
సేంద్రియ వ్యర్థాలను 8 గంటల్లోనే కంపోస్టుగా మార్చే రాపిడ్ టెక్నాలజీని కనగొన్న స్టార్టప్
చెత్త నుంచి ఈ కంపోస్టరే ముందుగా ΄్లాస్టిక్ వ్యర్థాలను ఏరేస్తుంది
ఇప్పటికే దేశంలో 1500 చోట్ల పనిచేస్తున్న గోల్డ్ కంపోస్టర్లు
సేంద్రియ వ్యర్థాలను కేవలం 8 గంటల్లో కంపోస్టు ఎరువుగా మార్చే ఆధునిక టెక్నాలజీని బెంగళూరుకు చెందిన వేస్ట్ ఈజ్ గోల్డ్ అనే స్టార్టప్ రూపొందించింది. ఇంత సూపర్ ఫాస్ట్‌గా పోషకవంతమైన కంపోస్టు తయారు చేయగల మరో సంస్థ లేదు. 20 కేజీల నుంచి 10 టన్నుల చెత్తనైనా కేవలం ఎనిమిది గంటల్లో ఎటువంటి హానికరమైన వాయువులను వెలువరించకుండా కంపోస్టుగా మార్చేస్తోంది ఈ సంస్థ రూపొందించి గోల్డ్ కంపోస్టర్. ‘సేంద్రియ చెత్తను అత్యంత వేగంగా కంపోస్టుగా మార్చే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని, బయోరియాక్టర్ టెక్నాలజీని ఉపయోగించుకునే నాచురల్ బయో మెకానికల్ ప్రాసెస్‌ను అనుసరిస్తున్నాం. టన్నుల కొద్దీ చెత్తనైనా ఒక్క రోజులోనే ఎరువుగా మార్చేస్తాం’ అంటున్నారు ఈ స్టార్టప్ అధినేత తివారి.
‘అధికంగా వేడిని ఉత్పత్తి చెయ్యకుండా సేంద్రియ వ్యర్థాలను అతివేగంగా విచ్ఛిన్నం చేస్తున్నందు వల్ల మిథేన్ వంటి హానికారక వాయువులు వెలువడకుండా చూస్తున్నాం. దీని వల్ల వ్యర్థాలను కంపోస్టుగా మార్చే పనిలో కాలుష్యం లేకుండా పోయింది. ఆక్సిజన్‌ను ఉపయోగించే సూక్ష్మజీవరాశిని, బయో రియాక్టర్‌ను ఏరోబిక్ డీకంపోజిషన్ పద్ధతిలో వాడటం వల్ల ఇది సాధ్యపడుతోంద’న్నారాయన. మేం తయారు చేసే కంపోస్టును తిరిగి మళ్లీ ఏ ప్రాసెసింగ్ చెయ్యాల్సిన అవసరం లేదని, నిల్వ చేసుకోవచ్చు. లాండ్‌స్కేపింగ్ కోసమైతే అదే రోజు వాడుకోవచ్చు. వ్యవసాయం కోసమైతే 3 నుంచి 7 రోజులు మాగిన తర్వాత ΄÷లాల్లో వేసుకుంటే పోషకాలు పుష్కలంగా భూమికి అందుతాయ’న్నారు తివారి.
వండిన ఆహార వ్యర్థాలు, సేంద్రియ తడి చెత్త, ఎముకలు, మాంసం వ్యర్థాలు, ఈకలు, గుడ్ల పెంకులు, కూరగాయ వ్యర్థాలు, లేత కొబ్బరి బొండాల డొప్పలు, పండ్ల తోటల వ్యర్థాలు, గడ్డి కత్తిరింపులు, టిష్యూ పేపర్, ఎస్టీపీ వ్యర్థాలు.. వంటి వేటినైనా సరే తమ గోల్డ్ కంపోస్టర్ ద్వారా సమర్థవంతంగా 8 గంటల్లో కంపోస్టుగా మార్చవచ్చని తివారి చెబుతున్నారు.
ఇది నిజంగా గోల్డ్ కంపోస్టరే. ఎందుకంటే, పట్టణ వ్యర్థాలను సేకరించిన తర్వాత అందులోని కుళ్లే సేంద్రియ వ్యర్థాలను, కుళ్లని ΄్లాస్టిక్ తదితర వ్యర్థాలను వేరు చేయటం పెద్ద పని. ఈ పనిని కూడా గోల్డ్ కంపోస్టరే చేసేస్తుందని తివారి చెబుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణగా చెప్పవచ్చు.
ఇప్పటికే ఈ కంపోస్టర్లను దేశంలో 150 చోట్ల నెలకొల్పారు. 2,500 టన్నుల చెత్తను 1,200 టన్నుల కంపోస్టుగా మార్చేయటం కూడా జరిగిందట. అయితే ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. పదేళ్ల ప్రయాణం, ప్రయాస దీని వెనుక ఉంది అన్నారు తివారి.
ఈ గోల్డ్ కంపోస్టర్లను నగరాలు, పట్టణాల్లో కాలనీలు, వార్డులు, గేటెడ్ కమ్యూనిటీలు, అ పార్ట్‌మెంట్ల దగ్గర నెలకొల్పి ఎక్కడికక్కడే సేంద్రియ వ్యర్థాలను కంపోస్టుగా మార్చేస్తే.. నగరాలు, పట్టణాల మూలంగా చెత్త కొండలుగా పోగుపడే సమస్య ఇట్టే పరిష్కారమైపోతుంది. పార్కులకు, ఇంటిపంటలకు, పంట ΄÷లాలకు కూడా సిటీ కంపోస్టు పెద్ద పరిమాణంలో అందుబాటులోకి వస్తుంది. ఆల్ ద బెస్ట్ టు గోల్డ్ కంపోస్టర్!