Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే

How To Cultivate Brahma Jemudu Cactus Fodder For Livestock Benefits - Sakshi

ముళ్లు లేని బ్రహ్మజెముడు... వేసవి పశుగ్రాసపు పంట!

Spineless Cactus: ముళ్లులేని బ్రహ్మజెముడు కరువు పాంతాల్లో వేసవి పశుగ్రాస పంటగా ఉపయోగపడుతోంది. అతి తక్కువ నీటితోనే బ్రహ్మజెముడు మొక్క బతుకుతుంది. ఇతర ఏ ఇతర పశుగ్రాస పంటల కన్నా తక్కువ నీటితోనే బతకగలదు. మెక్సికో, జోర్దాన్‌ వంటి దేశాల్లో కరువు/ఎడారి ప్రాంతాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో అంతర్భాగంగా మారిన ఈ పంట ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది.

అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పుణే కేంద్రంగా పనిచేస్తున్న బిఎఐఎఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఇందుకోసం విశేష కృషి చేస్తుండటం విశేషం. ఒక్కసారి నాటుకుంటే దశాబ్దాల తరబడి నిరంతరం పశుగ్రాసం అందుబాటులో ఉంటుంది.

గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన తర్వాత అనంతపురం జిల్లాలో రైతులకు ఈ పంటను ‘సెర్ప్‌’ సహాయంతో నాలుగేళ్ల క్రితం పరిచయం చేశారు. బ్రహ్మజెముడు పశుగ్రాస పంట మాత్రమే కాదు, ఆహార పంట కూడా. దీని ఆకులను కూరగా వండుకొని కూడా తింటారు. 

ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగు ఇలా..
నాటే కాలం: వర్షాకాలం తర్వాత అక్టోబర్‌ నుంచి మార్చి వరకు.

స్థల ఎంపిక: నీరు నిలవని తేలికపాటి నేలలు అనుకూలం. ఏ ఇతర పంటలు పండని నిస్సారమైన సాగు భూములు, బంజరు భూములు, రాళ్ల భూములు, ఇసుక భూముల్లోనూ ముళ్లులేని బ్రహ్మజెముడు పెరుగుతుంది. 2 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తులో మడుల (బెడ్స్‌)ను సిద్ధం చేసి ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులు నాటాలి.

ఆకులను నాటడానికి సిద్ధం చేయటం: కనీసం ఒక సంవత్సరం వయసున్న ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులనే కోసి, నాటుకోవచ్చు. నాటడానికి ముందు వాటిని నీడలో 15 రోజులు ఉంచాలి. కోసిన వెంటనే నాటకూడదు. వడపడి తేమ తగ్గిన తర్వాత నాటాలి.

శుద్ధి చేసి నాటాలి: శిలీంద్ర తెగుళ్లు నివారించడానికి జాగ్రత్తవహించాలి. నాటడానికి ముందు ట్రైకోడెర్మా విరిడి ద్రావణంలోద్రావణంలో ఆకులను ముంచిన తర్వాత నాటాలి.

నాటే దూరం: సాళ్ల మధ్య 3 మీటర్లు, మొక్కల మధ్య 2 మీటర్ల (667 మొక్కలు/ఎకరం) దూరంలో నాటాలి. ఆకును చెట్టు నుంచి కోసిన భాగం మట్టిలోకి వెళ్లేలా నాటాలి. ఎత్తుమడిపై ఈ ఆకుపై ఎండపడే విధంగా తూర్పు వైపు తిప్పి నిటారుగా ఉండేలా నాటండి.

ఎరువు: నాటేటప్పుడు ఎకరానికి 2 టన్నుల చొప్పున బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో పాటు 60:30:30 ఎరువులు వేయండి. నాటిన ఏడాది తర్వాత నుంచి ఆకులు కోసుకొని పశువులకు మేపవచ్చు లేదా తిరిగి నాటుకోవచ్చు. ∙నీటి నిర్వహణ: మొక్కలు (ఆకులు) నాటిన 10 రోజుల వరకు మొక్కలకు నీరు పెట్టవద్దు. తర్వాత 15 రోజుల వ్యవధిలో మొక్కకు 1–2 లీటర్ల నీరు పోయాలి. మొదటి ఏడాది కలుపు తీసెయ్యాలి. 

ఆకుల దిగుబడి: నాటిన తర్వాత ఏడాది తర్వాత నుంచి ఆకులు కోసుకోవచ్చు. కింది వైపు ఉండే రెండు, మూడు ఆకులు అలాగే ఉంచి ఆ పైన పెరిగిన ఆకులను చాకుతో కోయాలి.  

మేపటం: ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులను చిన్న ముక్కలుగా కోసి మేకలు/గొర్రెలు/పశువులకు ఇతర పచ్చి మేతకు బదులుగా 30% మేరకు తినిపించవచ్చు. 

చౌడు, నల్ల భూములు పనికిరావు!
పశుగ్రాసం కొరతను అధిగమించడానికి పశువులు, గొర్రెలు, మేకలు పెంచుకునే కరువు ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులతో ముళ్లులేని బ్రహ్మజెముడు సాగు చేయిస్తున్నాం. నీటి ఎద్దడి ఉండే ప్రాంత భూముల్లో ఈ మొక్కలు నిశ్చింతగా పెరుగుతాయి.

నీరు నిల్వ ఉండే నల్ల నేలలు, చౌడు భూముల్లో ఈ మొక్కలు పెరగవు. 2018 నుంచి అనంతపురం జిల్లాలో 82 మంది రైతులకు ముళ్లులేని బ్రహ్మజెముడు నాటిస్తున్నాం. వీటి ఆకులు నాటితే చాలు. పుణే లోని బిఎఐఎఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నుంచి 4 రకాల ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను తెప్పించి ‘సెర్ప్‌’ ఆధ్వర్యంలో రైతులకు పంచాం.

ముళ్లులేని బ్రహ్మజెముడును మార్చి వరకు నాటుకోవచ్చు. నాటుకోవడానికి ఆకులు కావాలనుకునే రైతులు సంప్రదించవచ్చు. టిష్యూకల్చర్‌ పద్ధతిలో నర్సరీ పెంచుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు శిక్షణ ఇస్తాం. – సురేష్‌ (99892 04816), బిఎఐఎఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి, అనంతపురం 

ఎండాకాలంలో ఏపుగా పెరుగుతుంది
ముళ్లులేని బ్రహ్మజెముడును మూడేళ్ల క్రితం వేసవిలో నాటాను. ఒక ఎకరంలో ఎత్తుమడులు నాటాను. 5 ఎకరాల జామ తోట చుట్టూతా అడుగు ఎత్తున సరిహద్దు గట్టు వేసి దానిపైన కూడా నాటాము. ఒక సంవత్సరం పాటు 15 రోజులకు ఒకసారి నీరు పోశాం. తర్వాత నుంచి నీరు పోయటం లేదు. మూడేళ్లకు ఇప్పుడు 6 నుంచి 8 అడుగుల ఎత్తు పెరిగాయి.

ఈ మొక్కలు వర్షాకాలంలో పెద్దగా పెరగవు. ఎండాకాలంలో ఏపుగా పెరుగుతాయి. నీరు నిల్వ ఉండకూడదు. ఎంత ఎత్తు మీద అంత మంచిది. ఒక సంవత్సరం పెరిగిన తర్వాత నుంచి బ్రహ్మజెముడు ఆకులు కోసి, ముక్కలు చేసి.. ఆవులు, గేదెలతో పాటు 100 పొట్టేళ్లకు కూడా ఇతర పశుగ్రాసం లేనప్పుడు మేతగా వేసేవాళ్లం.

ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులు మంచి పశుగ్రాసం. పశువులు ఏవైనా ఇష్టంగా తింటాయి. ఆవుల పాలలో వెన్న 1–2% వరకు పెరిగింది. రైతులు కొందరు ఇంతకు ముందే ఈ ఆకులను తీసుకెళి నాటుకున్నారు. ఆకును రూ. 20కి ఇస్తున్నాను. – అలవల వెంకటేశ్వర రెడ్డి , ఫోన్‌: 90006 16717, ముళ్లులేని బ్రహ్మజెముడు రైతు, గుత్తి, అనంతపురం జిల్లా 
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

చదవండి: Sagubadi: తినడానికి పనికొచ్చేదని అప్పట్లో తెలీదు.. సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం...
Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top