
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో(భూమికి ఉద్యోగం) ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంతేకాదు.. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలన్న ఆయన అభ్యర్థననూ శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో విచారణ యధాతథంగా కొనసాగనుంది.
ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాని కోరుతూ లాలూ ప్రసాద్ ముందుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. విచారణపై స్టే విధించడానికి ఎలాంటి కారణలూ లేవని తెలిపింది. ఆపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఆయన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు ద్విససభ్య ధర్మాసనం తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో.. 2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భారతీయ రైల్వే తరఫున మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెస్ట్ సెంట్రల్ జోన్‌లో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ 2022లో అభియోగాలు నమోదు చేసింది. అక్రమంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు లాలూ, అతని కుటుంబ సభ్యులకు భూములు బహుమతిగా ఇచ్చారని సీబీఐ అభియోగాలు మోపింది.
ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్ వ్యవహారం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. లాలూ కుటుంబ సభ్యులకు చెందిన 25 చోట్ల సోదాలు జరిపింది. ఆ సమయంలో.. రూ.6 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది.అయితే.. రాజకీయ దురుద్ధేశ్యంతోనే తనపై దాదాపు దశాబ్దన్నర తర్వాత కేసు నమోదు చేశారని లాలూ అంటున్నారు.