అది హ్యాకింగే! | It has been confirmed that Dharani portal was hacked in challan scam | Sakshi
Sakshi News home page

అది హ్యాకింగే!

Feb 1 2026 3:24 AM | Updated on Feb 1 2026 3:24 AM

It has been confirmed that Dharani portal was hacked in challan scam

చలాన్ల కుంభకోణంలో ధరణి పోర్టల్‌ హ్యాక్‌ అయిందని నిర్ధారణ

మొత్తం పోర్టల్‌ కాకుండా చలాన్‌ ప్రాసెసింగ్‌ కోడ్‌ హ్యాక్‌ చేసిన అక్రమార్కులు 

కోడింగ్‌ ఆడిట్‌ చేయకపోవడంతో ప్రభుత్వ సొమ్ము స్వాహా 

ఇప్పుడు భూభారతిలో మూడు రకాల ఆడిటింగ్‌.. త్వరలోనే పూర్తి 

మార్చిలోపే సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు ఏకతాటి పైకి..

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో చలాన్ల ఆడిటింగ్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ధరణి పోర్టల్‌ను హ్యాక్‌ చేయడం ద్వారానే అక్రమార్కులు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని సాంకేతిక ఆధారాలతో సహా నిర్ధారణ అయినట్టు సమాచారం. అయితే, పోర్టల్‌ మొత్తం కాకుండా కేవలం చలాన్‌ ప్రాసెసింగ్‌ కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ను మాత్రమే అక్రమార్కులు హ్యాక్‌ చేశారని వెల్లడైంది. ఈ కోడ్‌ను హ్యాక్‌ చేసిన తర్వాత వెయ్యి కంటే ఎక్కువ సార్లు చలాన్లను ఆడిట్‌ చేసి రూ.3.7 కోట్లు కొల్లగొట్టారని తేలింది. భూభారతి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ హ్యాకింగ్‌ కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న భూభారతి పోర్టల్‌ను రక్షించే పనిలో రెవెన్యూ వ్యవస్థ నిమగ్నమైంది.  

మూడు రకాలుగా ఆడిటింగ్‌ 
ధరణి పోర్టల్‌లో పొందుపర్చిన సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లను ఆడిట్‌ చేయని కారణంగా ఇదంతా జరిగిందనే అభిప్రాయానికి రెవెన్యూ శాఖ వచ్చింది. కోడ్‌ హ్యాకింగ్‌ జరిగిందని తేలిన వెంటనే ఆ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ చొరవ తీసుకుని భూభారతి పోర్టల్‌కు పటిష్ట రక్షణ వ్యవస్థ (ఫైర్‌ వాల్స్‌) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భూభారతి పోర్టల్‌లో మూడు రకాల ఆడిటింగ్‌లు చేస్తున్నట్టు సమాచారం. సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లను ఆడిటింగ్‌ చేయడంతోపాటు పోర్టల్‌ సెక్యూరిటీని కూడా ఆడిటింగ్‌ చేస్తున్నారని, దీంతోపాటు హ్యాకింగ్‌కు వీల్లేకుండా సైబర్‌ సెక్యూరిటీ ఆడిటింగ్‌ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు ఆడిటింగ్‌ల ద్వారా భవిష్యత్తులో పోర్టల్‌ హ్యాకింగ్‌కు అవకాశం లేకుండా చేస్తున్నామని రెవెన్యూ వర్గాలంటున్నాయి. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఆధ్వర్యంలో ఈ ఆడిటింగ్‌ ప్రక్రియ జరుగుతోందని, త్వరలోనే పూర్తవుతుందని చెబుతున్నాయి.  

అది పూర్తయితేనే... 
ఈ ఆడిటింగ్‌ పూర్తయిన తర్వాతే రెవెన్యూ సేవల ఏకీకృత పోర్టల్‌ అమల్లోకి రానుంది. వాస్తవానికి, సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగాలను ఒకేతాటిపైకి తెచ్చేలా సింగిల్‌ పోర్టల్‌ను ఈ ఏడాది జనవరి 26 నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావించింది. కానీ, అనుకోకుండా చలాన్ల కుంభకోణం వెలుగులోకి రావడం.. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక కూడా రావడంతో కొంత జాప్యం జరిగింది. ఎలాగూ ఆలస్యమైన నేపథ్యంలో భూభారతి పోర్టల్‌ను సురక్షితంగా మార్చిన తర్వాతే సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో ఆడిటింగ్‌ పూర్తయి చేసి మార్చి నెలాఖరులోపు పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలా రెవెన్యూ శాఖ భూభారతి పోర్టల్‌లో మూడు రకాల ఆడిటింగ్‌లు చేస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement