Sagubadi: తినడానికి పనికొచ్చేదని అప్పట్లో తెలీదు.. సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం...

Sagubadi: Organic Seaweed Amazing Health Benefits Protein Food - Sakshi

ఇక సేంద్రియ సీవీడ్స్‌ సాగు!

సీవీడ్స్‌కు సీ ప్లాంట్స్, సీ వెజిటబుల్స్‌ అని పేరు

ఉల్వా రకం సీవీడ్‌కు ‘సముద్రపు పాలకూర’ అని పేరు

సేంద్రియ సీవీడ్స్‌ సాగు పద్ధతిని అభివృద్ధి చేసిన ఇజ్రాయిల్‌ కంపెనీ

Organic Seaweed- Amazing Health Benefits: సీవీడ్స్‌.. అంటే సముద్రపు నీటిలో పెరిగే నాచు వంటి మొక్కలు. వాటి విలువ తెలియని కాలంలో ‘వీడ్స్‌’ అని పిలిచి ఉంటారు. పౌష్టిక విలువేమిటో తెలిసిన తర్వాత ఇప్పుడు ‘సీ ప్లాంట్స్‌’ అని, ‘సీ వెజిటబుల్స్‌’ అంటూ నెత్తినపెట్టుకుంటున్నారు. ఆకుపచ్చగా ఉండే ఉల్వా రకం సీవీడ్‌ను ‘సముద్రపు పాలకూర’ అని కూడా పిలుస్తున్నారు.

చైనా, జపాన్‌ తదితర ఆసియా దేశాల్లో తరతరాలుగా వీటిని సముద్రం నీటిలో సహజసిద్ధంగా పెరిగే సీవీడ్స్‌ను సేకరించి తినే అలవాటుంది. అమెరికా, కెనడాల్లో కొన్ని కంపెనీలు చెరువుల్లో పెంచటం ప్రారంభించాయి. ఇజ్రాయిల్‌ కంపెనీ మరో ముందడుగేసింది. సేంద్రియ సీ వెజిటబుల్స్‌ సాగు చేసే ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఆహారోత్పత్తులకు అదనపు పోషకాలు జోడించడానికి, ఔషధాల తయారీలో సీవీడ్స్‌ను విరివిగా వాడుతున్నారు.

సేంద్రియ సీ వీడ్స్‌ సాగు అంటే ఏమిటి?
సీ వీడ్స్‌ సాధారణంగా సముద్రపు నీటిలో సహజసిద్ధంగా పెరుగుతూ ఉంటాయి. వాతావరణ పరిస్థితులును బట్టి కొన్ని సీజన్లలోనే అందుబాటులో ఉంటాయి. కాలక్రమంలో వీటిని తీరం వెంబడి సముద్రపు నీటిలో కేజెస్‌లలో సాగు చేయటం ప్రారంభమైంది. తీరప్రాంతాల్లో నేలపై నిర్మించిన కృత్రిమ చెరువుల్లో సముద్రపు నీటిని తోడి సాగు చేయటం అమెరికా, కెనడా దేశాల్లోని తూర్పు తీరంలో కొన్ని కంపెనీలు ప్రారంభించాయి.

ఇప్పుడు ఇజ్రేల్‌కు చెందిన ‘సీకురా’ అనే కంపెనీ మరో ముందుకు వేసి సేంద్రియ సీ వీడ్స్‌ సాగు చేయనారంభించటం విశేషం. సాధారణ సముద్ర జలాల్లో భారఖనిజాలు, ఇతర కాలుష్యాలు అంటకుండా సముద్ర గర్భం నుంచి శుద్ధమైన నీటిని తోడి తెచ్చి తీరానికి దగ్గర్లో నేలపై కృత్రిమ ఉప్పునీటి చెరువుల్లో సాగు చేసే విధానమే ‘సేంద్రియ సీవీడ్స్‌ సాగు’ పద్ధతి అని ఈ సంస్థ చెబుతోంది.

నీటి ఉష్ణోగ్రతను, కాంతిని నియంత్రించడం ద్వారా ఏడాది పొడవునా సేంద్రియ సీవీడ్స్‌ సాగును నిరంతరాయంగా చేపట్టవచ్చని ఈ సంస్థ చెబుతోంది. పెరుగుతున్న జనాభాకు పౌష్టిక విలువలున్న ఆహారోత్పత్తులను అందించడానికి తగినంత పరిమాణంలో స్థిరమైన దిగుబడి పొందడానికి తమ సాంకేతికత ఉపకరిస్తుందని ఈ కంపెనీ చెప్తోంది. 

సీవీడ్స్‌ సాగులో 3 దశలు
సేంద్రియ సీవీడ్స్‌ సాగుకు సముద్రగర్భం నుంచి తోడిన నీటిని భారఖనిజాలు, ఇతర కలుషితాలు లేకుండా శుద్ధి చేసిన నీటిని వాడుతారు. సీవీడ్‌ల ముక్కలు వేస్తే కొద్ది రోజుల్లో అవి పెరుగుతాయి. పెరుగుదల క్రమంలో వయసును బట్టి 3 దశలుంటాయి. ఒక్కో దశకు వేర్వేరు చెరువుల వ్యవస్థను డిజైన్‌ చేశారు.

సముద్రపు నీటిలోని సహజ పోషకాలు, బాక్టీరియా ఆధారంగా సీవీడ్స్‌ వేగంగా పెరుగుతాయి. సాగు పూర్తయి సీవీడ్స్‌ను పట్టుబడి చేసిన తర్వాత నీటిని ఆక్వా సాగుకు వాడొచ్చు లేదా తిరిగి సముద్రంలోకి వదిలేయవచ్చు. కాలుష్యం అనే మాటే ఉండదు అని నిపుణులు చెబుతున్నారు.  

‘బీచ్‌లో కాళ్ళకు చుట్టుకొని చికాకుపెట్టే వాటిగానే సీవీడ్స్‌ను ఇజ్రేల్‌ ప్రజలు భావించేవారు. తినడానికి పనికొచ్చేదని మొన్నటి వరకూ తెలీదు. ఇప్పుడు అది ఎంత ఆరోగ్యకరమైనదో, ఎంత రుచిగా ఉంటుందో గ్రహించారు అంటున్నారు ఓజ్‌.

ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ రెండు రకాల సీవీడ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఓజ్‌ అంటున్నారు. సేంద్రియ సీవీడ్‌ సాగుపై మన శాస్త్రవేత్తలు దృష్టిపెడితే.. రొయ్యలు, చేపలు, స్పిరులినా మాదిరిగా చెరువుల్లో సీవీడ్స్‌ సేంద్రియ సాగు చేసి అమెరికా, కెనడా తదితర దేశాల్లో మార్కెట్లను భారత్‌ చేజిక్కించుకునే పరిస్థితులొస్తాయని ఆశించవచ్చు.

సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం
సీ వీడ్స్‌ రకాలు వేలాదిగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఎక్కువగా కలిగి ఉండే రెండు రకాలను ఎంపిక చేసుకొని తాము సాగు చేస్తున్నామని సీకురా సీఈఓ ఓజ్‌ చెప్పారు.

మాంసం (25 గ్రా.), చికెన్‌ (21.7 గ్రా.), కోడిగుడ్డు (12 గ్రా.)తో పోలిస్తే తాము సాగు చేసే ఉల్వా, గ్రేసిలేరియా రకాల సీవీడ్స్‌లో 32 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుందన్నారు. ఉల్వా రకం పచ్చని ఆకుల మాదిరిగా ఆకుపచ్చని రంగులో ఉంటుంది. అందుకే దీన్ని ‘సముద్రపు పాలకూర’ అని కూడా పిలుస్తారు.

రెండోది గ్రేసిలేరియా
ఇది ముదురు ఎరుపు రంగు సున్నితమైన కాడలతో కూడిన మొక్క మాదిరిగా ఉంటుంది. వీటిని ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు వీటిల్లో ఏ మేరకున్నాయో నిర్ధారించడానికి కంపెనీ జన్యు పరీక్షలు నిర్వహించింది.

ఇతర సూపర్‌ ఫుడ్స్‌లో కన్నా మిన్నగానే
డైటరీ ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ముఖ్యంగా అధిక అయోడిన్‌ వీటిల్లో కాలే, చియా, స్పిరులినా వంటి ఇతర సూపర్‌ ఫుడ్స్‌లో కన్నా మిన్నగానే ఉన్నాయి. అయోడిన్‌ లోపం నేడు ప్రపంచంలోని ప్రధాన పోషకాహార లోపాల్లో ఒకటి.

గాయిటర్, గర్భధారణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యల నివారణలో అధిక పోషకాలున్న ఉల్వా, గ్రేసిలేరియా సీవీడ్స్‌ సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ఉంది.   
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌ 

చదవండి: Eye Problems: ప్రమాద సంకేతాలు.. ఉబ్బిన కళ్లు, రెప్పల మీద కురుపులు.. ఇంకా ఇవి ఉన్నాయంటే
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top