కృతికి ప్రపంచంలోనే అతి పెద్ద ఉదాహరణగా నిలిచింది. 70% క్యూబా ప్రజలు అర్బన్‌ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. దేశానికి కావాల్సిన ఆహారంలో 50% ఇప్పుడు సేంద్రియ ఇంటిపంటలే అందిస్తున్నాయి. స్థానిక సహజ వనరులతో ఆరోగ్యదాయకమైన పంటలు పండించుకుంటూ ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోగలమని క్యూబా ప్రజలు ప్రపంచానికి చాటుతున్నారు. 

సోవియట్‌ యూనియన్‌ పతనానికంటే ముందు వరకు క్యూబా.. పెట్రోల్, డీజిల్‌తోపాటు 60%పైగా ఆహారోత్పత్తుల్ని, రసాయనిక ఎరువులు, పురుగుమందులను సైతం ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటూండేది. పొగాకు, చక్కెర తదితరాలను ఎగుమతి చేస్తూ ఆహారోత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది. ఆ దశలో సోవియట్‌ పతనం(1990–91)తో కథ అడ్డం తిరిగింది. అమెరికా కఠిన ఆంక్షల నేపథ్యంలో సోషలిస్టు దేశమైన క్యూబా అనివార్యంగా ఆహారోత్పత్తిలో స్వావలంబన దిశగా అడుగేయాల్సి వచ్చింది. క్యూబా ఆకలితో అలమటించిన కష్టకాలం అది. 

ఈ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో క్యూబా సమాజం ఉద్యమ స్ఫూర్తిని చాటింది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ పొలాలుగా మారిపోయాయి. అర్బన్‌ ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లోనే సీరియస్‌గా సేంద్రియ ఇంటిపంటల సాగు చేపట్టారు. గ్రామీణ రైతులు కూడా పొలాల్లో ఎగుమతుల కోసం చెరకు, పొగాకు వంటి వాణిజ్య పంటల సాగు తగ్గించి ఆహార పంటల సాగు వైపు దృష్టి సారించారు. సగం కంటే తక్కువ రసాయనాలతోనే రెండు రెట్లు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసి వచ్చింది. డీజిల్‌ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పూర్తిగా ఎద్దులతోనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది. అటువంటి సంక్షోభం నుంచి ‘పట్టణ సేంద్రియ వ్యవసాయం’ వినూత్న పరిష్కారాన్ని ఆవిష్కరించింది.

నగర/పట్టణ ప్రాంతాల్లో స్థానిక సేంద్రియ వనరులతోనే జీవవైవిధ్య వ్యవసాయ సూత్రాల ఆధారంగా సేద్యం సాధ్యమేనని రుజువైంది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ క్షేత్రాలుగా మారాయి. అక్కడ వీటిని ‘ఆర్గానోపోనికోస్‌’ అని పిలుస్తున్నారు. ‘సమీకృత సస్య రక్షణ, పంటల మార్పిడి, కంపోస్టు తయారీ, భూసార పరిరక్షణ చర్యలు పెద్ద ఎత్తున అమలయ్యాయి. అడుగు ఎత్తున మడులను నిర్మించి, డ్రిప్‌తో పంటలు సాగు చేశారు. వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులతో పాటు 25% మట్టిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఈ ఎత్తు మడుల్లో పంటల సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా అమలు చేసిన పర్మాకల్చర్, వర్మికల్చర్‌ తదితర సాంకేతికతలనే ఇప్పుడు క్యూబా ఇతర దేశాలకు అందిస్తోంద’ని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ క్యూబా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ స్టీఫెన్‌ విల్కిన్సన్‌ చెప్పారు. 

1993లో క్యూబా వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రపంచంలోనే తొట్టతొలి పట్టణ వ్యవసాయ విభాగం ఏర్పాటైంది. నగరాలు, పట్ణణాల్లో పంటల సాగుకు ఆసక్తి చూపిన కుటుంబానికి లేదా చిన్న సమూహానికి ఎకరం పావు (0.5 హెక్టారు) చొప్పున ప్రభుత్వం స్థలం కేటాయించింది. వాళ్లు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకొని తింటూ.. మిగిలినవి ఇతరులకు అమ్ముతుంటారు. ఈ ప్లాట్లు కాకుండా.. నగరం మధ్యలో, పరిసరాల్లో 5–10 ఎకరాల విస్తీర్ణంలో డజన్ల కొద్దీ పెద్దస్థాయి సేంద్రియ క్షేత్రాలు (ఆర్గానోపోనికోలు) ఏర్పాటయ్యాయి. సహకార సంఘాలే వీటిని నిర్వహిస్తున్నాయి. 

బచ్చలి కూర, పాలకూర, టమాటాలు, మిరియాలు, గుమ్మడికాయలు, బత్తాయిలు, ఔషధ మొక్కలు, అనేక ఇతర పంటలను భారీ పరిమాణంలో పండించి తక్కువ ధరకు ప్రత్యేక దుకాణాల్లో సహకార సంఘాలు విక్రయిస్తూ ఉంటాయి. హవానా నగరంలో దేశాధినేత కార్యాలయానికి అతి దగ్గర్లోనే 3 హెక్టార్లలో ‘ఆర్గానోపోనికో ప్లాజా’ క్యూబా ఆహార సార్వభౌమత్వాన్ని చాటుతూ ఉంటుంది. 1995 నాటికే క్యూబా రాజధాని నగరం హవానాలో ఇలాంటి 25,000 సేంద్రియ తోటలు వెలిశాయి. 2020 నాటికి వీటి సంఖ్య 30 వేలకు చేరింది. ఆ విధంగా క్యూబా సమాజం తనపై విరుచుకుపడిన ఆంక్షలను, ఆకలిని అర్బన్‌ అగ్రికల్చర్‌ ద్వారా జయించింది. (క్లిక్ చేయండి:  అర్బన్‌ ఫుడ్‌ హీరో మజెదా బేగం!)

– పంతంగి రాంబాబు
prambabu.35@gmail.com

Election 2024

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top