దుబాయ్‌లో జరిమానాలపై కొత్త చట్టానికి ఆమోదం | dubai ruler approves new law on violations and fines | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో జరిమానాలపై కొత్త చట్టానికి ఆమోదం

Mar 13 2026 11:29 PM | Updated on Mar 13 2026 11:37 PM

dubai ruler approves new law on violations and fines

దుబాయ్‌లో ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు వర్తించే ఉల్లంఘనలు, జరిమానాలపై కొత్త చట్టానికి దుబాయ్ పాలకుడు, యూఏఈ  ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదం తెలిపారు. పారదర్శకత, న్యాయాన్ని పెంపొందించే ఉద్దేశంతో 2026 సంవత్సరానికి సంబంధించి చట్టం నెం.6ను ప్రకటించారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే విధానంపై మరింత స్పష్టత తీసుకొచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు.

ఈ చట్టం ప్రధానంగా ప్రభుత్వ స్థాయిలో జరిగే ఉల్లంఘనలకు స్పష్టమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటుచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అధికార దుర్వినియోగాన్ని నిరోధించడం, చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కూడా దీని ఉద్దేశంగా ఉంది. ఉల్లంఘనలను వాటి తీవ్రత ఆధారంగా చిన్న, మధ్యస్థ, తీవ్రమైనవిగా వర్గీకరించి, ప్రతి ఉల్లంఘనకు తగిన శిక్షను విధించేలా నిబంధనలు రూపొందించారు.

చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులు లేదా సంస్థలపై అధికారులు పలు రకాల చర్యలు తీసుకోవచ్చు. జరిమానా విధించే ముందు లేదా తరువాత పరిస్థితిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేయవచ్చు. అవసరమైతే సంస్థలను ఆరు నెలల వరకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేయవచ్చు. అలాగే వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చిన లైసెన్సులు, అనుమతులను రద్దు చేయడం లేదా సవరించడం కూడా చేయవచ్చు. ఉల్లంఘనలకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా కార్యకలాపాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసే అధికారాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తోంది.

ఇక చర్యల ప్రక్రియలో పారదర్శకతను తప్పనిసరి చేశారు. ప్రతి ఉల్లంఘనను స్పష్టంగా నిర్వచించాల్సి ఉంటుంది. జరిమానాలు లేదా శిక్షలు నిర్ణయించే సమయంలో ఉల్లంఘన తీవ్రత, అది పునరావృతమైందా లేదా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

క్రమశిక్షణా చర్యలను ప్రకటించే ముందు సంబంధిత ప్రభుత్వ సంస్థల అధిపతుల అనుమతి తప్పనిసరి. అదేవిధంగా సమాచారం విడుదలలో దుబాయ్‌ మీడియా ఆఫీస్‌తో సమన్వయం చేయాలని కూడా నిబంధనలు పేర్కొంటున్నాయి.

శాంతి భద్రతను కాపాడుతూ చట్టబద్ధమైన పాలనను మరింత బలోపేతం చేయడమే ఈ కొత్త ఉత్తర్వుల ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీనికి విరుద్ధంగా ఉన్న పాత చట్టాలు రద్దయినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement