
రోజూ పొద్దునే లేస్తాడు. ఆకలైతే తింటాడు. వ్యవసాయం తన వృత్తి. ఇంటి ముందే కొన్ని పండ్లు, కూరగాయల మొక్కలను పెంచుకుంటుంటాడు. మనుషులెవ్వరితోనూ మాట్లాడడు. మూగజీవాలు, పక్షులే అతని ఫ్రెండ్స్. కాలక్షేపం కోసం ఇంటి పనులు, మరమ్మతులు, నీటి గుంటలు తవ్వటం వంటివి చేస్తాడు. అన్ని పనులూ పూర్తి చేసుకున్నాక అలసట వస్తే, స్వయంగా నిర్మించుకున్న తన తాటాకుల గుడిసెలో సేద తీరుతాడు.
అతన్ని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా, ప్రతిసారి పెద్ద యుద్ధమే చేసి, విజయం సాధించాడు. అడగకుండా ఎన్ని ఇచ్చినా పుచ్చుకోకుండా, చేయి చాచని మహారాజులా నిలబడేవాడు. ఆఖరుకు ఎక్కడికైనా చేరగల ఇంటర్నెట్ కూడా అతని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అతన్ని మచ్చిక చేసుకోలేక పోయాయి. ఇలా హాయిగా తన పని తాను చేసుకునేవాడు.
ఇంతే! ఇదే తన జీవితం. ఎంతో అందమైన, ప్రశాంతమైన జీవితం. ఇలా అందరూ బతకలేరు. ఎవరికీ సాధ్యం కాని పనికూడా! అయినప్పటికీ అతను ఈ సూపర్ సింగిల్ లైఫ్‌ని గత మూడు దశాబ్దాలుగా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ అతనెవ్వరో కాదు, 1996లో తొలిసారి అమెజాన్ అటవీ అధికారులు గుర్తించిన ఒంటరి గిరిజనుడు. అతని తెగ మొత్తం అంతరించిపోయినా, అతను మాత్రం ఒక్కడే అడవిలో జీవిస్తున్నాడని తెలిసింది.
ఎన్నో ప్రయత్నాల అనంతరం అతన్ని 2018లో కెమెరాలో రహస్యంగా వీడియో తీసి, వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ మధ్యనే అధికారులకు అతని శరీరం గుడిసెలో కనిపించింది. నిద్రలో ప్రశాంతంగా మరణించాడు. ఇరవై ఆరేళ్లపాటు ఎవ్వరితోనూ మాట్లాడకుండా, కలవకుండా, ఒంటరిగా మహారాజులా బతికి, అంతే రాజసంగా లోకం నుంచి నిష్క్రమించాడు.