ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు | Who Is Sharmistha Panoli, Know How This Influencer Arrested Over Her Social Media Post | Sakshi
Sakshi News home page

ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు

Jun 1 2025 4:23 PM | Updated on Jun 1 2025 5:30 PM

Who Is Sharmistha Panoli

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వీడియో పోస్టు చేసిన కేసులో 22ఏళ్ల  సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌,న్యాయ విద్యార్థిని శర్మిష్టా పనోలిని (Sharmistha Panoli) పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌ తిరస్కరించిన కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించడం, ప్రపంచంలోని పలు దేశాల్లోని ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంతో శర్మిష్టా పనోలి చర్చాంశనీయంగా మారారు. ఇంతకీ ఈ శర్మిష్టా పనోలి ఎవరు?     

శర్మిష్టా పనోలి ఎవరు?
శర్మిష్టా పనోలి పుణె న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా శర్మిష్టా రాణిస్తున్నారు. ఇన్‌స్టాలో 94,000 మందికిపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న న్యాయ విద్యార్థిని రాజకీయ, సామాజిక అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయడంలో పేరు సంపాదించారు.

వివాదాస్పద వీడియోలో ఏమన్నారంటే?
అయితే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై (2025 Pahalgam attack) ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ ఆపరేషన్‌ సిందూర్‌తో (Operation Sindoor) సైనిక చర్యకు దిగింది. పాక్‌ను చావు దెబ్బ కొట్టింది. ఇదే అంశంపై  ఓ పాక్‌ యూజర్.. శర్మిష్టాను పలు ప్రశ్నలు సంధించాడు. సదరు యూజర్‌ వేసిన ప్రశ్నలపై శర్మిష్ఠ పోనోలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి పలు అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడితో మౌనం​ వహించడంపై బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్ రణవీర్ అల్లాహ్‌బాదియాపై విమర్శలు గుప్పించారు. 

ఆ విమర్శలు మిస్‌ఫైర్‌ అయ్యాయి. శర్మిష్ట చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో శర్మిష్ట నెటిజన్లను క్షమాపణలు కోరారు. అనంతరం, ఆ వీడియోను డిలీట్‌ చేశారు. అయినప్పటికీ, కోల్‌కతా పోలీసులు శర్మిష్టాపై చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మతసామరస్యాన్ని దెబ్బతీయడం, సామాజిక కలహాలు సృష్టించేలా ప్రేరేపించడంపై కేసు నమోదు చేశారు.  

 1500 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీసులు 
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకుని అలిపూర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించించింది. జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీలోకి పంపింది. విచారణ సందర్భంగా శర్మిష్టా తరఫున న్యాయవాది, అన్ని డిజిటల్ ఆధారాలు ఇప్పటికే సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు. కోర్టు ఆ వాదనల్ని ఖండించింది. జ్యుడీషియల్ కస్టడీ విధించింది.   

 

మోదీజీ శర్మిష్టా పనోలిని రక్షించండి
శర్మిష్టా పనోలి అరెస్టుపై వివాదం రాజుకుంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి పలువురు విజ్ఞప్తులు పంపుతున్నారు. శర్మిష్టా పనోలి అరెస్టుపై డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్‌ వైల్డర్స్‌  ప్రధాని మోదీకి ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. కోల్‌కతా పోలీసుల తీరు వాక్‌ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది. ఆమెను రక్షించండి.ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్టను విడుదల చేసేలా ప్రధాని మోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రపంచంలో అందరి దృష్టి శర్మిష్టపైనే ఉందంటూ ఆమె ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement