breaking news
Sleeper bus
-
డిజైన్ లోపంతోనే మరణ మృదంగం
సాక్షి, అమరావతి : స్లీపర్ బస్సుల డిజైన్ లోపమే ప్రయాణికుల పాలిట మరణమృదంగం మోగిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకు, ప్రధానంగా రాత్రి వేళల్లో ప్రయాణానికి స్లీపర్ బస్సుల డిజైన్ ఎంతమాత్రం అనుకూలం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బస్ ఆపరేటర్లు లాభాపేక్షతో ఏఐఎస్ ప్రమాణాలను బేఖాతరు చేస్తుండటం సామాన్య ప్రయాణికుల పాలిట యమపాశంగా మారుతోంది. కర్నూలు జిల్లాలో 19మంది సజీవ దహనమైన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మరోసారి స్లీపర్ బస్సుల్లో భద్రతా లోపాలను వెలుగులోకి తెచ్చింది. కాగా చైనా, జర్మనీతోపాటు పలు యూరోపియన్ దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించిన విషయాన్ని నిపుణులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ట్యాంకు, బ్యాటరీ పక్క పక్కనే.. ఫ్యూయల్ ట్యాంకు, బ్యాటరీ కాంపోనెంట్ పక్కపక్కనే ఉండటం స్లీపర్ బస్సుల డిజైన్‌లో ప్రధానలోపం. దాంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణం మంటలు చెలరేగి బస్సు కేవలం కొన్ని నిముషాల్లోనే దగ్ధమైపోతోంది. 2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో బస్సుప్రమాదం తీవ్రత పెరగడానికి అదే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున సంభవించిన ప్రమాద తీవ్రతకు కూడా అదే కారణమై ఉంటుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. సీజీ లోపం.. బోల్తా కొడుతున్న బస్సులు స్లీపర్ బస్సుల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ(సీజీ) సక్రమంగా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బరువైన ఇంజిన్, చాసిస్ అట్టడుగున ఉండటంతో సీజీ తక్కువగా ఉంటోంది. అప్పర్ బెర్త్‌లపైకి ప్రయాణికులు చేరుకోగానే సీజీ పెరిగి బస్సు స్థిరత్వం తగ్గుతుంది. ఇక నిర్దేశిత ప్రమాణాల కంటే స్లీపర్ బస్సులు ఎత్తు ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో కూడా సీజీ తగ్గుతోంది. బస్సు ఇరుకైన మలుపుల్లో తిరుగుతున్నప్పుడు, రోడ్డుపై ఏదైనా హఠాత్తుగా అడ్డం వస్తే బ్రేక్ వేయగానే బస్సు వెంటనే అదుపు తప్పి బోల్తా పడుతోంది. తప్పించుకునేందుకు ఐదు నిమిషాలే సమయం.. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకునేందుకు గరిష్టంగా ఐదారు నిమిషాలే సమయం ఉంటుంది. ఆ అయిదు నిమిషాల్లో బస్సులో ఉండే 35 నుంచి 50 మంది ప్రయాణికులు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. బస్సుకు అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే తలుపులు లాక్ అయిపోతాయి. ప్రయాణికులు అందరూ వెనుక వైపు నుంచే బయటకు రావాల్సి ఉంటుంది. అయిదు నిముషాల్లో ప్రయాణికులు అందరూ బయటపడటం కష్టసాధ్యం. ఇరుకైన మార్గం స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులు అటూ ఇటూ వెళ్లేందుకు రెండు వైపులా ఉండే బెర్త్‌ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఓ వైపు రెండు బెర్త్‌లు మరో వైపు ఒక బెర్త్‌తో సీట్లు ఉంటాయి. సాధాణంగా ఒక స్లీపర్ బస్సులో 33 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. మల్టీ యాక్సెల్ బస్సుల్లో 36 నుంచి 40 బెర్త్‌ల వరకు ఏర్పాటు చేస్తారు. ఆ బెర్త్‌ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే అదీ నెమ్మదిగా నడిచేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లోనే ఒకేసారి ఇద్దరు మనుషులు నడిచేందుకు అవకాశం ఉండదు. అటువంటిది ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రయాణికుల కంగారు, ఆందోళనతో ఒకేసారి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారితీస్తుంది. దాంతో మృతుల సంఖ్య పెరుగుతుంది. డ్రైవర్లకు మగత... స్లీపర్ బస్సులు ఉదయం వేళల్లో ప్రయాణానికి డిజైన్ చేసినవి. రాత్రి వేళల్లో ప్రయాణానికి ఉద్దేశించినవి కావు. రాత్రి వేళల్లో స్లీపర్ బస్సులు ప్రయాణిస్తున్నప్పుడు స్లీపర్బస్సుల్లో వాతావరణం చాలా నిశ్శబ్ధంగా ఉంటుంది. దీనికి తోడు చుట్టూ చీకటి, బస్సు అత్యంత వేగంతో దూసుకుపోతుండటంతో డ్రైవర్లను మగత కమ్మేస్తుంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తమకు కొంత మగత కమ్ముతుందని 2018లో కేంద్ర రవాణాశాఖ నిర్వహించిన సర్వేలో కొందరు డ్రైవర్లు చెప్పడం గమనార్హం. చైనా, జర్మనీలలో నిషేధం డిజైన్ లోపం కారణంగా స్లీపర్ బస్సులను పలు దేశాలు ఇప్పటికే నిషేధించాయి. చైనా 13 ఏళ్ల క్రితమే స్లీపర్ బస్సును నిషేధించడం గమనార్హం. 2009 నుంచి 2012 మధ్య చైనాలో స్లీపర్ బస్సుల ప్రమాదాల్లో ఏకంగా 252 మంది మరణించారు. అన్ని ప్రమాదాలూ తెల్లవారు జామున 2 గంటల నుంచి ఉదయం 5గంటల మధ్యే సంభవించాయి. స్లీపర్ బస్సులపై అధ్యయనంలో నిపుణులు వాటి డిజైన్ లోనే లోపం ఉందని గుర్తించారు. ఆ వెంటనే చైనా ప్రభుత్వం స్లీపర్ బస్సుల రిజి్రస్టేషన్‌ను నిలిపివేసింది. జర్మనీ 2006లోనే స్లీపర్ బస్సులను నిషేధించింది. జర్మనీతోపాటు పలు యూరోపియన్ దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. ఇష్టానుసారం మార్పులు» బస్ ఆపరేటర్ల లాభాపేక్ష కూడా ప్రమాదాలలను మరింత పెంచుతోంది. స్లీపర్ బస్సుల భద్రతా ప్రమాణాల కోసం ‘ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్–119 (ఏఐఎస్ 119) ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కానీ బస్ ఆపరేటర్లు ఆ ప్రమాణాలకు విరుద్ధంగా బస్సుల బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. » ప్రమాదం సంభవిస్తే ప్రయాణికులు వెంటనే తప్పించుకునేందుకు స్లీపర్ బస్సుల్లో కనీసం 4 అత్యవసర ద్వారాలు (ఎమర్జెన్సీ విండో) ఉండాలి. అందులో రెండు పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఉండాలి. కానీ బస్ ఆపరేటర్లు స్లీపర్ బస్సుల్లో ఒకట్రెండు ఎమర్జెన్సీ విండోలే ఏర్పాటు చేస్తున్నారు. పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేయడం లేదు. » బస్సులో కింది బెర్త్ కనీసం 350 ఎంఎం ఎత్తులో ఉండాలి. కానీ 150 ఎంఎం నుంచి 200 ఎంఎం ఎత్తులోనే కింది బెర్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు. » బస్సులో మండే స్వభావం అతి తక్కువగా ఉండే మెటీరియల్ మాత్రమే వాడాలి. ఈ నిబంధనను బస్సు ఆపరేటర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బెర్త్ కవర్లు నుంచి కర్టెన్లు, ఇతర వస్తువులన్నీ త్వరగా మండే స్వభావం ఉన్న మెటీరియల్‌తోనే తయారు చేస్తున్నారు. దాంతో అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్ని కీలలు వేగంగా బస్సంతా వ్యాపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన బస్సులో ఇనుప ఉచలు మినహా పూర్తిగా దగ్ధం కావడమే అందుకు ఉదాహరణ. » ప్రమాదం సంభవిస్తే కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు ప్రతి సీటు వద్దా ప్రమాణిక సుత్తి ఉండాలి. కానీ బస్ ఆపరేటర్లు వాటిని ఏర్పాటు చేయడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని స్లీపర్ బస్సుల ప్రమాదాలు..» 2022 అక్టోబరులో మహారాష్ట్రలో వరత్నాయి నుంచి ముంబాయి వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. » 2023, జులై 1న మహారాష్ట్రలో ఓ స్లీపర్ బస్సు హైవే డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో 25 మంది మృత్యువాత పడ్డారు.» 2023లో రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు గురుగ్రాం వద్ద ప్రమాదానికి గురై 25 మంది మృతి చెందారు. » 2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన స్లీపర్ బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం చెందారు. -
ప్రైవేటు బస్సుల్లో ఎడాపెడా మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఓ భారీ లోపాన్ని ఎత్తిచూపింది. ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తొలుత సాధారణ సీటర్ బస్సుగా రిజిస్టర్ చేయించిన యాజమాన్యం.. ఆ తర్వాత దాన్ని నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బస్సుగా మార్పించింది. బస్సు తయారీ సంస్థలు స్లీపర్, సాధారణ సీటర్ బస్సులకు అనుగుణంగా వాటి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తాయి. కానీ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల తయారీ కంపెనీల ప్రమాణాలను కాదని సొంతంగా బస్సుల నిర్మాణాన్ని మారి్పంచుకుంటున్నారు.సీటర్ బస్సుల కంటే స్లీపర్ బస్సులకే ఎక్కువ డిమాండ్ ఉండటంతో గిరాకీ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో పాత సీటర్ బస్సులను అక్రమంగా స్లీపర్ సరీ్వసుగా మార్చి నడుపుతున్నారు. బస్సుల్లో ఎక్కువ సరుకులు పట్టేలాగా కూడా సొంతంగా మార్పులు చేయించుకుంటున్నారు. అలాగే స్లీపర్ బస్సుల్లో కర్టెన్లు, దుప్పట్లు, దిండ్లు వాడుతుండటం, నడిచే ప్రాంతం ఇరుకుగా ఉండటం, బెర్తులకు రక్షణ రాడ్లు ఉండటం తదితర కారణాలతో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడే లోపాలు, సమతూకం అగి్నప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకోవడాన్ని కష్టంగా మారుస్తున్నాయి. ఈ లోపాలన్నీ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సమయాల్లో వెలుగుచూస్తున్నా అధికారులు లంచాలు తీసుకొని వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్లీపర్ బస్సుల తయారీ నిబంధనలు ఇలా.. ⇒ స్లీపర్ బస్సుల్లో బెర్తులు 2+1 లేఅవుట్లో (ఒకవైపు 2 బెర్తులు, మరోవైపు ఒకటి). ⇒ ట్విన్ యాక్సిల్ బస్సులకు 30 బెర్తులకే (లోయర్ 15, అప్పర్ 15) పరిమితి. మొత్తం 30–36 బెర్తులు. ⇒ స్లీపర్ బస్సుల్లో 2+2 లేఅవుట్‌కు అనుమతి లేదు. ఒక బెర్తు 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు. ⇒ లోయర్ బెర్తు ఎత్తు 200–350 మి.మీ., హెడ్‌రూమ్ 800 మి.మీ. (నాన్–ఏసీ), 600 మి.మీ. (ఏసీ), కుషన్ మందం కనీసం 75 మి.మీ. ⇒ బస్సు పొడవు 12 మీటర్లు, బస్సు ఎత్తు 4.5 మీటర్లు. ⇒ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కనీసం 4 ( రెండు రూఫ్ హ్యాచ్‌లు) ఉండాలి. అత్యవసర సమయాల్లో కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు అన్ని సీట్ల వద్ద హ్యామర్ ఉండాలి. విదేశాల్లో స్లీపర్ బస్సులపై ఆంక్షలు, నిషేధం... ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. కొన్ని దేశాల్లో కఠిన ఆంక్షలున్నాయి. 2012 నుంచి చైనా స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. అంతకు ముందున్న బస్సులను కఠిన ఆంక్షల మధ్య మాత్రమే తిప్పుతోంది. కేవలం నాలుగేళ్లలో స్లీపర్ బస్సుల్లో జరిగిన ప్రమాదాల్లో 231 మంది మరణించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే జర్మనీ సైతం స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. పాత బస్సులను కూడా తొలగించింది. ఆ్రస్టియా, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో పరిమిత సంఖ్యలో, నిబంధనల ప్రకారం ఉన్న బస్సులనే అనుమతిస్తున్నారు. మంటలు అంటుకొనే అవకాశం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయా దేశాలు డీజిల్ బస్సులకు బదులు ఎలక్ట్రిక్ బస్సులకు వీలు కల్పిస్తున్నాయి. -
రోడ్డెక్కిన ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ బస్సులు.. స్పెషల్ ఫీచర్స్ ఇవే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం అత్యాధునిక హంగులతో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన లహరి ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి లహరి బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ అత్యాధునిక హంగులతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామన్నారు. ఇటీవల 756 సూపర్ లగ్జరీ బస్సులను కొనుగోలు చేసిందని, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజారవాణా వ్యవస్థను ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని, టీఎస్ఆర్టీసీ బస్సులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాయనే గొప్ప నమ్మకాన్ని కూడగట్టుకుందని చెప్పారు. సంస్థను లాభాల బాటపట్టించేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలను చేస్తోందని, సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్‌కు ధీటుగా అమ్మఒడి అనుభూతి ట్యాగ్ లైన్' పేరుతో లహరి ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చిందని, వీటిని ప్రజలు మంచిగా ఆదరించాలని కోరారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులనూ సమకూర్చుకుంటుందన్నారు. టీఎస్ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువచేయడంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ చేస్తోన్న కృషిని అభినందించారు. అలాగే, పేదల కనీస ప్రయాణ అవసరాలను తీర్చడంలో ప్రజా రవాణా వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. చదవండి: డబుల్ ఇంజన్ అంటే మోదీ-అదానీ: మంత్రి కేటీఆర్ ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses pic.twitter.com/WBrFy37xmt — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 26, 2023 టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. తొలిసారిగా అందుబాటులోకి తెస్తోన్న ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉందన్నారు. ఈ బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ లాభాల బాట పట్టేందుకు ప్రతి పౌరుడు సహకరించి సంస్థను ఆదరించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రజా రవాణా వ్యవస్థ ఉందనే విషయం మరచి పోవద్దన్నారు. సంస్థ ఎండీ వీ సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం 630 సూపర్ లగ్జరీ బస్సులను, 130 డీలక్స్ బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికోసం ఏసీ స్లీపర్ బస్సులను వాడకంలోకి తెస్తున్నామని వివరించారు. త్వరలోనే మరో 100 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వాటిని ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తొలిసారిగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లహరి బస్సుల్లో సీట్లను www.tsrtconline.in లో బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్‌తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానం కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభించింది తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
తెలంగాణ ఆర్టీసీ స్లీపర్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తోంది. లహరి పేరుతో రోడ్డెక్కుతున్న ఈ బస్సుల్లో తొలుత 10 సర్వీసులను సోమవారం ఉదయం ప్రారంభిస్తోంది. మరో ఆరు బస్సులను రెండు మూడు రోజుల్లో నడపనున్నారు. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న సర్వీసులతో పాటు సొంతంగా కొన్న బస్సులను ప్రారంభిస్తోంది. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్‌తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానాన్ని కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభిస్తోంది. తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ప్రత్యేకతలివే..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. బస్సు ప్రత్యేకతలివే! 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్ బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుంది. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
TSRTC: ఏపీకి స్పెషల్ స్లీపర్ బస్సులు.. ఛార్జీలు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం స్పెషల్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు సిటీ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ ఆర్టీసీ సైతం రెడీ అయ్యింది. ఈ ఏడాది పండుగ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను సిద్ధం చేసింది. పండుగకు ముందే స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రారంభించనుంది. ప్రయాణికులను ఆకర్షించే విధంగా లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సులను సిద్ధం చేసింది. సంక్రాంతికి 10 లహరి స్లీపర్ బస్సులను హైదరాబాద్ నుండి కాకినాడ, విజయవాడకు నడుపనుంది. ఇక, ఈ బస్సుల్లో మాములు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న విధంగానే సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను మేకింగ్ చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణ ఆర్టీసీలో మొదలైన సంక్రాంతి పండుగ
-
ప్రైవేట్ ట్రావెల్స్ కు ధీటుగా టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు
-
ప్రయాణికుల ఆదరణతో ప్రగతిరథం పరుగులు
భాగ్యనగర్‌కాలనీ (హైదరాబాద్): ప్రయాణికుల ఆదరణతో టీఎస్ఆర్టీసీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఆర్థికంగా పటిష్టంగా తయారవుతోందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. ప్రయాణికుల వల్లే ప్రగతిరథ చక్రం పరుగులు పెడుతోందని, 2022లో ప్రయాణిక దేవుళ్లు టీఎస్ఆర్టీసీని ఎంతగానో ఆదరించి, ప్రోత్సహించారని పేర్కొ న్నారు. బుధవారం కూకట్పల్లి సర్కిల్ భాగ్యనగర్ కాలనీలోని బస్‌స్టాప్‌లో కొత్త స్లీపర్, స్లీపర్ కమ్ సీట్ బస్సులను ఎండీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొ న్నారు. అనంతరం సజ్జనార్ మాట్లాడారు. గత 15 రోజుల క్రితం సూపర్ డీలక్స్ బస్సులను ప్రారంభించామని, ఈ నెలాఖరులో కొత్త ఏసీ బస్సులను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్లీపర్ బస్సులు హైదరాబాద్–విజయవాడ, కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. సీఎం సహకారంతో ఆర్టీసీ అభివృద్ధి: బాజిరెడ్డి ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించామని బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో ఆర్టీసీని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సంస్థలోని 50 వేల మంది ఉద్యోగుల కృషి వల్లే రోజు రోజుకూ రెవెన్యూ మెరుగుపడుతోందని చెప్పారు. -
టీఎస్ ఆర్టీసీలో స్లీపర్ బస్సులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. అశోక్‌లేలాండ్ కంపెనీకి చెందిన ఈ బస్సులకు ఓ ప్రైవేటు సంస్థలో బాడీలు రూపొందిస్తున్నారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 బస్సులను కొనాలని నిర్ణయించి టెండర్లు పిలవగా, అశోక్‌లేలాండ్ కంపెనీ కాంట్రాక్టు పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ బస్సులకు సంబంధించి చాసిస్‌లను తయారు చేసిన ఆ కంపెనీ, మరో ప్రైవేటు కంపెనీతో కలసి వాటికి పూర్తి రూపాన్ని ఇస్తోంది. ఆ పని కూడా దాదాపు పూర్తయింది. అన్ని బస్సులు ఆర్టీసీ చేతికి రావడానికి దాదాపు సిద్ధమయ్యాయి. కొత్త బస్సు సర్వీసులకు ఆర్టీసీ ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. పేరు ఖరారు కాగానే బస్సుపై రాసి లేలాండ్ కంపెనీ.. ఆర్టీసీకి అందించబోతోంది. ఆ వెంటనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు..: హైదరాబాద్ కేంద్రంగా పెద్ద సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలకు నడుస్తున్నాయి. అవన్నీ దాదాపు రాత్రివేళనే హైదరాబాద్‌నుంచి బయలుదేరుతున్నాయి. ఈ ట్రావెల్స్ సంస్థలు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా 80 శాతం స్లీపర్ బస్సులనే తిప్పుతున్నాయి. రైళ్ల తరహాలో రాత్రి వేళ పడుకుని ప్రయాణించేందుకే ఇష్టపడుతున్న ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులవైపే మొగ్గుచూపుతున్నారు. ఆర్టీసీలో స్లీపర్ బస్సులు లేకపోవటంతో ప్రయాణికుల ఆదరణను చూరగొనలేకపోతోంది. దీనిని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు అశోక్‌లేలాండ్ బస్సుల సరఫరాకు కాంట్రాక్టు దక్కించుకుంది. కాగా, మరో నెలరోజుల్లో స్లీపర్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. వాటిని ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ, ఏలూరు, ఒంగోలు లాంటి పట్టణాల మధ్య తిప్పనున్నారు. ఈ బస్సులకు ఆదరణ బాగుంటే వెంటనే మరికొన్ని బస్సులను సమకూర్చుకోవాలని ఎండీ భావిస్తున్నారు. వీటికి తోడు త్వరలో అద్దె ప్రాతిపదికన నాన్ ఏసీ స్లీపర్ బస్సులను కూడా సమకూర్చుకోనున్నారు. టీఎస్ఆర్టీసీలో తొలిసారి.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా వెన్నెల పేరుతో కొన్ని స్లీపర్ బస్సులుండేవి. అవన్నీ ఏపీ పరిధిలోని డిపోల్లోనే ఉండేవి. దీంతో రాష్ట్రం విడిపోయాక అవి ఏపీఎస్ ఆర్టీసీకే దక్కాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సమకూర్చుకుంటున్న కొత్త స్లీపర్ బస్సులే తెలంగాణకు తొలి స్లీపర్ సర్వీసులు కానున్నాయి. వీటìకి మంచి ఆదరణ లభిస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. బస్సు లోపల కిందరెండు, పైన రెండు చొప్పున రెండు వరసల్లో బెర్తులుంటాయని అధికార వర్గాలు చెపుతున్నాయి. -
ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట.. గేర్ మార్చిన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: డొక్కు బస్సులతో నత్తనడకన సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ గేర్ మార్చింది. కొత్త బస్సులు కొనే దిశగా వేగం పెంచింది. 1,016 కొత్త బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. తయారీదారులకు ఆ బస్సుల గురించిన వివరాలు అందించి కొటేషన్లు ఆహ్వానించింది. అవి విడతలవారీగా మరో నాలుగైదు నెలల్లో ఆర్టీసీ చెంతకు చేరనున్నాయి. కాలం చెల్లిన వాటితోపాటు డొక్కుగా మారిన బస్సులతోనే ఆర్టీసీ ఇంతకాలం నెట్టుకొస్తోంది. అయితే ఇటీవల కండీషన్ లేని బస్సుల వల్ల ప్రమాదాలు పెరగడంతో వాటిని తొలగించడానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వరసగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా అద్దె బస్సులే ఉంటున్నాయి. కొన్ని సొంత బస్సులు కూడా ప్రమాదాలకు కారణమవుతుండటాన్ని ఆర్టీసీ తీవ్రంగానే పరిగణిస్తోంది. పది రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో కొత్త బస్సులు కొనే అంశాన్ని చర్చించారు. ఆ వెంటనే బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. కొత్త బస్సులను కొత్త ప్రాంతాలతోపాటు కొరత ఉన్న చోట తిప్పనున్నారు. కాగా, ఆర్టీసీ తొలిసారి స్లీపర్ బస్సులు కొనబోతోంది. ఇప్పుడు కొనేవాటిల్లో 16 ఏసీ స్లీపర్ బస్సులు ఉన్నట్టు ప్రకటించింది. (చదవండి: పడవతో గస్తీ..లేక్ పోలీసింగ్ వ్యవస్థ) -
త్వరలో టీఎస్ఆర్టీసీలో స్లీపర్ సర్వీసులు!
సాక్షి, హైదరాబాద్: దసరా రద్దీ.. నగరం నుంచి ఏపీ సహా దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ సరీ్వసులన్నీ నిండిపోయాయి. ఆన్లైన్ రిజర్వేషన్లో సోమవారం రోజున సీట్లు ఖాళీ లేవని చూపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దూరప్రాంతాల సరీ్వసుల్లో ఆక్యుపెన్సీ రేషియో 60 శాతమే. ఎందుకీ తేడా.. ఆరీ్టసీ, ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య ఆక్యుపెన్సీ రేషియోలో తేడాలుండటానికి ప్రధాన కారణం స్లీపర్ సర్వీసులే. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రి పడుకుని ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రైవేట్ ట్రావెల్స్ తమ బస్సుల్లో సింహభాగం స్లీపర్ సర్వీసులుగా మార్చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి దాదాపు వేయికి పైగా స్లీపర్ సర్వీసులు నడుస్తున్నాయని అంచనా. దీనిపై ఇప్పుడు ఆర్టీసీ కూడా మేల్కొంది. కొత్తగా స్లీపర్ సర్వీసులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది.\ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆరీ్టసీలో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా స్లీపర్ సర్వీసుల అంశాన్ని ఎండీ ప్రస్తావించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండేందుకు ఇదే ప్రధాన కారణమంటూ అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. గతంలో ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు ప్రారంభించాలని నిర్ణయించినా, ఓ ఉన్నతాధికారి అడ్డుకోవడంతో అది అటకెక్కిందని చెప్పారు. ఇప్పుడు కొన్ని బస్సులు నడిపితే వాటికి ఆదరణ ఎలా ఉందో తెలుస్తుందని సూచించారు. దీంతో స్లీపర్ సర్వీసులు తీసుకునేందుకు ఎండీ సంసిద్ధత వ్యక్తంచేశారు. కాస్త ఆదాయం మెరుగుపడిన తర్వాత బ్యాంకుల నుంచి కొత్తగా రుణం తీసుకుని కొన్ని స్లీపర్ సరీ్వసులు సమకూర్చుకోవాలని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. నాన్ ఏసీ స్లీపర్‌కు గిరాకీ ఎక్కువ.. దాదాపు నాలుగైదేళ్ల క్రితం వరకు ప్రైవేట్ ట్రావెల్స్‌లో సాధారణ బస్సులే ఎక్కువగా ఉండేవి. 20 శాతమే స్లీపర్ బస్సులుండేవి. ప్రయాణికుల నుంచి స్లీపర్‌కు డిమాండ్ పెరగడంతో చాలా బస్సులను ట్రావెల్స్ నిర్వాహకులు స్లీపర్లుగా మార్చారు. వీటిల్లోనూ నాన్ ఏసీ బస్సులకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. స్లీపర్ సర్వీసులపై లాభాలెక్కువగా ఉండటంతో క్రమంగా వాటి సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఇదే బాటపట్టింది. కాగా, సజ్జనార్ స్లీపర్ బస్సులను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉండటంతో, గరుడ ప్లస్ బస్సుల్లో కొన్నింటిని స్లీపర్ నమూనాలోకి మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు. -
కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం
జైపూర్: ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన డ్రైవర్, కండక్టరే కర్కశంగా కదులుతున్న బస్సులోనే ఓ మహిళ(36)పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని పిలానీ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని పిలానీ నుంచి హరియాణాలోని లోహారుకు వెళ్తున్న స్లీపర్ బస్సులో ఈ ఘటన జరిగింది. ‘బస్సులో నేను ఒక్కదానినే ఉన్నాను. మొదట నాపై కండక్టర్ కాలియా(36) అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత డ్రైవర్ కూడా నాపై అత్యాచారం చేశాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలివెళ్లారు’ అని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసు అధికారొకరు తెలిపారు. -
పెరిగిన స్లీపర్‌బస్సు చార్జీలు
పింప్రి, న్యూస్‌లైన్: మహారాష్ర్ట రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) ఆకస్మాత్తుగా వోల్వో ఏసీ స్లీపర్ బస్సుల చార్జీలు పెంచడంతో దీపావళికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులపై తీవ్రభారం పడుతోంది. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు డిమాండ్ పెరగడంతో అవి తమ ఇష్టం వచ్చినట్లు చార్జీలను వసూలు చేస్తున్నాయని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై నుంచి చాలా మంది నిత్యం హైదరాబాద్, విజయవాడ, ఔరంగాబాద్, బెల్గావ్, హుబ్లీ, సూరత్, అకోలా, నాగ్‌పూర్‌కు వె ళ్తుంటారు. వోల్వో బస్సులో అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం రూ.1,000 ఉండగా దానిని ఇప్పుడు రూ.2,500లకు పెంచారు. నాగ్‌పూర్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం రూ.1,100 ఉండగా రూ.2,500లకు పెంచారు. హుబ్లీకి ప్రస్తుత చార్జీ ధర 1,000 ఉండగా రూ.2,000లకు పెంచారు. హైదరాబాద్‌కు ప్రస్తుతం రూ.1,500 ఉండగా రూ.3,000లకు పెంచారు, బెంగుళూరు రూ.1,300 ఉండగా, రూ.2,500లకు పెంచారు. సూరత్‌కు వెళ్లేందుకు ప్రస్తుత చార్జీ రూ.500 ఉండగా రూ.1,000, అకోలాకు రూ.600 ఉండగా, రూ.1,600లకు పెంచారు. బెల్గావ్‌కు ప్రస్తుత చార్జీ రూ.400 కాగా ఇక నుంచి రూ.900 చెల్లించాలి. ఇక ప్రైవేట్ బస్సుల్లో వేర్వేరు చార్జీలతో టికెట్లు విక్రయించడంతో సామాన్య ప్రజలు దేనిని ఎంచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది తమ ప్రయాణాలనే వాయిదా వేసుకుంటున్నారని బాంద్రాకు చెందిన తెలుగువ్యక్తి ఒకరు అన్నారు. రైళ్లలో వెళ్దామనుకున్నా ఏ బోగీ చూసినా కిక్కిరిసి కనిపిస్తోందని, రోజూ రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల చుట్టూ తిరగలేక ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నామని వివరించారు. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు ఇది వరకే పూర్తి కావడం, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో సెలవులు వృథా అవుతున్నాయని విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అధ్వానంగా ఉంటుందన్నాయని చెబుతున్నారు. రైల్వే పండగ సమయాల్లోనైనా జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.


