మానవ పరిణామ శిఖరం | Sanatana Dharma teaches that human life grows through three sacred powers | Sakshi
Sakshi News home page

మానవ పరిణామ శిఖరం

Aug 17 2026 12:32 AM | Updated on Aug 17 2026 12:32 AM

Sanatana Dharma teaches that human life grows through three sacred powers

మంచిమాట

మానవ ఉనికి ఐదు అడుగుల భౌతిక పరిధులకే పరిమితం కాదు; అది అనంత విశ్వ చైతన్యానికి ఒక ప్రతిరూపం. సనాతన ధర్మం మానవ పరిణామాన్ని జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆత్మశక్తి అనే మూడు మూలస్తంభాల మీద దర్శిస్తుంది. ఇవి కేవలం తాత్విక పదాలు కావు; జీవన గమ్యాన్ని శాసించే త్రివేణీ సంగమాలు. మానవ దేహం ఒక రథమైతే, ఆత్మశక్తి దానికి ప్రాణం పోసే వాత్సల్య సారథి, జ్ఞానశక్తి మార్గం చూపే చైతన్య దివిటీ, క్రియాశక్తి గమ్యం వైపు నడిపే అకుంఠిత దీక్ష. ఈ మూడు శక్తులు సమన్వయమైనప్పుడే మనిషి ‘మనీషి’గా రూపాంతరం చెందుతాడు.

జ్ఞానశక్తి: అంతరంగ ప్రకాశం
చీకటిలో దారి వెతకడం కాదు, తానే వెలుగై పదిమందికి మార్గం చూపడమే అసలైన జ్ఞానం. సమాచార ప్రవాహం వెల్లువలా ముంచెత్తుతున్న నేటి కాలంలో, ‘విజ్ఞానానికి’ ‘ప్రజ్ఞకు’ మధ్య ఉన్న తేడాను గుర్తించడం ప్రాథమిక అవసరం. పుస్తకాల్లో దొరికేది అక్షర జ్ఞానమైతే, అనుభవంలో వికసించేది ఆత్మజ్ఞానం. ఏది శాశ్వతం? ఏది క్షణికం? అనే వివేచన లేని మేధస్సు చుక్కాని లేని నావ వంటిది.

వేల మైళ్ల వేగం ఉన్నా, సరైన దిశ లేని ప్రయాణం గమ్యాన్ని చేరలేదు. తర్కానికి అందని పరమార్థాన్ని స్పృశించడమే వివేకం. ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవడమే మేధస్సుకు అసలైన అలంకారం. బాహ్య ప్రపంచపు హోరును కాదని, అంతరాత్మ పలికే మౌన సందేశాన్ని వినడమే నేటి యువత నేర్చుకోవాల్సిన ప్రథమ పాఠం. జ్ఞానం ఒక భారంగా కాక, ఎదుగుదలకు ఒక వరంగా మారినప్పుడే వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది.

క్రియాశక్తి: రగిలే కార్యాచరణం
సంకల్పాన్ని సాకారం చేసే సృజనాత్మక చైతన్యమే క్రియాశక్తి. ఆలోచన ఆకాశమైతే, ఆచరణ ఈ పుడమి. మేఘం వర్షమై కురిసినప్పుడే నేల పులకించి ప్రాణం పోసుకుంటుంది. శిల్పి మనసులో ప్రతిమ ఉన్నంత మాత్రాన శిల దైవం కాదు; ఆ శిల్పి చేతిలోని ఉలి దెబ్బల శ్రమ, చెమట చుక్క తోడైనప్పుడే అది పూజలందుకుంటుంది.

నిద్రాణమైన విజ్ఞానం వెలుగు ఇవ్వని దీపం వంటిది; నిరంతర ఆచరణే దానికి ప్రాణప్రతిష్ఠ. ఫలితంపై ఆశ వదిలి, చేసే ప్రతి పనిలో పరమాత్మను దర్శించడమే కర్మయోగం. నైపుణ్యం, అంకితభావమే సమాజానికి ఒక వ్యక్తి ఇచ్చే గొప్ప కానుక. కుంటి సాకులు పక్కన పెట్టి, లక్ష్యం వైపు ప్రేమతో అడుగు వేయాలి. లక్ష్యం లేని శ్రమ గానుగెద్దు పయనం; 

ఆత్మశక్తి: అజేయమైన స్థైర్యం
విజయం వస్తే వినమ్రతతో స్వీకరించడం, అపజయాలను ధైర్యంతో ఎదుర్కోవడం... ఈ స్థితప్రజ్ఞత పేరే ఆత్మశక్తి. ఇది కేవలం ఆత్మవిశ్వాసం కాదు, అంతర్గత దివ్యత్వం. సముద్రపు ఉపరితలంపై అలలు అల్లకల్లోలం సృష్టించినా, లోతుల్లో సముద్రం నిశ్చలంగా ఉన్నట్లు... బయట ఎన్ని తుపానులు చుట్టుముట్టినా చెదరని చిరునవ్వే మనిషి అసలైన బలం.

పునాది లేని కోట ఎంత ఎత్తున్నా ఒక్క గాలివానకే కుప్పకూలుతుంది; ఆత్మశక్తి లేని వ్యక్తిత్వం అద్దాల భవంతి వంటిది. నేటి పోటీ ప్రపంచంలో విరిగిపోకుండా నిలబడటమే మానవుడు సాధించే విజయం. ఆత్మబలం ఉన్నవాడికి ఆకాశమే హద్దు; సంక్షోభ సముద్రాన్ని సునాయాసంగా దాటించే నావ ఆత్మస్థైర్యమే. పరిమితులను అధిగమించి ముందుకు నడిపించే ఈ శక్తే మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుతుంది.

సమగ్ర జీవనం: చరితార్థమైన ప్రయాణం
జ్ఞానం లేని క్రియ అంధకారం; క్రియ లేని జ్ఞానం వ్యర్థం; ఆత్మబలం లేని బతుకు నిర్జీవం. ఈ మూడు శక్తులు త్రివేణీ సంగమమై, లోక కల్యాణం కోసం కదిలినప్పుడే మానవ జన్మ ధన్యమవుతుంది. స్వార్థపు గిరిగీసుకుని బతకడం సంకుచితత్వం; లోక శ్రేయస్సు కోసం ఈ శక్తిత్రయాన్ని ధారపోయడం మాధవత్వం.

విజయం వ్యక్తిగతమైనది కాకూడదు, అది పదిమంది ముఖాల్లో చిరునవ్వు నింపాలి. చీకటిని తిట్టడం కన్నా తనలో ఉన్న చిన్న దీపాన్ని వెలిగించడం మిన్న. అంతరంగాన ఉన్న దివ్యత్వాన్ని ప్రేమతో మేల్కొలపాలి. భారతీయతను విశ్వవ్యాప్తం చేస్తూ, సనాతన విలువల వెలుగులో ఈ జగత్తును పునీతం చేద్దాం. సృష్టిలో ప్రతి అణువు ఒక గొప్ప మార్పు కోసం నిరీక్షిస్తోంది; ఆశయమే ఆయుధంగా, ఆత్మీయతే మార్గంగా ముందడుగు వేద్దాం!

– కె. భాస్కర్‌ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement