భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలం గట్టు గుడెం వద్ద KVR ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బోల్తా పడింది.నలభై మంది ప్రయాణీకులతో రాజమండ్రి నుండి హైద్రాబాద్ కు వెళుతున్న KVR ట్రావెల్స్ స్లీపర్ బస్సు అశ్వారావుపేట దాటి ఇరవై కిలోమీటర్లు వెళ్లిన తర్వాత గట్టుగూడెం వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి బోల్తాపడింది. బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా 12 మందికి గాయాలయ్యాయి.
అందరూ నిద్రలో ఉండగా ఒక్కసారిగా బస్సు తిరగబడి పోవడంతో చీకట్లో ఏం జరిగిందో కూడా అర్ధం కాని స్థితిలో ఒకరిపై ఒకరు పడిపోవడం, దెబ్బలు తగలడం, బస్సుకు ఎలాంటి ఎగ్జిట్ డోర్ లు లేకపోవడంతో అరుపులు, హాహాకారాలు మిన్నంటాయి. నేషనల్ హైవే కావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ఒక్కొక్కరిని బయటకి తీశారు.
సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను పోలీస్ వాహనాల్లో, అంబులెన్సుల్లో దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతుండగా, నిజానిజాలు రవాణాశాఖ అధికారుల దర్యాప్తు లో తేలాల్సి ఉంది.


