ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను రూపుమాపి.. సమానత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో ఇటీవల నోటిఫై చేసిన విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనలు-2026 వివాదంలో చిక్కుకున్నాయి. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఎలా పెద్దదైంది? దీనిని కేంద్రం ఎలా సమర్థిస్తుందో చూద్దాం..
ఏమిటీ నిబంధనలు?
ప్రతి ఉన్నత విద్యా సంస్థలోనూ ‘సమానత్వ(ఈక్విటీ) కమిటీ’ల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది. కులం, మతం, లింగం, వికలాంగత, జాతి వంటి వివక్షలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ ప్రత్యేక సెల్‌లు పని చేస్తాయి. ఇంతకు ముందు.. 2012 నిబంధనలను రద్దు చేసి, మరింత విస్తృతమైన, కఠినమైన నియమాలు అమలు చేయబడతాయి. ఇందులో హెల్ప్‌లైన్లు, కఠినమైన బాధ్యతా ప్రమాణాలు వంటి నిబంధనలు ఉంటాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సమానత్వ చర్యలు, ఫిర్యాదు పరిష్కారాలపై UGCకి నివేదికలు సమర్పించాలి.
రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ(ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం) నిబంధనలు-2012 స్థానంలో కొత్త నిబంధనలను జనవరి 13వ తేదీ నుంచి అమలులోకి తెచ్చింది.
అభ్యంతరాలు దేనికి?
సమానత్వ కమిటీల ఏర్పాటు ఆదేశాలను వామపక్ష విద్యార్థి సంఘాలు సమర్థించాయి. అయితే కొత్త నిబంధనలలోని కులవివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై జనరల్, ఇతర కేటగిరీల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. కొంతమంది విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలు అనుకోకుండా కొత్త విభజనలకు దారితీయవచ్చని.. అలాగే దుర్వినియోగం జరగకుండా సరైన రక్షణలు లేవని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయానికి కూడా ఈ నిరసన సెగ తాకింది. దీనికి నిరసనగా పార్టీకి కొందరు బీజేపీ నేతలు, ఓ సీనియర్ బ్యూరోక్రాట్ రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.
సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ఏముంది?
మరోవైపు, రిజర్వుడు కేటగిరీల కిందకు రాని విద్యార్థులు, బోధనా సిబ్బందికి రక్షణ కల్పించే విషయాన్ని కొత్త నిబంధనల్లోని 3(సి) విస్మరించిందని పేర్కొంటూ వినీత్ జిందాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్సిటీలు సైతం దీనిని అదనపు బాధ్యతలుగా చూస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కమిటీ ప్రతినిధుల మధ్య విభేదాలు పెరిగే అవకాశంపై ఆందోళన పిటిషన్‌లో వ్యక్తం చేశారు.
తాత్కాలికంగా ఎందుకు నిలిపివేసింది?
బిల్లులోని కొన్ని నిబంధనలను సుప్రీం కోర్టు గురువారం తాత్కాలికంగా నిలిపివేసింది. దీని అమలుకు స్వేచ్ఛా, సమానత్వం, సమగ్రతతో కూడిన వాతావరణం అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
కేంద్రం ఏం చెబుతోంది?
కొత్త నిబంధనల వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎవరూ వేధింపులకు గురికారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు.UGC బిల్లు 2026 ప్రధానంగా ఉన్నత విద్యాసంస్థల్లో కుల ఆధారిత వివక్షతో పాటు ఇతర రకాల వివక్షను నివారించడానికి రూపొందించబడిందని అంటున్నారాయన. ఈ బిల్లు మార్జినలైజ్డ్ కమ్యూనిటీలకు రక్షణ కల్పించే చారిత్రాత్మక అడుగు అని మద్దతుదారులు అంటున్నారు. విద్యా నిపుణులు ఇది వ్యవస్థలోని అడ్డంకులను తొలగించి, సమానత్వాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.
మొత్తంగా.. ఈ బిల్లు మార్జినలైజ్డ్ కమ్యూనిటీలకు రక్షణ కల్పించడమే లక్ష్యం అయినప్పటికీ.. దాని అమలు విధానం, దుర్వినియోగం అవకాశాలు, కొత్త విభజనల భయం కారణంగా వివాదం చెలరేగింది.


