పాడి పశువుల పెంపకంతో 8 కోట్ల కుటుంబాలకు జీవనోపాధి
పాడి రైతుల్లో 80% 1–2 ఆవులనో, గేదెలనో పెంచుతున్న వారే
పాల ఉత్పత్తిలో, వినియోగంలో ప్రపంచంలోకెల్లా మన దేశమే ఫస్ట్. 30 కోట్లకు పైగా ఆవులు, గేదెలను పెంచుతున్న 8 కోట్లకు పైగా రైతులకు పశుపోషణే ముఖ్య జీవనోపాధి. జాతీయ స్థూల దేశీయోత్పత్తికి పాలు దాదాపు 5 శాతం దోహదం చేస్తున్నాయి. 2003–2019 మధ్య దేశ పాల ఉత్పత్తి 86 మిలియన్ టన్నుల నుంచి 188 మిలియన్ టన్నులకు (దాదాపు 2.2 రెట్లు) పెరిగింది.
పశువుల సంఖ్య పెరిగింది 11 శాతం మాత్రమే. తలసరి పాల లభ్యత 471 గ్రాములు. సగటున తలసరి పోషకాహార అవసరం 300 గ్రాముల కంటే ఇది చాలా ఎక్కువ. అయితే, ఈ మొత్తం గణాంకాలు గొప్పగా ఉన్నప్పటికీ పాడి/పశుపోషణ రంగంలో కష్టాలు, సమస్యలు, సవాళ్లు ఎన్నో ఉన్నాయి. పెరుగుతున్న భూతాపం పశువులపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తోంది. ఇటువంటి ఎన్నో ముఖ్య విషయాలపై గణాంకాలను ఒక తాజా అధ్యయనం మొట్టమొదటి సారి వెలుగులోకి తెచ్చింది.
‘కౌన్సెల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) అనే స్వతంత్ర పరిశోధనా సంస్థ ఈ అధ్యయనం చేసింది. దేశంలోని 91% ఆవులు, గేదెల పెంపకం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో 7,350 మంది రైతులను అడిగిన వివరాలను విశ్లేషించి అధ్యయన నివేదికను సీఈఈడబ్ల్యూ వెలువరించింది. మన దేశంలో పశుపోషకుల స్థితిగతులపై జరిగిన తొలి విస్తృత స్థాయి అధ్యయనం ఇదే కావటం విశేషం.
పాడి రైతుల్లో 80% వీరే
పాడి రైతుల్లో 80% 1–2 ఆవులనో గేదెలనో పెంచుకునే చిన్న, సన్నకారు రైతులే. దక్షిణాదిలో సంకరజాతి ఆవులు, ఉత్తరాదిలో గేదెలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పంజాబ్, హరియాణాలోని అధికంగా పాలిచ్చే గేదెలు, ఆవులను అధిక సంఖ్యలో పెంచే సాంద్ర పెంపకం పద్ధతి (ఇంటెన్సివ్ సిస్టమ్) అమల్లో ఉంది. మహారాష్ట్రలో పాలతో పాటు పశువులను వ్యవసాయంలో, రవాణా కోసం వాడుకునే పరిస్థితులున్నాయి. తూర్పు రాష్ట్రాల్లో పశువుల యాజమాన్యాన్ని సామాజిక–సాంస్కృతిక అంశాలు బలంగా ప్రభావితం చేస్తున్నాయి.
అధ్యయనం చేసిన 15 రాష్ట్రాల్లోని 9 రాష్ట్రాల్లో సగం కంటే తక్కువ మంది పశుపోషకులు తాము పాల అమ్మకం ఆదాయంపై ఆధారపడి ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా పశువుల పెంపకందారుల్లో దాదాపు 38 శాతం (సుమారు 3 కోట్లు) రైతు కుటుంబాలకు పశువుల పెంపకానికి పాల అమ్మకమే ప్రేరణ కాదు. వీరి ఇళ్లలో చాలా వరకు సాధారణంగా 1–2 దేశీయ జాతుల ఆవులు ఉంటాయి. ఇంట్లో వారి అవసరాల కోసం పోషకాలతో కూడిన పాల కోసం, ప్రకృతి/సేంద్రియ వ్యవసాయానికి పేడ, మూత్రం కోసం, వ్యవసాయ పనుల్లో ఎద్దుల కోసం వీరు పశువులు పెంచుకుంటున్నారు. ముఖ్యంగా సమీకృత వ్యవసాయంలో దేశీయ పశువుల పాత్ర ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించింది.
మహారాష్ట్ర, కర్ణాటకలలో పాడి పరిశ్రమ విస్తరించి ఉన్నప్పటికీ, ఈ రాష్ట్రాల్లో 30 శాతం కంటే ఎక్కువ మంది పశుపెంపకందారులు పాలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని అధ్యయనం తెలిపింది. 1–2 దేశీయ పశువులను పెంచే రైతుల్లో ఈ ధోరణులు సర్వసాధారణం. హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాంలలో, 15 శాతం కంటే ఎక్కువ మంది రైతులు సామాజిక–సాంస్కృతిక లేదా మతపరమైన అంశాల ప్రేరణతో పశువులను పెంచుతున్నట్లు చె΄్పారు.
42%లో బలమైన ఆసక్తి
దేశవ్యాప్తంగా దాదాపు 42 శాతం మంది పశు పెంపకందారులు మరిన్ని ఆవులు/ గేదెలను కొని పెంచాలన్న ఆకాంక్షతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 46%. అంతేకాకుండా, తమ కుటుంబంలోని భవిష్యత్ తరాలకు పశువుల పెంపకంపై ఆసక్తి ఉందని దేశంలో 39 శాతం రైతులు చెబితే, ఆసక్తి ఉండే అవకాశం ఉందని మరో 35 శాతం చె΄్పారు. కేవలం 9 శాతం మంది మాత్రమే తమ వారసులకు పశువుల పెంపకంపై ఆసక్తి చూపబోరన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వారసుల్లో 30%కు మాత్రమే ఆసక్తి ఉంటుందన్నారు. 45% మంది తెలియదన్నారు.
వేడి ఒత్తిడి ఇక్కట్లు
ఉష్ణోగ్రతలు గత మూడేళ్లుగా అతిగా పెరుగుతున్నాయి. వాతావరణ ఒత్తిళ్లు పశువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పశువుల పెంపకందారులు వాపోతున్నారు. రాబోయే 5 దశాబ్దాలలో వాతావరణ ఒత్తిడి గోవుల ఉత్పాదకతను దాదాపు 25 శాతం తగ్గిస్తుందని అంచనా. ఇప్పటికే, 54 శాతం గేదెల పెంపకందారులు, 50 శాతం సంకరజాతి ఆవుల పెంపకందారులు, 41 శాతం దేశీ ఆవుల పెంపకందారులు తమ పశువులకు వాతావరణ సంబంధిత ఇబ్బందులు పెరిగాయని చె΄్పారు. 33 శాతం రైతులు తమ పశువులు ఎక్కువగా జబ్బుపడుతున్నాయని, చనిపోతున్నాయని చె΄్పారు.
అలాగే 20 శాతం రైతులు ఎండ దెబ్బకు పశువులు నిస్సత్తువగా ఉంటున్నాయన్నారు. గేదెలు, సంకరజాతి ఆవులపై వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు రైతులు గుర్తించారు. స్వదేశీ జాతి ఆవులు వాతావరణంలో హెచ్చుతగ్గుల్ని మెరుగ్గా తట్టుకోగలుగుతున్నాయని రైతులు తెలిపారు. వాణిజ్యస్థాయిలో పాడి పరిశ్రమను విస్తరింపజేయదలచిన రైతులు గేదెలు, సంకరజాతి ఆవుల వైపే దృష్టి సారిస్తున్నారు. తద్వారా వాతావరణ మార్పుల సెగ పాడి రైతులకు మున్ముందు పెరుగుతుందని చెప్పుకోవచ్చు.
ప్రభుత్వం కదలాలి
వాతావరణ మార్పుల్ని తట్టుకొనే మెళకువలపై రైతుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం కృషి చెయ్యాలని సీఈఈడబ్ల్యూ అధ్యయన నివేదికలో సూచించింది. గేదెలు వేడి ఒత్తిడిని తట్టుకోలేవు కాబట్టి రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా వేడి ఒత్తిడిని తట్టుకునే దేశీ బ్రీడ్స్‌ను ప్రోత్సహించాలి. సంకరజాతి ఆవులు, గేదెల పెంపకం చేపట్టే రైతులకు షేడ్‌నెట్స్, నీటి స్ప్రింక్లర్లు వంటి ప్రత్యేకమైన శీతల సదుపాయాలు కల్పించాలి. పశుబీమా ప్రీమియం తగ్గించాలి. బీమా ప్రక్రియను సులభతరం చెయ్యాలి. క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలి. తద్వారా వాతావరణ మార్పులను తట్టుకునేలా పాడి రైతులకు రక్షణ కల్పించాలి.
పాడి పరిశ్రమకు సవాళ్లెన్నో..
దాణా, పశుగ్రాసాలను సరసమైన ధరకు పొందటమే పశు పెంపకందారులకు అతిపెద్ద సవాలు. దేశంలోని నలుగురిలో దాదాపు ముగ్గురు పశువుల పెంపకందారులు మేత, పశుగ్రాసానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చె΄్పారు. పచ్చి, ఎండు గడ్డి ఆ ప్రాంతంలో అవసరానికి మించి ఉన్నప్పటికీ అందుబాటు ధరలో దొరక్కపోవటం పాడి రైతులకు ఆందోళన కలిగిస్తోంది. పచ్చిక బయళ్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవటం చాలా రాష్ట్రాల్లో రైతులకు సమస్యగా మారింది. ఈ కొరత తీర్చే సైలేజ్ గడ్డి గురించి 80% మందికి తెలియదు. 25% మంది రైతులు అరకొర పశువైద్య సేవలు, అధిక చికిత్స ఖర్చులతో సతమతమవుతున్నారు. సగం మంది రైతులు తమ పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తున్నారు. ఆడ దూడలనే పుట్టించే సాంకేతికత గురించి 25% మందికి మాత్రమే తెలుసు.
తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగ
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లిలోని ఎర్త్ సెంటర్‌లో ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగ జరగనుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్ వ్యవసాయాన్ని నిలబెట్టుకోవటానికి దేశీ వంగడాల పరిరక్షణ అత్యంత ముఖ్యమన్న నినాదంతో కౌన్సెల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా ఈ విత్తన పండుగను నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దేశీ విత్తన పరిరక్షకులు, రైతులు, విద్యార్థులు పాల్గొంటారు. మూడు రోజులూ రైతులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిరక్షకులతో ప్రత్యేక చర్చాగోష్టులు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు.. 96769 57000.


