భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో స్పష్టతనిచ్చారు. దేశంలోని అత్యంత సున్నితమైన రంగాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రయోజనాలను ఈ ఒప్పందంలో పూర్తిగా కాపాడినట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ప్రతిపక్షాల ఆందోళనల మధ్య వాయిదా పడిన ఈ ప్రకటనను ఆయన తర్వాత ఉభయ సభల్లో చదివి వినిపించారు.
ఒప్పందంలోని ప్రధానాంశాలు..
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందని గోయల్ తెలిపారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు..
అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది ఇతర పోటీ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాల కంటే తక్కువ కావడం గమనార్హం.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై గతంలో విధించిన 25 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా పూర్తిగా తొలగించింది.
భారత దిగుమతులపై ఉన్న 25 శాతం పరస్పర సుంకాన్ని కూడా 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది.
కీలక రంగాలకు ఊతం
ఆగస్టు 2025 నుంచి అమలులో ఉన్న 50 శాతం అధిక సుంకాల కారణంగా వస్త్రాలు, తోలు వస్తువులు, సముద్ర ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా తగ్గింపులతో ఈ రంగాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో తిరిగి పోటీతత్వం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధన భద్రతపై వస్తున్న సందేహాలకు మంత్రి సమాధానమిస్తూ, 140 కోట్లు భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా చమురు, ఇంధన వనరులను వివిధ మార్గాల ద్వారా సేకరించడం భారత వ్యూహంలో భాగమని చెప్పారు.
ఇంధనం, విమానయానం, డేటా సెంటర్లు, అణుశక్తి వంటి రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉందని, ఈ రంగాల్లో వాణిజ్య సహకారం పెంచుకోవడం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ప్రస్తుతం సాంకేతిక ప్రక్రియలు, పత్రాల తయారీ తుది దశలో ఉందని, అవి పూర్తయిన వెంటనే ఒప్పందం పూర్తి వివరాలను తెలియజేస్తామని గోయల్ చెప్పారు.
ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం


