సేంద్రియ పశుపోషణపై దృష్టి | Sagubadi: ICAR introduce to Organic methods of animal husbandry | Sakshi
Sakshi News home page

సేంద్రియ పశుపోషణపై దృష్టి

Jul 29 2025 6:25 AM | Updated on Jul 29 2025 6:25 AM

Sagubadi: ICAR introduce to Organic methods of animal husbandry

సేంద్రియ/ప్రకృతి పంటల సాగుతో పాటు సేంద్రియ పద్ధతుల్లో పశు పోషణకూ ప్రభుత్వ ప్రోత్సాహం

సేంద్రియ పాలు, మాంసం, గుడ్ల పెంపకంపై సమగ్ర విధానం రూపకల్పనకు కసరత్తు

ఈ కృషిలో హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌–ఎన్ఎంఆర్‌ఐ కీలక పాత్ర

‘ఆర్గానిక్‌ ఆహారోత్పత్తులు అనగానే మనకు చప్పున గుర్తొ­చ్చేది ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు. కానీ, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు కూడా ఆర్గానిక్‌ బుట్టలో ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తుంది. ప్రకృతి/సేంద్రియ సేద్య పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. వారు పండిస్తున్న సేంద్రియ ఆహారాన్ని దేశీయంగా వినియోగిస్తుండడంతోపాటు చాలా రకాల సేంద్రియ ఉత్పత్తులను అనేక దేశాలకు మన దేశం ఎగుమతి చేస్తోంది. అయితే, సేంద్రియ పాలు/ పాల ఉత్పత్తులు, సేంద్రియ పశు / కోడి మాంసం తదితర ఉత్ప­త్తుల ఎగుమతి మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.

సేంద్రియ పశుపోషణ, సేంద్రియ కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి విధాన రూపుకల్పన కోసం కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆర్గానిక్‌ లైవ్‌స్టాక్‌ ప్రొడక్షన్, సర్టిఫి­కేషన్  ప్రక్రియలకు సంబంధించి విధి విధానాలు, ప్రమాణా­లను రూపొందించే కృషి ఊపందుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్‌ అనుబంధ సంస్థ జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌–ఎన్ ఎంఆర్‌ఐ) ఈ ప్రక్రియ­లో కీలకపాత్ర పోషిస్తోంది.

 ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో ఇటీవల ఒక సమాలోచన కార్య శాలను సైతం ఎన్ ఎంఆర్‌ఐ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అసలు సేంద్రి­య పద్ధతుల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంప­కం అంటే ఏమిటి? రసాయనాలు వాడకుండా పశుపోషణ ఎ­లా? వ్యాధుల నివారణ, చికిత్సకు రసాయనా లకు ప్రత్యామ్నా­యం ఏమిటి? సేంద్రియ ధ్రువీకరణ పద్ధతులేమిటి? మన బలాబలాలు, సవాళ్లేమిటి? ఇటువంటి అంశాలపై విషయ నిపుణులు ‘సాక్షి సాగుబడి’తో ఏమన్నా
రంటే.. 

పంటలు/తోటలు లేదా జంతువులు / కోళ్లను రసాయ­నిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు, హార్మోన్లు, అల్లో­పతి మందులు వంటి సింథటిక్‌ ఉత్పాదకాలను ఉపయోగించకుండా పెంచటాన్ని సేంద్రియ వ్యవసాయంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఈ విధంగా రసాయ నాలు, జన్యుమార్పిడి ఉత్పాదకాలు వాడకుండా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచే ఆహారోత్పత్తులకు దేశ విదేశీ మార్కెట్లలో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది.

 ధ్రువీకరణ ప్రమాణాలకు అనుగుణంగా పెంచిన ఆరోగ్యదాయక మైన సేంద్రియ ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లతో పాటు సేంద్రియ పాలు, మాంసం, కోడిగుడ్లు, విలువ ఆధారిత సేంద్రియ ఆహారోత్పత్తులకు అధిక సొమ్ము చెల్లించటానికి ధనిక, మధ్యతరగతి వినియోగ దారులు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్‌ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారత్‌ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనిపిస్తోంది. 

ప్రపంచ సేంద్రియ మార్కెట్‌ జోరు
ఆర్గానిక్‌ పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ వేగంగా పెరుగుతోంది. సేంద్రియ పాల మార్కెట్‌ ఏటా 6% పెరుగుతోంది. 2020లో 2 వేల కోట్ల డాలర్లుగా ఉండగా, 2026 నాటికి 3,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. అదేవిధంగా సేంద్రియ మాంసం ఉత్పత్తుల మార్కెట్‌ 7% పెరుగుతోంది. 2020లో 1,500 కోట్ల డాలర్ల నుంచి 2025 ఆఖరు నాటికి 2 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఆర్గానిక్‌ ఎగ్‌ మార్కెట్‌ మరింత వేగంగా 12.5% పెరుగుతోంది. 2023లో 370 కోట్ల డాలర్ల వ్యాపారం జరగ్గా 2032 నాటికి ఇది 1,070 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా.   

20% పెరుగుతున్న దేశీయ మార్కెట్‌
మన దేశంలో సేంద్రియ ఆహారోత్పత్తుల మార్కెట్‌ ఏటా 20% పెరుగుతోంది. కోవిడ్‌ తర్వాత సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. అనధికారిక పద్ధతుల్లో మార్కెటింగ్‌ ఊపందుకుంది. ఉత్పత్తిదారు నుంచి వినియోగదారులు నేరుగా కొంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి/ సేంద్రియ పంటల సాగును చాలా ఏళ్లుగా విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు సేంద్రియ పాడి పశువుల పెంపకం, సేంద్రియ గొర్రెలు/మేకల పెంపకం, సేంద్రియ కోడిగుడ్లు, కోడి మాంసం పెంపకంపై ఇప్పుడు దృష్టి సారించింది. 

ఎన్ పీఓపీ, పీజీఎస్‌ సర్టిఫికేషన్లు
2023–24లో మన దేశంలో 44.75 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు జరుగుతోంది. దీనితో పాటు 28.5 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం నుంచి సేంద్రియ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలున్న నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్  (ఎన్ పీఓపీ) సర్టిఫికేషన్  కలిగిన రైతులు 36 లక్షల టన్నుల సేంద్రియ దిగుబడులు పండించారు. దేశీయంగా అమ్ముకోవడానికి ఉద్దేశించిన పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్‌) సర్టిఫికేషన్  ఉన్న రైతులు 6.20 లక్షల టన్నులు పండించారు. ఈ రెండు రకాల సర్టిఫికేషన్లు పంటలతో పాటు పాలు, మాంసం, గుడ్లు, తేనె, ఆక్వా ఉత్పత్తులకు కూడా ఇస్తారు. 

ఎగుమతులకు అవకాశాలు
2023–24లో 2,61,029 టన్నుల (వీటి ఖరీదు రూ.4,008 కో­ట్లు) సేంద్రియ పత్తి, నూనెగింజలు, చెరకు, ధాన్యాలు, చిరు­ధా­న్యాలు, పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలను భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతి చేశాం. అమెరికా, యూరోపియన్  యూ­ని­యన్, కెనడా, బ్రిటన్, శ్రీలంక, స్విట్జర్లాండ్, వియత్నాం, ఆస్ట్రే­లియా తదితర దేశాలకు మనం సేంద్రియ ఉత్పత్తులు అమ్మాం. 

ఆయా దేశాల సేంద్రియ ప్రమాణాలకు తగిన రీతిలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్లు మన రైతులు ఉత్పత్తి చేస్తే, వాటిని ఎగుమతి చేయటం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేసియా, కెనడా దేశాల్లో సేంద్రియ మాంసం, గుడ్లు, పాలు, తేనెకు డిమాండ్‌ ఉంది. ఆ మార్కెట్ల ప్రత్యేక నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు  మౌలిక సదుపాయాలు, ఏర్పాటు చేసే పటిష్టమైన సమగ్ర విధానంతో పాటు రైతుల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.         

సేంద్రియ పశుపోషణలో ఎన్ ఎస్‌ఓపీ ప్రమాణాలు కీలకం
సేంద్రియ పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి చెయ్యాలనుకునే రైతులు, సంస్థలు నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్  (ఎన్ ఎస్‌ఓ­పీ) ప్రమాణాలు పాటించాలి. 
అవి: సహజ బ్రీడింగ్‌ పద్ధతులను అనుసరించటం.. జంతువుల ఆరోగ్యం– సంక్షేమానికి రక్షణ చర్యలు తీసుకోవటం.. సేంద్రియంగా పండించిన దాణాను, పశుగ్రాసాలను మేపటం.. పశువులను ఒకేచోట కట్టేసి ఉంచకుండా సహజ ప్రవర్తనను వ్యక్తీకరించేలా స్వేచ్ఛనివ్వటంతో పాటు ఒత్తిడిని తగ్గించడం ము­ఖ్యం. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అల్లోపతి ఔషధాలు, యాంటీ­బయాటిక్స్, హార్మోన్లు, పెరుగుదలకు బూస్టర్లు, దాణా మి­శ్రమాలు మొదలైన వాటి వాడకంపై నూటికి నూరు శాతం నిషేధం పాటించాలి. పెంచే పశువులు, జీవాల జాతుల ఎంపిక.. దాణా, ఆరోగ్య సంరక్షణ, పెంపకం, పేడ, మూత్రాల నిర్వహణ, సేంద్రియ పెంపక పద్ధతులకు మారే కాలం, షెడ్ల నిర్మాణంలో మెళకువలు, విశాలమైన స్థలం ఆవశ్యకత, ప్రతి పశువుకు గుర్తింపు చిహ్నం ఇవ్వటం, రవాణా పద్ధ­తులు, వధ–కోత అనంతర నిర్వహణలో నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. 

అన్ని విషయాలపై రికార్డులు తయారు చేయటం ముఖ్య­మైన విషయం. ఈ ప్రమాణాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతులను అలవాటు చేసుకోవటంలో రైతులకు, విస్తరణ సిబ్బందికి అవగాహన కల్పించటం కోసం హయత్‌నగర్‌­లోని ‘క్రీడా’ ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ గొర్రెల పెంపక యూనిట్‌ను ప్రారంభించాం. ఎన్‌పీఓపీ ధ్రువీకరణ ప్రమాణాలు పాటిస్తున్నాం. సేంద్రియ పశుపోషణ ద్వారా పాలు, మాంసం, సేంద్రియ కోళ్ల పెంపకంలో ఆసక్తి గల రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు­(ఎఫ్‌పీఓలు), సహకార సంఘాలకు ప్రామాణిక శిక్షణ ఇస్తాం.   
– డాక్టర్‌ పి. బస్వారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, 
ఐసీఏఆర్‌– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్‌ఐ), చెంగిచర్ల, హైదరాబాద్‌  040–29801672

ఏ జాతులనైనా సేంద్రియంగా పెంచవచ్చు
విదేశాల్లో పంటలు పండించే పొలాలు, పశువుల్ని పెంచే క్షేత్రాలు కలిసి ఉండవు. మన దేశంలో పంట­లు సాగు చేసే రైతులకు పశువుల పెంపకం కూడా ఉంటుంది. ప్రకృతి/సేంద్రియ సేద్యంలో పంటలు పండించే రైతుల పొలాల్లోనే సేంద్రియంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రో­త్స­హిస్తే సత్ఫలితాలు వస్తాయి. వారి సొంత పంట వ్యర్థాలను, సొంత ధాన్యాలను పశువులకు మేపటం ద్వారా నాణ్యతా ప్రమాణాలను సులువుగా ఆచరించవచ్చు. 

నేల–పశువు–పంట.. ఈ మూడింటి మధ్య సేంద్రియ అనుసంధానం చెయ్యాలి. ఈ విషయంలో మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఉన్న నైపుణ్యాలు వరంగా ఉపయోగపడతాయి. విదేశాలతో పోల్చితే రసాయనాలకు పెద్ద పీట వెయ్యని దేశం మనది. వ్యవసాయ రసాయనాలు వాడకం తక్కువగా ఉన్న కొండ/గిరిజన ప్రాంతాలపై తొలుత దృష్టిని కేంద్రీకరించి, ప్రోత్సహించాలి. దేశీ, నాటు పశువులను మాత్రమే సేంద్రియ పెంపకానికి వాడాలనేం లేదు. సంకరజాతి పశువులను నిస్సందేహంగా పెంచవచ్చు. 
– డాక్టర్‌ మహేశ్‌ చందర్, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ పశుపోషణ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌–ఐవీఆర్‌ఐ), ఇజ్జత్‌నగర్, ఉత్తరప్రదేశ్‌

పశు వ్యాధులకు సంప్రదాయ ఈవీఎం చికిత్స మేలు
పశు వ్యాధుల నివారణలో, చికిత్సలో యాంటీబయాటిక్‌ ఔషధాలను అతిగా వాడుతూ వాటికి నిరోధకత పెంచుకోవటం ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సుసంపన్న సంప్రదాయ సిద్ధ, ఆయు­ర్వేద విజ్ఞానంతో కూడిన మూలికా వైద్య చికిత్స (ఎత్నో వెటర్నరీ మెడిసిన్ –ఈవీఎం)ల ద్వారా పశువ్యాధు­లను జయించవచ్చు. 

24 ఏళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నా. వీటి పనితీరు ఎంత ప్రభావ­శీలంగా ఉందో 9 రాష్ట్రాల్లో 25 ఎన్ డీడీబీ అనుబంధ పాడి సహకార సంఘాల్లోని రైతుల అనుభవాలే తేటతెల్లం చేస్తున్నాయి. పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి అనేక తీవ్ర జబ్బులను సైతం కొద్ది రోజుల్లో ఈవీఎం మందులతో తగ్గించవచ్చని రుజువైంది. 11.2 లక్షల కేసుల్లో 80.4% జబ్బులు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీఎంల ప్రభావశీలతను గుర్తించింది. ఈవీఎంకు ఎవిడెన్ ్స బేస్‌డ్‌ మెడిసిన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, కచ్చితంగా ఫలితాలనిచ్చే పర్యావరణ హితమైన, ఆరోగ్యదాయకమైన చికిత్సలని గుర్తించాలి.
– ప్రొ. ఎన్ . పుణ్యమూర్తి, ఎన్ డీడీబీ కన్సల్‌టెంట్, టిఎఎన్ యువిఎఎస్‌ విశ్రాంత ఆచార్యులు, తంజావూరు, తమిళనాడు

సమగ్ర విధానం ద్వారా రైతులకు మార్గదర్శనం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్గానిక్‌ మాంసం, గుడ్లు, పాలు/పాల ఉత్పత్తుల పెంపకంపై కూడా దృష్టిని కేంద్రీకరించింది. సేంద్రియ మాంస ఉత్పత్తుల పెంపకం, మార్కెటింగ్‌ తదితర అంశాలపై రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పారిశ్రామికవేత్తల ఆకాంక్షలతో పాటు మా అనుభవాలను జోడించి కేంద్రానికి నివేదిక పంపుతాం. సమగ్ర విధాన రూపకల్పనకు ఇది దోహదం చేస్తుంది. 

సేంద్రియ పశుపెంపకంపై పరిశోధనలకు, విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. అపెడాలో సేంద్రియ పశు పెంపకం ప్రోత్సాహానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. అమూల్‌ వంటి నమ్మదగిన బ్రాండ్‌ ద్వారా విక్రయిస్తే సేంద్రియ పాలు, గుడ్లు, మాంసం అధిక ధర ఇచ్చి కొనటానికి దేశంలో ప్రజలు ఆసక్తితో ఉన్నారు. యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు సేంద్రియ పాలు, మాంసం ఎగుమతి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మార్గదర్శనం చేస్తాం.   
– డా. ఎస్‌. బి. బర్బుదే, సంచాలకులు, ఐసీఏఆర్‌– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్‌ఐ), చెంగిచర్ల, హైదరాబాద్‌
 
 – పంతంగి రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement