‘ప్రకృతి’ పరిశోధనలకు పెద్ద పీట

AP Government CM YS Jagan Nature Farming Importance - Sakshi

ఆహారంతో పాటు మనం తింటున్న రసాయనాలే క్యాన్సర్‌ తదితర మహమ్మారి జబ్బుల్ని కలిగిస్తున్నాయని మీకు తెలుసా? కలుపు మందు తయారీ కంపెనీపై అమెరికన్‌ ప్రజలు 9 వేలకు పైగా నష్టపరిహారం కేసులు వేశారని మీకు తెలుసా? రసాయనిక అవశేషాల్లేని, రోగ కారకం కాని స్వచ్ఛమైన ఆహారం.. అంటే ‘అమృతాహారం’ తీసుకునే వారు బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉంటారని తెలుసా? అటువంటి అమృతాహారం రానున్న కొద్దేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలన్న మహాయజ్ఞం ప్రారంభమైంది. 

ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విప్లవాన్ని ప్రతి గ్రామానికీ, ప్రతి రైతుకూ, ప్రతి పొలానికీ విస్తరింపజేయడానికి దార్శనికతతో రాచబాటలు వేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. రైతుల భాగస్వామ్యంతో వచ్చే 7–8 ఏళ్లలో రాష్ట్రం మొత్తాన్నీ దశలవారీగా ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించడానికి నిర్మాణాత్మకమైన ప్రణాళికతో కదులుతున్నారు. బృహత్తరమైన ఈ కలను సాకారం చేసుకోవడానికి ఈ నెల 7న తొలి అడుగు వేశారు. ప్రకృతి వ్యవసాయ పరిశోధన, అధ్యయన అకాడమీని జర్మనీ ప్రభుత్వ ఆర్థిక, సాంకేతిక తోడ్పాటుతో పులివెందులలో ప్రారంభించారు. పశుసంపదపై పరిశోధనకు గతంలో అత్యున్నత వసతులతో ఏర్పాటు చేసిన ‘ఐజి కార్ల్‌’ ఆవరణలో (‘ఇండో–జర్మన్‌ అకాడమీ ఫర్‌ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ – ఐజిఎఎఆర్‌ఎల్‌–‘ఐజి ఆర్ల్‌’గా మార్చారు.) ఇది ఏర్పాటైంది. ప్రపంచ ప్రకృతి వ్యవసాయ పరిశోధన చరిత్రలోనే అదొక సుదినం. 

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 6,30,000 మంది రైతులు ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంలో ముందంజలో ఉన్నారు. ఈ కృషికి మెచ్చిన జర్మనీ ప్రభుత్వం ఐజి ఆర్ల్‌ నెలకొల్పటానికి రూ.174 కోట్ల గ్రాంటు ప్రకటించటం విశేషం. పరిశోధనలకు, రైతు శాస్త్రవేత్తల శిక్షణతో పాటు దేశ విదేశీ శాస్త్రవేత్తలకు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు ఇది వేదికగా నిలుస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్, 365 రోజుల పంటల సాగు వంటి పలు రైతు ఆవిష్కరణల వెనుక శాస్త్రీయత, ఎదుర్కొంటున్న సవాళ్లపై  పరిశోధనా పత్రాలను వెలువరిస్తుంది. రాష్ట్రంలోని ఇతర 25 జిల్లాల్లోని 7 జిల్లాల్లో ఐజి ఆర్ల్‌కు అనుబంధ పరిశోధన, అధ్యయన కేంద్రాలను నెలకొల్పుతారు. మిగతా జిల్లాల్లోనూ ప్రత్యేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. విభిన్న వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, వైవిధ్య పంటలు, తోటల సరళికి అనుగుణంగా మెట్ట, మాగాణి భూముల్లో ప్రకృతి సేద్య నమూనాలపై పరిశోధనలు చేస్తారు. 

ఆర్బీకే స్థాయిలోనే ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌
ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులను ఎంపిక చేసి, ఐజి కార్ల్‌లో వారికి మూడేళ్ల పాటు ఆచరణాత్మక శిక్షణ ఇచ్చి, వారి జ్ఞానాన్ని మరింత పరిపుష్టం చేస్తారు. అధికారిక గుర్తింపుగా సర్టిఫికెట్లు ఇస్తారు. రాష్ట్రంలో 10,800 రైతు భరోసా కేంద్రాలు రైతులకు గ్రామస్థాయిలో చేదోడుగా ఉంటున్నాయి. ప్రతి ఆర్బీకేలో ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులైన సర్టిఫైడ్‌ రైతు శాస్త్రవేత్తను నియమించడం ద్వారా స్థానికంగా రైతులను ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రకృతి వ్యవసాయోత్పత్తులకు ఆర్బీకే ద్వారానే ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ను సమకూర్చుతారు. వీటిని సముచిత ధరకు విక్రయించుకునేందుకు సైతం ఆర్బీకే వేదికగా నిలుస్తుంది. ఆ విధంగా మిగతా రైతులు సైతం రసాయనాలను పూర్తిగా వదిలేసి, తనకున్న మొత్తం పొలాన్ని దశలవారీగా మూడేళ్లలో ప్రకృతి సేద్యంలోకి మళ్లించడం వీలవుతుంది. మన రైతు శాస్త్రవేత్తల అనుభవాలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చక్కని ఆచరణాత్మక అపూర్వ పాఠాలుగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. ఇందుకోసం లక్ష మంది సర్టిఫైడ్‌ ప్రకృతి రైతు శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే విధంగా, వచ్చే ఐదేళ్లలో కనీసం 200 అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్మాణమైన భవనాలు సిద్ధంగా ఉండటంతో ‘ఐజీ ఆర్ల్‌’ ఈ ఖరీఫ్‌ నుంచే పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. 

ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఏపీ ప్రభుత్వ ప్రకృతి సేద్య విస్తరణ రోడ్‌మ్యాప్‌లో మరో ముఖ్య అంకం ఏమిటంటే... ఈ ఆవరణలోనే వచ్చే ఏడాది కల్లా అంతర్జాతీయ స్థాయి ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించటం. దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం అవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీహెచ్‌డీ కోర్సులను ఈ విశ్వవిద్యాలయం ఆఫర్‌ చేయనుంది. సీఎం జగన్మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో వ్యవస్థీకృతం అవుతున్న ఐజి ఆర్ల్, ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్‌) ఉపాధ్యక్షులు, ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్‌ అయిన టి.విజయకుమార్‌ పర్యవేక్షణలో వేరూనుకోనుంది.

వ్యవసాయ విద్య, పరిశోధనలను ప్రకృతి బాట పట్టించి కొత్త పుంతలు తొక్కించాలన్న ఏపీ ప్రభుత్వ సంకల్పాన్ని భారత ప్రభుత్వం సైతం గుర్తించి ప్రోత్సహిస్తుండటం కలిసి వచ్చింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన, పశు పరిశోధన, విస్తరణ సంస్థలు సైతం ప్రకృతి సేద్యంపై దృష్టి సారించటం శుభసూచకం.  
– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు   

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top