జస్టిస్ భూయాన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు, కొలీజియం నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనకర పరిణామం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగకరమన్నారు. ‘‘ఇటీవల జస్టిస్ అతుల్ శ్రీధరన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ విన్నపం మేరకే జరిగిందని నాటి ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
న్యాయ వ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం) ప్రభావం ఉందని దీంతో స్పష్టమవుతోంది’’ అని జస్టిస్ భూయాన్ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించేలా ఉత్తర్వులను ఇచి్చనంతమాత్రానే హైకోర్టు జడ్జిని బదిలీ చేస్తారా? ఇవి న్యాయవ్యవస్థ స్వతంత్రతకే గొడ్డలి పెట్టు కాదా? కొలీజియం విధానం సమగ్రతను ఇవి దెబ్బ తీసినట్లు కాదా? హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో ప్రభుత్వానికి ఎటువంటి పాత్రా ఉండరాదు’’ అని కుండబద్దలు కొట్టారు.


