సేంద్రియం సైసై.. వైరస్‌ బైబై..!

Know more about papaya ringspot virus - Sakshi

వైరస్, పిండినల్లిని అవలీలగా జయింవచ్చు

ఎకరానికి 50 టన్నుల దిగుబడి ఖాయం

ఏకలవ్య కేవీకేలో ప్రయోగాత్మక సేంద్రియ బొప్పాయి సాగు సఫలం

బొప్పాయి.. బొప్పాయి పంట అనగానే వైరస్‌ తెగులు గుర్తొస్తుంది. వైరస్‌ ఒక్కసారి తోటలో కనిపించిందంటే ఇక ఆ తోటపై ఆశలు వదులుకోవల్సిందే అన్న బెంగతో రైతులు వణకిపోతూ ఉంటారు. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడే బొప్పాయి తోటల్లోనే వైరస్‌ పంటకు మరణశాసనంగా మారుతోందని, పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాటిస్తే వైరస్‌ అసలు సమస్యే కాదని డా. జి. శ్యామసుందర్‌ రెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. మెదక్‌ జిల్లా తునికిలోని ‘డా. రామానాయుడు – ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)’ లో ఆయన  సేంద్రియ బొప్పాయి తోటను ప్రయోగాత్మకంగా సాగు చేసి ఎకరానికి 50 టన్నుల దిగుబడి తీశారు. ఆ విశేషాలు...

‘రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడే తోటలో నేల సారాన్ని కోల్పోయి బలహీనమవుతుంది. అప్పుడే పంటకు వైరస్‌ సోకుతుంది. విజృంభించి దిగుబడిని దారుణంగా దెబ్బతీస్తుంది. మట్టిని ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో బలోపేతం చేస్తే, వైరస్‌ తెగులును తట్టుకునే శక్తి పంటకు ప్రకృతిసిద్ధంగానే మట్టి ద్వారా వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మట్టి ఆరోగ్యమే మొక్క ఆరోగ్యం, మొక్క ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం..’ అంటున్నారు డాక్టర్‌ గున్నంరెడ్డి శ్యాంసుందరరెడ్డి. మెదక్‌ జిల్లా తునికిలోని ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం అధిపతిగా ఉన్న ఆయన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి రెడ్‌లేడీ బొప్పాయిని 9 నెలలుగా సాగు చేస్తున్నారు.

రింగ్‌ స్పాట్‌ వైరస్‌ నాటిన 6 నెలల తర్వాత ఒక మొక్కకు వచ్చింది. నెలలు గడిచినా మరో 3 మొక్కలకు మాత్రమే సోకింది తప్ప తోట మొత్తానికీ పాకలేదు. పిండినల్లి సోకితే కషాయాలు, పుల్లమజ్జిగ పిచికారీ చేస్తే పోయిందన్నారు. సేంద్రియ పద్ధతులను పూర్తిగా పాటిస్తే తోటకు ఒకవేళ వైరస్, పిండినల్లి సోకినా తీవ్రత అంతగా ఉండదని, పంట ఎదుగుదలకు, అధిక దిగుబడులకు ఆటంకం కాబోవని రూఢిగా చెబుతున్నారు. ఈ తోటలో చెట్టుకు 60 కాయల వరకు వచ్చాయి. ఒక్కోటి కిలో నుంచి 3 కిలోలు ఉన్నాయి. కోత ప్రారంభమైంది. కనీసం 50 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కిలో రూ. 40 చొప్పున విక్రయిస్తున్నామని డా. శ్యాంసుందరరెడ్డి తెలిపారు.

రింగ్‌ స్పాట్‌ వైరసే ఎక్కువ
బొప్పాయి మొక్కల్ని ఆశించే వైరస్‌ తెగుళ్లు మూడు రకాలు:
1. రింగ్‌ స్పాట్‌ వైరస్‌: ఇది చాలా ఎక్కువ తోటల్లో కనిపిస్తుంది. మొక్కలు నాటిన రెండు నెలల నుంచి తర్వాత ఎప్పుడైనా ఈ వైరస్‌ సోకవచ్చు. ఆకు తొడిమె మీద నూనె లాంటి మరకలు ఉంటాయి. కాయలు, పిందెలపై వలయాకారపు నూనెలాంటి మచ్చలు వస్తాయి.
2. లీఫ్‌ కర్ల్‌ వైరస్‌: ఆకులు ముడుచుకుపోతాయి.
3. మొజాయిక్‌ వైరస్‌: ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులపై పసుపు, పచ్చ, తెలుపు మచ్చలు చుక్కలు చుక్కలుగా కనిపిస్తాయి. ఆకు ముడుచుకుపోదు కానీ సైజు తగ్గుతుంది.

సేంద్రియ సాగులో 6 సూత్రాలు
సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో బొప్పాయి సాగు చేసే క్రమంలో తాము 6 సూత్రాలు పాటించామని డా. శ్యాంసుందరరెడ్డి అన్నారు. రైతులు వీటిని తూ.చ. తప్పకుండా పాటిస్తే వైరస్, తదితర చీడపీడల బెడద లేకుండా నిస్సందేహంగా అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఆరు సూత్రాలు : 1. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు పూర్తిగా ఆపెయ్యాలి. 2. చివికిన పశువుల ఎరువు వాడాలి. 3. మొక్కల చుట్టూ మట్టి ఎగదోయాలి. 4. సేంద్రియ వ్యర్థాలతో ఆచ్ఛాదన చేయాలి. 5. డ్రిప్‌నకు బదులు మైక్రోస్ప్రింక్లర్లతో నీటి తడులివ్వాలి. జీవామృతం, పంచగవ్య, పుల్ల మజ్జిగ వాడాలి. 6. చీడపీడల యాజమాన్య మెలకువలు పాటించాలి.

మొక్కల చుట్టూ మట్టి ఎగదోయడం
బొప్పాయి మొక్కలు నాటిన తర్వాత 7వ నెలలో మొక్కలకు ఇరువైపులా 2 అడుగుల దూరం వరకు 2 అంగుళాల మందాన పశువుల ఎరువు వేశారు. 2 అడుగుల అవతల అడుగు–అడుగున్నర వెడల్పుతో అడుగు లోతున గాడి తీశారు. తీసిన మట్టిని మొక్కల వరుసలో బెడ్‌లా వేశారు.

ద్రవజీవామృతంతోపాటు డబ్లు్య.డి.సి.
బొప్పాయి మొక్కలకు ద్రవజీవామృతం ఇచ్చిన పది రోజులకు వేస్ట్‌ డీ కంపోజర్‌ (డబ్లు్య.డి.సి.) ద్రావణాన్ని మార్చి మార్చి ఇదొకసారి అదొకసారి ఇస్తున్నారు. తొలి దశలో పాదుల్లో పోశారు. మొక్కలు పెరిగిన తర్వాత మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా భూమికి ఇస్తున్నారు. పూత దశలో 15 రోజలకోసారి పంచగవ్య పిచికారీ చేశారు.

పిండినల్లి పరారీ
వైరస్‌ తర్వాత బొప్పాయి మొక్కల్ని పీడించే మరో సమస్య పిండినల్లి. మొక్కలు నాటిన రెండో వారం నుంచే పిండినల్లి సోకింది. పంచగవ్య పిచికారీతో తొలిదశలో అదుపులోకి వచ్చింది. మొక్కలు నాటిన తర్వాత 6వ నెలలో ఎడతెరపి లేకుండా 2 నెలల పాటు వర్షాలు కురిశాయి. పంచగవ్య పిచికారీ చేసినా వర్షం వల్ల ప్రభావం చూపలేకపోయింది. అప్పుడు లొట్టపీసు కషాయం, గంజిద్రావణం, పుల్లటి మజ్జిగ 5 రోజుల వ్యవధిలో ఒక్కోసారి పిచికారీ చేస్తే పిండినల్లి పత్తాలేకుండా పోయిందని డా. శ్యాంసుందరరెడ్డి తెలిపారు.

10 లీటర్ల నీటిలో ఒక కిలో చొప్పున లొట్టపీసు (తూటి) మొక్క ఆకులు వేసి పొయ్యిమీద పెట్టి 3 పొంగులు వచ్చే వరకు మరిగించి, దించి, చల్లారిన తర్వాత (నీరు కలపకుండా) పిచికారీ చేశారు. మొక్కలు, కాయలు, పందెలు పూర్తిగా తడిసి ముద్దయ్యేలా పిచికారీ చేశారు. 5 రోజుల తర్వాత లీటరు నీటికి 100 గ్రాముల చొప్పున వేసి గంజి ద్రావణం కాచి, చల్లారిన తర్వాత పిచికారీ చేశారు. మరో 5 రోజులకు బాగా పుల్లటి మజ్జిగ పిచికారీ చేశారు. లీటరు పెరుగుకు 9 లీటర్ల నీటిని కలిపి మజ్జిగ చేసి 5 రోజులు పులియబెట్టి పిచికారీ చేశారు. ఈ మూడు పిచికారీలతో పిండినల్లి పత్తాలేకుండా పోయింది. 3 నెలలు గడచినా మళ్లీ కనిపించలేదు. బూడిద తెగులు కూడా రాలేదు.
 
పిండినల్లి

నేలను సుసంపన్నం చేయాలి
నేలను సుసంపన్నం చేసినప్పుడే బొప్పాయి మొక్కలు వైరస్‌ సహా చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి. మొక్కకు కావలసిన శక్తిని, బలాన్ని ఇచ్చేలా మట్టిని బలోపేతం చేయడం సహజ పద్ధతుల ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాలి. రసాయనాలు వేస్తే నేలలో స్వతహాగా ఉండే శక్తి సన్నగిల్లిపోతుంది. కాబట్టి, అసలు రసాయనిక ఎరువులు వేయనే వేయకూడదు. రసాయనిక ఎరువులు వేయపోతే మంచి దిగుబడులు రావని, కాయల సైజు రాదని రైతులు అనుకుంటూ ఉంటారు. అది అపోహ మాత్రమే. సేంద్రియసాగులో పశువుల ఎరువుతో కూడా మంచి దిగుబడులు రావడమే కాదు మంచి రుచి కూడా వస్తుంది. నిల్వసామర్థ్యం కూడా  పెరుగుతుంది.  

∙కట్టెలకు నిప్పు పెట్టి గుంతల్లోనే బయోచార్‌ తయారుచేస్తున్న దృశ్యం

కోనేరు గుంతలు.. పశువుల ఎరువు..
డా. శ్యాంసుందర రెడ్డి అనుసరించిన సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వివరాలు.. కోనేరు గుంతలు తవ్వి మొక్కలు నాటారు. కోనేరు గుంత అంటే.. పైన ఎక్కువ వెడల్పుతో, కిందికి వెళ్లే కొద్దీ తక్కువ వెడల్పుతో మెట్లు మెట్లుగా గుంత తీయడం అన్నమాట. గుంత 3 అడుగుల వెడల్పున తీయాలి. వెడల్పు 3 అడుగులతో ప్రారంభమై.. అడుగుకు వెళ్లే టప్పటికి అడుగు వెడల్పు, అడుగు లోతు ఉండేలా తీశారు. ప్రతి గుంతలో కట్టెలను తగులబెట్టి బొగ్గు(బయోచార్‌)ను తయారు చేశారు. గుంతలో మూడో వంతు వరకు కట్టెలు వేసి మంటపెట్టారు. కట్టెలు బాగా ఎర్రగా కాలుతున్నప్పుడు (కట్టెలను పూర్తిగా కాలిపోకముందే చెయ్యాలి. మొత్తం కాలిపోతే బూడద మిగులుతుంది) మట్టితో గుంతను కప్పేశారు.

మంటలు ఆరిపోయి బొగ్గు మిగిలింది. ప్రతి గుంతలో కనీసం 5 కిలోల బొగ్గు ఉంటే సరిపోతుంది. కట్టెలు కాల్చి మట్టితో పూడ్చిన వారం తర్వాత ప్రతి గుంతలోనూ 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు వేసి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన 3వ నెలలో చుట్టూ గాడి తీసి ఎరువు వేశారు. మొక్కకు 2 అడుగుల దూరంలో గుండ్రంగా.. అడుగు వెడల్పు, అడుగు లోతులో గాడి తీశారు. ఆ గాడిలో 4–6 అంగుళాల మందాన పశువుల ఎరువు వేశారు. అంతే. ఈ ఎరువుతోనే చక్కటి కాపు వచ్చింది. చెట్టుకు 40–50 కాయలు వచ్చాయి. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు వేశారు. 7 నెలల తర్వాత 20 కిలోల పశువుల ఎరువు వేశారు.

కొబ్బరి వ్యర్థాలతో ఆచ్ఛాదన
మొక్కల వరుసలో మట్టిని బెడ్‌లా పోసిన తర్వాత దానిపైన కొబ్బరిపీచు వ్యర్థాలతో ఆచ్ఛాదన చేశారు. కొబ్బరి బొండాలను ష్రెడ్డర్‌లో వేసి పీచును తయారు చేస్తారు. పీచుతోపాటు కొంత వృథాపొట్టు వంటి పదార్థం పోగుపడుతుంది. పీచు ధర ఎక్కువ ఉంటుంది. పొట్టు వంటి వ్యర్థ పదార్థాన్ని కిలో రూపాయికి కొని మల్చింగ్‌ చేశారు.

∙కొబ్బరి వ్యర్థాలతో బొప్పాయి చెట్ల చుట్టూ ఆచ్ఛాదన

మైక్రో స్ప్రింక్లర్ల వాడకం మంచిది
బొప్పాయి మొక్కల వేర్లు పైపైనే అనేక మీటర్ల దూరం పాకుతాయి. 80% వేర్లు 4–6 అంగుళాల లోతు మట్టిలోనే ఉంటాయి. ఎంత విస్తారంగా ఆచ్ఛాదన, తేమ గల నేల దొరికితే అంత దూరం వేరు వ్యవస్థ విస్తరిస్తుంది. ఎంత ఎక్కువగా వేరు వ్యవస్థ విస్తరిస్తే అంత ఎక్కువ పోషకాలను మొక్క తీసుకోగలుగుతుంది. డ్రిప్‌తో నీరిస్తే డ్రిప్పర్లున్న చోటే 10–20 అడుగుల లోతు వరకు నీటి తేమ దిగుతుంది. కానీ, అడుగు లోతుకన్నా తేమ బొప్పాయి వేర్లకు అవసరం లేదు. అందువల్ల నీరు వృథా అవుతుంది. ప్రయోజనమూ అంతగా ఉండదు. అందువల్ల మైక్రో స్ప్రింక్లర్లు వాడటమే బొప్పాయి తోటలో నీటియాజమాన్యంలో ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్త అని డా. శ్యాంసుందరరెడ్డి తెలిపారు.

మల్చింగ్‌ చేయకుండా కొందరు రైతులు రసాయనిక కలుపు మందులు వాడుతున్నారు. ఈ కారణంగా ఆ తోటల్లో బొప్పాయి చెట్లకు వైరస్‌ను తట్టుకునే శక్తి సన్నగిల్లుతుంది. సేంద్రియ పదార్థాలతోనే మల్చింగ్‌ చెయ్యాలి. ప్లాస్టిక్‌ షీట్‌తో మల్చింగ్‌ చేయడం కూడా మంచిది కాదు. ఆ షీట్‌ వేసినంత ప్రాంతంలో కలుపు రాకుండా, తేమ ఆరకుండా ఉంటుందే గాని, జీవామృతం, పంచగవ్య వంటి పోషక ద్రావణాలను నేల మొత్తంలో అందించడం వీలు కాదు. సేంద్రియ వ్యర్థాలతో మల్చింగ్‌ చేసి, జీవామృతం, పంచగవ్య వంటి వాటిని మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా నీటితోపాటు ఇచ్చినప్పుడు నేల అన్ని చెరగులా పరచుకొని ఉండే వేర్లకు పోషకాలు పుష్కలంగా అందుతాయి. చెట్లు బలంగా పెరుగుతాయి.

ఎకరానికి 50 టన్నుల సేంద్రియ బొప్పాయిల దిగుబడి
బొప్పాయి తోట రెండేళ్లు కాపునివ్వాలి. అయితే, వైరస్‌ బెడద వల్ల ఏడాదికే అంతా అయిపోతోంది. కనీసం మొదటి 8 నెలలు వైరస్‌ రాకుండా చూసుకోగలిగితే, ఆ తర్వాత వైరస్‌ వచ్చినా 50% కాపునకు ఢోకా ఉండదు. మొక్క చుట్టూ గాడి తీసి పశువుల ఎరువు వేసి, మట్టిని ఎగదోస్తే మొక్కలకు వైరస్‌ రానే రాదు. ఇది మా అనుభవం. రెండో కాపు కూడా బలంగా వస్తున్నది. కింది కాయల సైజులోనే పై కాయలు కూడా పెరుగుతుండటం గమనించాం.

సేంద్రియ బొప్పాయిసాగులో 6 మెలకువలు తు.చ. తప్పకుండా పాటిస్తే వైరస్, పిండినల్లి వంటి చీడపీడలను విజయవంతంగా అధిగమించడమే కాకుండా ఎకరానికి కనీసం 50 టన్నుల దిగుబడి సాధించవచ్చు. కిలోకు రూ. 5 ఖర్చవుతుంది. రైతులే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడం ఉత్తమం. మార్కెటింగ్‌ ఖర్చులు కిలోకు మరో రూ.5 పోయినా మిగతాదంతా నికరాదాయమే. నేరుగా వినియోగదారులకు కిలో రూ. 20కి అమ్మవచ్చు. దీని వల్ల సేంద్రియ రైతుకు, వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది.

– డా. గున్నంరెడ్డి శ్యాం సుందర రెడ్డి (99082 24649), అధిపతి, డా. రామానాయుడు ఏకలవ్య కె.వి.కె., తునికి, మెదక్‌ జిల్లా

2020వ దశకానికి ప్రేమ పూర్వక స్వాగతం..
విషపూరితమైన రసాయనిక, విధ్వంసక సేద్య యుగం నుంచి విముక్తి పొందుదాం.. పంటల జీవవైవిధ్య సేద్యం దిశగా పరివర్తనకు దోవ చూపే దశాబ్దంలోకి అడుగిడదాం.. శిలాజ ఇంధనాలపై ఆధారపడే దుర్గతి ఇక వద్దు.. మన పశు సంపదపై ఆధారపడదాం. మన మట్టి మీద ఆధారపడదాం. జీవవైవిధ్యంతో నిండిన ప్రకృతిపై ఆధార పడదాం. మన ఆరోగ్యం మట్టిలోనే ఉంది మన ఆరోగ్యం ఆహారంలోనే ఉంది మన ఆరోగ్యం జీవ వైవిధ్యంలోనే ఉంది మట్టి ఆరోగ్యానికి మనం ఇవ్వాల్సిందేమీ లేదు.. వైవిధ్యభరితమైన గుప్పెడు బాక్టీరియాని తప్ప రండి.. చెలకల్లో మట్టితో కలిసి పని చేద్దాం..! రండి.. ప్రేమ నిండిన పంటలను విత్తుదాం..!!

– డా. వందనా శివ, జీవవైవిధ్య సేంద్రియ సేద్య ఉద్యమకారిణి

     – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top