అఫేసియా
ఒక వ్యక్తికి పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చింది. చికిత్స తర్వాత ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యులనూ గుర్తుపడుతున్నాడు. వారు చెప్పేది అర్థం చేసుకుంటున్నట్టూ కనిపిస్తున్నాడు. కానీ కొన్ని మాటలను పలకలేకపోతున్నాడు. ఒక్కోసారి మాట్లాడాలనుకున్నా మాట బయటకు రావడం లేదు.
కొన్నిసార్లు భార్యాపిల్లలను పిలవాలనుకుంటున్నా... నోరు కదపలేకపోతున్నాడు. ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే సంబంధం లేని పదాలు వస్తున్నాయి. ఇలా భాషలోని పలుకులను పలకలేని కండిషన్‌ను ‘అఫేసియా’ అంటారు. నేడు స్ట్రోక్ డే సందర్భంగా ఇలా మాట సరిగా రాని ‘అఫేసియా’ కండిషన్‌పై అవగాహన కోసం ఇస్తున్న కథనం.
కొందరిలో పక్షవాతం తర్వాత మాట గొంతుకలోనే ఆగిపోయి ఎంతకీ బయటకు రాకపోతే... ఆ నరకాన్ని వర్ణించడం కష్టమే. అందునా నిన్నామొన్నటివరకూ హాయిగా మాట్లాడిన వ్యక్తికి అకస్మాత్తుగా మాట రాకపోతే చాలా ఇబ్బందిగానే కాదు... నిరాశ, నిస్పృహలు కూడా ఉండవచ్చు. మరికొందరు డిప్రెషన్‌లోకీ వెళ్లిపోవచ్చు. ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ముందుగా అఫేషియా అంటే ఏమిటో తెలుసుకోవాలి.
అఫేసియా అంటే ఏమిటి?
మన మెదడులో భాషను అర్థం చేసుకోవడానికి, మాటల రూపంలో వ్యక్తీకరించడానికి... సాధారణంగా మెదడులోని ఎడమ అర్ధగోళంలో భాషా కేంద్రాలు (లాంగ్వేజ్ సెంటర్స్) ఉంటాయి. కుడిచేతి వాటం ఉన్నవారిలో ఈ భాషాకేంద్రం ఎడమవైపు ఉన్నప్పటికీ 4–6 శాతం వ్యక్తుల్లో ఈ సెంటర్ కుడివైపే ఉండవచ్చు. ఇక ఎడమచేతి వాటం ఉన్న 27 శాతం మంది వ్యక్తుల్లో ఈ సెంటర్ మెదడు కుడి భాగంలో ఉంటుంది. ఈ ప్రాంతాలకు స్ట్రోక్‌వల్ల రక్తప్రసరణ దెబ్బతిని భాషా సామర్థ్యాలు ప్రభావితమైతే ‘అఫేసియా’ రావచ్చు.
‘అఫేసియా’ ఉన్న వ్యక్తిలో కనిపించే సమస్యల్లో ఇవి కొన్ని..
→ మాట్లాడాలనుకున్న పదం గుర్తుకు రాకపోవడం.
→ ఎదుటివారు చెప్పే మాటలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది.
→ వాక్యాలను సరిగ్గా నిర్మించలేకపోవడం.
→ చదవడం లేదా రాయడంలో ఇబ్బంది.
→ చెప్పాలనుకున్నది ఒకటైతే, నోటి నుంచి మరో పదం రావడం.
అఫేసియా, మాట ముద్దగా రావడం ఒకటేనా?
కాదు. అవి రెండూ వేర్వేరు. స్ట్రోక్ వచ్చిన కొందరిలో మాట ముద్దముద్దగా రావచ్చు. ఆ తేడాలేమిటో చూద్దాం.
అఫేసియా: భాషను అర్థం చేసుకోవడం లేదా పదాల ద్వారా భావాలను వ్యక్తీకరించడంలో ఇబ్బంది.
డిసార్థ్రియా: మాట్లాడటానికి అవసరమైన కండరాల నియంత్రణ దెబ్బతినడం వల్ల మాట స్పష్టంగా పలకలేకపోవడం.
అ్రపాక్సియా ఆఫ్ స్పీచ్ : మాట్లాడటానికి అవసరమైన కండరాల కదలికలను మెదడు సరిగ్గా నియంత్రించలేకపోవడం.
ఈ మూడూ వేర్వేరు సమస్యలు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ సమస్యలూ ఉండవచ్చు.
ఎదురయ్యే సమస్యలివి..
ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చిన తర్వాత మాటలు సరిగ్గా రాకపోతే, ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోవచ్చు.
→ తన అవసరాలను ఇతరులకు చెప్పలేకపోవడం.
→ కుటుంబ సభ్యులతో సంభాషణ తగ్గిపోవడం.
→ స్నేహితులను కలవడానికి ఇష్టపడకపోవడం.
→ ఇతరులు తనను అర్థం చేసుకోవడం లేదనే బాధ.
→ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం. → ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు.
ఇలా చూసినప్పుడు ‘అఫేసియా’ వల్ల పేషెంట్ తాలూకు సామాజిక సంబంధాలు, స్వతంత్రంగా జీవించే సామర్థ్యం, మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతాయి.
కొన్ని రకాల మందులతోనూ చికిత్స: అఫేసియా బాధితులకు న్యూరోఫిజీషియన్లు కొన్ని రకాల మందులతోనూ చికిత్స అందిస్తారు. ఉదాహరణకు వారికి డోనోపెజిల్, మెమాంటిన్, పైరాసెటామ్ వంటి మందులతో చికిత్స అందించి, మాట మెరుగయ్యేందుకు స్పీచ్ థెరపీని సూచిస్తారు.
స్పీచ్ థెరపీ తర్వాత మాటలు మళ్లీ వస్తాయా?
అఫేసియా వచ్చిన వ్యక్తికి మళ్లీ మాట్లాడే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే ఎంతవరకు మెరుగుదల వస్తుందనేది మెదడుకు జరిగిన నష్టం, అఫేషియా తీవ్రత, చికిత్స మొదలుపెట్టిన సమయం, పేషెంట్ వ్యక్తిగత ఆరోగ్యం, థెరపీలో పాల్గొనే తీరు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కొంతమందికి మొదటి కొద్దివారాల్లోనే మెరుగుదల కనిపించవచ్చు. మరికొందరికి నెలల తరబడి సాధన అవసరమవుతుంది. కొందరిలో కొన్ని భాషా సమస్యలు చాలాకాలం పాటు కొనసాగవచ్చు. స్ట్రోక్ వచ్చి నెలలు గడిచిపోయాయని ఇక మాటలు రావనే నిర్ణయానికి రావడం సరికాదు. ఆలస్యమైన దశలో కూడా తగిన చికిత్సతో కొందరిలో మెరుగుదల సాధ్యమే. అందుకే ఏ దశలోనూ నిరాశ పడకూడదు.
స్పీచ్ థెరపిస్టు ఏం చేస్తారంటే...
స్పీచ్ థెరపిస్టును కేవలం మాటలు పలికించేందుకు అవసరమైన వ్యాయామాలు చేయించే వ్యక్తిగా చూడకూడదు. స్ట్రోక్ తర్వాత భాషను అర్థం చేసుకోవడం, మాట్లాడటం,చదవడం, రాయడం, రోజువారీ అవసరాలను ఇతరులకు తెలియజేయడానికి అవసరమైన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తారు.
కుటుంబ సభ్యులెలా మాట్లాడాలి?
స్ట్రోక్ వల్ల మాటలు రాని బాధితుడికి థెరపిస్టు అందించే సహాయం నిజానికి చాలా పరిమితం అని చెప్పవచ్చు. అయితే థెరపిస్టు రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ఇంట్లో మిగతా సమయమంతా కుటుంబ సభ్యులు బాధితులతో సంభాషణ కొనసాగించడం, అభ్యాసం చేయించడం చాలా ముఖ్యం.
2026లో ప్రచురితమైన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ , అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ మార్గదర్శకాలు కూడా భాషా సామర్థ్యాన్ని అంచనా వేసేటప్పుడు బాధితుడి భాషా నేపథ్యం, గతంలో ఉపయోగించిన భాషలు, రోజువారీ భాషా వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని
సూచిస్తున్నాయి.
డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి
సీనియర్ న్యూరో ఫిజీషియన్
– యాసీన్


